స్పాట్ లైట్

బ్రెగ్జిట్ చతికిల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం అన్నది అంత తేలిగ్గా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ మెలికలుగా మారుతున్న పరిస్థితి ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి ఎంతమాత్రం అవకాశాన్ని ఇవ్వడం లేదు. ఈపాటికే చర్చలు మొదలై విడాకుల వ్యవహారం ఓ కొలిక్కి రావాల్సి వుండగా, అలాంటి ఛాయలేవీ వాస్తవికంగా కనిపించడం లేదు. ఈ పరిస్థితికి ఇటు బ్రిటన్, అటు ఐరోపా యూనియన్‌లు పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడంతో భవిష్యత్ ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్ ప్రజలు ఓటు వేసినప్పటికీ దీన్ని వ్యతిరేకించిన వారి సంఖ్య కూడా తక్కువేమీ కాకపోవడంతో ఈ నిష్క్రమణ వ్యవహారం ఎప్పటికప్పుడు కొత్త సమస్యలకు ఆద్యంత పోస్తూనే వస్తోంది. ముఖ్యంగా లేబర్ పార్టీ అనేక ముడులు పెట్టడంతో ప్రధాని థెరిసా మే ఏ విధంగానూ ముందుకు వెళ్లలేకపోతున్నారు. పార్లమెంటులో తనకు మెజారిటీ లేదు కాబట్టి ఇతర పార్టీలపై ఆధారపడడం వల్లే బ్రెగ్జిట్ లక్ష్యాలను సాధించుకోలేకపోతున్నామని భావించి థెరిసా ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లి భంగపడ్డారు. అంతకుముందున్న మెజారిటీ కూడా పోవడంతో మరో చిన్న పార్టీపైనే ఆధారపడి అధికార మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఆమెకు ఏర్పడింది. ఇప్పుడు కచ్చితంగా అన్ని పార్టీలూ సహకరిస్తే తప్ప ఐరోపా యూనియన్ నుంచి అనుకున్న స్థాయిలో ప్రయోజనాలను రాబట్టుకునే అవకాశమే బ్రిటన్‌లో అధికార కన్సర్వేటివ్ పార్టీకి లేదు. ఇప్పుడీ వ్యవహారం అంతర్గత స్థాయి దాటి ఐరోపా యూనియన్ - బ్రిటన్‌ల మధ్య తీవ్రస్థాయి వివాదానికి ఆజ్యం పోస్తోంది. అసలు థెరిసా ఏమి కావాలనుకుంటున్నారో ఏ రకంగా చర్చలను ప్రారంభించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదంటూ ఐరోపా యూనియన్ ప్రతిదాడికి దిగడంతో పరిస్థితి జటిలంగా మారింది. ఈ నేపథ్యంలో ఆగిన చర్చలు ఎప్పుడు మొదలవుతాయి? ఒకవేళ మొదలైనా ఎంత సజావుగా సాగుతాయన్నది అనుమానంగానే కనిపిస్తోంది. బ్రెగ్జిట్ చర్చల విషయంలో తనకు పూర్తి స్థాయి స్పష్టత ఉందని ప్రధాన సంధానకర్త మైఖేల్ బార్నీర్ చెబుతున్నారు.మొదటినుంచీ కూడా తాము ఇదే వైఖరిని అవలంబిస్తున్నామని, అసలు స్పష్టత లేనిదల్లా బ్రిటన్‌కే నంటూ ఆయన తీవ్రస్థాయి ఆరోపణలు చేయడం అసలులే ఎసరన్న పరిస్థితికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ వైఖరిని చాలా స్పష్టంగానే వ్యక్తీరించడానికి గట్టి ప్రయత్నమే జరుగుతోంది. ఇవేవీ కూడా ఐరోపా యూనియన్‌ను కదల్చలేదు. ముఖ్యంగా ఇతర దేశాలకు చెందిన పౌరుల విషయంలో బ్రిటన్ వైఖరేమిటి? బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వీరి భవితకు బ్రిటన్ పాలకులు ఇచ్చే హామీ ఏమిటన్నది తేలాల్సిందేనని ఐరోపా యూనియన్ పట్టుబడుతోంది. ఈ పరిస్థితుల్లో అసలు బ్రెగ్జిట్ చర్చలు నిర్ణీత కాలవ్యవధి ప్రకారం ముందుకు సాగి పూర్తయ్యే అవకాశం ఉందా లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితులు ఉండిపోతాయా అన్నది కూడా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో థెరిసాకు మెజారిటీ వచ్చివుంటే పరిస్థితి మరోలా ఉండేది. కాని ఇప్పుడు పార్లమెంటులోని ప్రతి పార్టీ కూడా ఆమెను నిలదీయడంతో ఎటూ పాలుపోక దిక్కుతోచని స్థితిలోనే థెరిసా మే ఉన్నారు. రానున్న కొన్ని రోజుల్లోనైనా తాను ఆశించిన రీతిలో బ్రెగ్జిట్‌ను ముందుకు తీసుకెళ్లగలుగుతారా లేదా అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. ఈ విషయంలో ఆమె ఏమాత్రం విఫలమైనా బ్రెగ్జిట్ వ్యతిరేక వర్గాలు పుంజుకుని తమ పట్టును బిగించే అవకాశాలు స్పష్టమే అనడంతో ఎలాంటి సందేహం లేదు.

బి.రాజేశ్వర ప్రసాద్