స్పాట్ లైట్

భారత్ వ్యూహాత్మక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో, ఎవరిపై ఎవరు పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తారో అన్నది అనేక భౌగోళిక, రాజకీయ, ఆర్థికపరమైన అంశాలతో కూడుకున్న వ్యవహారం. భారత్‌తో సన్నిహితంగా ఉన్న దేశాలను తమవైపు తిప్పుకోవడానికి తాయిలాలు, బుజ్జగింపుల ద్వారా వాటిని ఆకట్టుకోవడానికి ఇప్పటివరకూ చైనా చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే శ్రీలంక, నేపాల్, భూటాన్ దేశాలను భారత్ ప్రభావం నుంచి తప్పించి తన ప్రాబల్యం లోకి తెచ్చుకోవడానికి అనేక రకాలుగా చైనా చేసిన ప్రయత్నాలను భారత్ అడ్డుకుంటూ వచ్చింది. తాజాగా మైన్మార్ విషయంలోనూ ఇదే తరహా కుత్సిత వ్యూహంతో డ్రాగన్ ఎత్తులు వేసినప్పటికి వాటిని చిత్తుచేసే రీతిలోనే భారత్ వ్యవహరించడం వ్యూహాత్మకంగా, దౌత్యపరంగా సాధించిన విజయంగానే భావించాలి. ఇప్పటికే మైన్మార్‌పై చైనా అనేక రకాలుగా ప్రభావాన్ని కనబరుస్తున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన పర్యటన అనేక రకాలుగా రాజకీయ ప్రయోజనాన్ని కలిగించిందనే చెప్పాలి. బ్రిక్స్ సమావేశాన్ని ముగించుకుని నేరుగానే మైన్మార్ వెళ్లిన మోదీ ఆ దేశ నాయకురాలు ఆంగ్‌సాన్ సూకీతో జరిపిన చర్చలు ఆర్థికంగానే కాకుండా, వ్యూహాత్మక ప్రాధాన్యతనూ సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే అనేక రకాలుగా మైన్మార్‌ను ఆకట్టుకునేందుకు చైనా ఎంతగానో సహాయ సహకారాలు అందించింది. గ్యాస్ పైప్‌లైన్‌తోపాటు ఓ కీలక రేవు పట్టణాన్ని నిర్మించుకోవడంలోనూ సహకరిస్తోంది. దానికి అనుకూలంగా ఉన్న దేశాలను చైనా ప్రభావం నుంచి తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న భారత్‌కు ఇటీవల నరేంద్ర మోదీ జరిపిన పర్యటన అనేక రకాలుగా సానుకూల ఫలితాలను అందించింది. మైన్మార్‌పై చైనా ప్రభావానికి చెక్ పెట్టాలంటే ఈ చిరుదేశాన్ని భారత్ కూడా అనేక రకాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది వాస్తవం. అలాగే రోహింగ్యా అంశాలపై కూడా ప్రపంచ దేశాలన్నీ మైన్మార్‌పై విరుచుకు పడుతున్నప్పటికీ భారత్ మాత్రం సంయమనంతో సమతూక ధోరణితోనే వ్యవహరిస్తూ వచ్చింది. మైన్మార్‌లో మైనారిటీ ముస్లింలైన రోహింగ్యాలు అక్కడ జరుగుతున్న దాడులను తాళలేక బంగ్లా, భారత్‌లకు వలసపోతున్న నేపథ్యంలో సూకి, మోదీల మధ్య జరిగిన సమావేశం కీలక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పాలి. ముఖ్యంగా భారత్ నుంచి రోహింగ్యాలను వెనక్కి పంపాలా వద్దా అన్నది అత్యంత కీలకమైన అంశం. స్వదేశంలో ఏమాత్రం భద్రత లేని రోహింగ్యాలను వెనక్కి పంపేస్తే అక్కడి సైనిక దళాలకు వారిని అప్పగించినట్లే అవుతున్నది వాస్తవం. ఓవైపు చైనా ప్రాబల్యం నుంచి మైన్మార్‌ను తప్పించడంతోపాటు ఇతర అంశాలలో దానికి సహకరించడం ద్వారా దానిపై తన ప్రాబల్యం చెక్కుచెదరకుండా చూసుకోవాల్సిన అవసరం భారత్‌కు ఎంతైనా ఉంది. ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన రోజునుంచి ప్రాంతీయ దేశాలతో మైత్రీ బంధాన్ని పెంపొందించుకోవడానికి నరేంద్ర మోదీ విశేష ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అదే విధంగా అటు అభివృద్ధి చెందిన దేశాలతోనూ, చెందుతున్న దేశాలతోనూ అదేరకమైన సాన్నిహిత్యాన్ని బలోపేతం చేసుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న ఆశయాన్ని సాకారం చేసుకోవాలంటే మైన్మార్ వంటి దేశాలను అన్ని విధాలుగా ఆదుకోవడం ద్వారా దక్షిణాసియాలో భారత్ తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూకీ, మోదీల మధ్య జరిగిన చర్చలు ఇందుకు అనేక రకాలుగా దోహదం చేసేవేనన్నది ఎంతైనా వాస్తవం. మోదీ తాజాగా జరిపిన విదేశీ పర్యటన బ్రిక్స్ పరంగా ఆర్థిక పరమైన లాభాన్ని చేకూర్చడంతోపాటు రాజకీయంగానూ మైన్మార్‌ను ఆకట్టుకునేందుకు దోహదం చేసింది.