స్పాట్ లైట్

విలయాలు.. ప్రళయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కొన్ని రోజులుగా ప్రపంచ దేశాలను ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఇర్మా హరికేన్ హడలెత్తిస్తోంది. అసాధారణమైన సాంకేతిక విజ్ఞానం, పరిజ్ఞానం ఉన్నా ఎలాంటి విపత్తునైనా తట్టుకోగలిగే శక్తిసంపత్తులు మేటవేసుకున్నప్పటికీ ప్రకృతి విలయాన్ని తట్టుకోవడం అన్నది ఎవరి తరమూ కాదు. గత కొద్ది దశాబ్దాలుగా వాతావరణం వెడెక్కిపోవడానికి, పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడానికి అసాధారణ పరిమాణంలో కాలుష్య ఉద్గారాలను విసర్జించడమే ప్రధాన కారణంగా చెబుతూ వస్తున్నారు. వీటి పరిమాణాన్ని తగ్గించుకోవాలని, ధనిక-పేద అన్న తేడా లేకుండా అన్ని దేశాలూ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఉపక్రమించాలంటూ ఎన్నో సదస్సులు, అధ్యయనాలు, శిఖరాగ్ర సభలు జరిగాయి. కాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. పర్యావరణ మార్పుల పాపం ఎవరిది? కాలుష్య ఉద్గారాల విసర్జన పరిమాణంలో ఎవరి వాటా ఎంత అనే చర్చను పక్కనబెడితే మొత్తం ప్రపంచ వ్యవస్థే ఉమ్మడిగా విఫలం కావడం వల్ల ప్రకృతి పరమైన విలయాలు, విపత్తులు, అనర్థాలు, ప్రళయాలు ఓ పరంపరగా సంభవిస్తే జనకోటి జీవితాలను నిర్వీర్యంగా, నిస్తారంగా మారుస్తున్నాయి. మనిషి ఎంత ఎదిగినా, ఎంత శక్తి సంపన్నుడైనా భూతల గగనతలాలను అధిగమించే సాంకేతిక యుక్తిని గుప్పెట పట్టినా కూడా ప్రకృతి ఆగ్రహిస్తే క్షణాల్లో అంతా విలయమే. అనుగ్రహిస్తేనే అభివృద్ధి, ప్రగతి అన్నది వాస్తవం. తాగాజా అమెరికాను కుదిపేస్తున్న ఇర్మా హరికేన్ నేపథ్యంలో అసలు ఈ రకమైన పెను విలయాల తీవ్రత గురించి, అవి ఎప్పుడు ఏ తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాస్తవాల గురించి కొంతైన అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరం. మనం తెలుగులో ప్రతిదాన్ని తుపానుగా, ఓ స్థాయి దాటితే పెను తుపానుగా, ప్రళయంగా, విలయంగా పరిగణిస్తాం. ఆంగ్లంలో హరికేన్లు, టైఫూన్లు, సైక్లోన్లకు పర్యాయపదాలే ఇవి. అన్నీ ప్రకృతిలో పుట్టి విలయానికి సంకేతంగా మారే ఉపద్రవాలే. పేరేదైనా ఇలాంటి ప్రళయాల సంభవించేది పెనువిధ్వంసమేనన్నది వాస్తవం. ఇలాంటి ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. సాధారణ గాలివాన మొదలుకుని సముద్ర గర్భంలో సంభవించే అగ్నిపర్వత విస్పోటనాల వల్ల తలెత్తే సునామీల వరకు అన్నీ వినాశకరమైనవే. ఇవి ఎక్కడ సంభవించినా వాటివల్ల కలిగే కష్టం, నష్టం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. కొనే్నళ్ల క్రితం ఇండొనేసియాలో సంభవించిన సునామీ విలయ తీవ్రతను ప్రపంచ దేశాలన్నీ చవిచూశాయి. అపారమైన నష్టాలకు, కష్టాలకు లోనయ్యాయి. వేల సంఖ్యలో తీరప్రాంత దేశాలన్నింటిలోనూ మరణాలూ సంభవించాయి. ఒకప్పుడు ఈ రకమైన తుపానులకు సంబంధించి వర్గీకరణ అనేది ఉండేది కాదు. తాజాగా సాంకేతిక విజ్ఞానం ఇనుమడించిన నేపథ్యంలో వాటి తీవ్రతను బట్టి నామకరణం జరిగింది. ఇటీవల భారత్‌లోని అనేక రాష్ట్రాల్లో సంభవించిన తుపాన్లను నైనా, హుదూద్, హ్యారీ వంటి వాటిగా పరిగణించి వాటి తీవ్రతను అంచనా వేయగలిగారు. ముందస్తుగానే వాతావరణ పరమైన మార్పులను అధ్యయనం చేయడం వల్ల ఈ రకమైన