స్పాట్ లైట్

లిబియా శాంతికి రష్యా ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్షుభిత లిబియాలో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు రెండేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో కుదిరిన ఒప్పందం అమలుపై రష్యా దృష్టి పెట్టింది. లిబియా సైనిక కమాండర్ ఖలీఫా హఫ్తర్, ఆయన ప్రత్యర్థి, ఐరాస మద్దతుతో కొనసాగుతున్న ప్రధాని ఫేయజ్ అల్ సర్రాజ్‌లు ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికింది. దేశంలో అరాచక పరిస్థితులకు తెరదించి సత్వర ప్రాతిపదికన శాంతియుత పరిస్థితుల్ని పునరుద్ధరించడంలో భాగంగానే రష్యా మద్దతును కోరేందుకు లిబియా సైనిక కమాండర్ ఇటీవల ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోన్‌ను కలుకుకున్నట్టుగా చెబుతున్నారు. స్కిహిరత్ రాజకీయ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రధాని సర్రాజ్‌తో కలిసి పనిచేయాలన్న స్పష్టమైన సంకేతాల్ని ఈ సందర్భంగా రష్యా అందించినట్టుగా తెలుస్తోంది. 2015లో ఐరాస నేతృత్వంలో కుదిరిన ఈ ఒప్పందాన్ని హఫ్తర్, ఇతర ప్రత్యర్థి వర్గాలు తిరస్కరించాయి. అయితే తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రధానితో కలిసి ఈ ఒప్పందాన్ని కొంత మేరకైనా ముందుకు తీసుకెళ్లేందుకు సైనిక కమాండ్ హఫ్తర్ సంసిద్ధత వ్యక్తం చేయడంతో రష్యా జోక్యం చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. ఆరేళ్ల క్రితం నియంత గద్ధ్ఫా శకం ముగిసినప్పటి నుంచీ లిబియాలో అరాచక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని ట్రిపోలి మినహా దేశంలోని మిగతా ప్రాంతాలన్నింటిలోనూ రెబెల్స్ పట్టు కొనసాగడం వల్ల ప్రధాన మంత్రి సర్రాజ్ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో పడ్డారు. కేవలం ట్రిపోలీ మినహా దేశంలో ఎక్కడా ఆయన మాట వినే పరిస్థితి లేకుండా పోవడంతో రాజకీయ అనిశ్చితి మరింత తీవ్రంగా మారింది. గత ఏడాదే సర్రాజ్‌ను జాతీయ ప్రభుత్వ సారధిగా ఐరాస నియమించింది. అయినప్పటికీ ఆయనకు అడుగడుగునా అడ్డుకట్ట వేస్తూ సైనిక కమాండర్ హఫ్తర్ లిబియా సుదూర ప్రాంతాల్ని కేంద్రంగా చేసుకుని ప్రత్యామ్నాయ పాలన సాగిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చి దేశంలో శాంతియుత పరిస్థితుల్ని పాదుగొల్పేందుకు దీర్ఘకాలంగా జరిగిన ప్రయత్నాలకు గతనెల్లో కొలిక్కి వచ్చాయి. ఇద్దరు ప్రత్యర్థులు కాల్పుల విరమణకు అంగీకరించడమే కాకుండా దేశంలో ఎన్నికలు నిర్వహించేందుకూ సన్నద్ధమయ్యారు. అందుకు సంబంధించిన ప్రణాళికను ఐరాస భద్రతా మండలి కూడా ధృవీకరించింది. అయితే ప్రత్యర్థుల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఎంతకాలం నిలుస్తుంది? అనుకున్న ప్రకారం ఎన్నికలు జరిగి శాంతియుత వాతావరణం ఎప్పుడు ఏర్పడుదుందన్నది ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. రష్యా జోక్యంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తేనే లిబియాలో మళ్లీ శాంతియుత పరిస్థితులకు ఆస్కారం ఏర్పడుతుంది. లేదంటే ఈ రాజకీయ అనిశ్చితి రావణ కాష్టంలా నిరంతరం మండుతూనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

చిత్రం.. ఫేయజ్ అల్ సర్రాజ్, ఖలీఫా హఫ్తర్