తుపాన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పడమే కాకుండా వాటివల్ల కలిగే నష్టాలకు సంబంధించి కూడా శాస్తవ్రేత్తలు ఓ అంచనాకు రాగలుగుతున్నారు. ఈ విలయాల స్థాయి ఒక దశ వరకు ఉంటే వాటి ప్రభావ తీవ్రత నుంచి ఆయా ప్రాంతాలను కాపాడుకునేందుకు కనీసం ముందస్తుగా ప్రజలను తరలించి ప్రాణనష్టాన్ని నివారించేందుకు అవకాశం ఉంటుంది. ఈ రకమైన విజ్ఞానాన్ని వాతావరణ పరమైన అవగాహనను శాస్తవ్రేత్తలు సముపార్జించుకోగలిగారు. అయినప్పటికీ కూడా కొంతలో కొంతైనా నష్టాన్ని చవిచూడక తప్పని పరిస్థితులు దాదాపు అన్ని తుపాను సందర్భాల్లోనూ తలెత్తాయన్నది వాస్తవం. ‘ఆస్తులు పోతే పోయాయి... ప్రాణాలనైనా కాపాడుకోడం... ఉపద్రవం ముంచుకొచ్చేవరకు కదలకుండా ఉండొద్దు’ అంటూ సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడే ప్రజలను హెచ్చరించాడంటే ఈ విలయాల తీవ్రత ఎంతటిదో స్పష్టం చేసేదే. అంతేగాదు ప్రకృతి ఆగ్రహిస్తే ఎవరైనా తల వంచాల్సిందేనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాల్సిందేనన్న వాస్తవాన్ని కూడా ఇర్మా హరికేన్ ప్రపంచ దేశాలకు స్పష్టం చేసింది. మనిషి ఎంత శక్తి సంపన్నుడైనా ఒక దశ వరకే అవి ఉపకరిస్తాయి. ప్రకృతికి సంబంధించిన పెను తుపాన్ల నుంచి కొంత మేరకు మాత్రమే తనను తాను కాపాడుకోగలుగుతాడు. పరిస్థితి అదుపు తప్పితే అంచనాలకు అందనంత అనంతమైన నష్టం సంభవించి తీరుతుంది. ఇంతటి భయానక హరికేన్ కరేబియన్ దీవులను నేలమట్టం చేసి అమెరికా వైపు పెను వేగంతో దూసుకొచ్చినా ప్రాణ నష్టం ఎక్కువగా లేకపోవడానికి కారణం ముందస్తుగా తీసుకున్న చర్యలేనన్నది వాస్తవం.
పెనుతుపాన్ల వల్ల ఎంతటి విధ్వంసం జరుగుతుందో కరువు కాటకాలవల్ల అదే స్థాయి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. ఇవ్వన్నీ కూడా ప్రకృతిపరంగా చోటుచేసుకునే పరిణామాలను బట్టే ఆధారపడి ఉంటాయి. కొన్ని రకాల తుపాన్లు అట్లాంటిక్ ప్రాంతంలో మొదలైతే వాటిని హరికేన్లుగా వ్యవహరిస్తారు. ఓ ఏడాదిలో సగటున అట్లాంటిక్ మహాసముద్రంలో 12కు పైగా హరికేన్లు ఏర్పడతాయి. అవన్నీ కూడా పశ్చిమ దిశగా పయనించి కరేబియన్ దీవులను తాకుతాయి. అలాగే మధ్య అమెరికా తూర్పు తీరాన్ని, ఫ్లోరిడా సహా దక్షిణ అమెరికాను ఇవి ముంచెత్తుతాయి. ఈ రకమైన హరికేన్లు శక్తిని పుంజుకున్న మరుక్షణం నుంచి విధ్వంస యానం చేస్తూ దాదాపు నెల రోజులపాటు ఆ తీరాల వెంట పయనిస్తాయి. మిగతా వాటితో పోలిస్తే వీటివేగం క్రమంగా తగ్గుతూ వస్తుంది. వీటి ప్రయాణ వేగం గంటకు 15కిలోమీటర్లయితే దీని కారణంగా సంభవించే పెనుగాలుల తీవ్ర గంటకు 75 కి.మీ వేగంతో ఉంటాయి. ఈ భయానక గాలి వేగం వల్ల అనేక రకాలుగా భారీ సౌధాలకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంటుంది. చెట్లు ఈ వేగాన్ని తాళలేక కూకటివేళ్లతో సహా పెకలించుకుపోతాయి. అయితే మిగతా వాటిలా కాకుండా హరికేన్ సంభవిస్తే అవి ఏ మార్గంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందో వాతావరణ నిపుణులు కచ్చితంగా చెప్పగలుగుతారు. అంతేకాదు, ప్రతి దశలోనూ ఇవి ఎంత వేగాన్ని సంతరించుకోగలుగుతుందీ చెప్పగలుగుతారు. దీని కారణంగానే అమెరికాలో ఆస్తి నష్టం సంభవించిందే కాని ప్రాణనష్టం ఎక్కువగా లేదన్నది వాస్తవం. మొత్తం ఐదు కేటగిరీలుగా హరికేన్ల తీవ్రను బట్టి విభజిస్తారు. మొదటి కేటగిరీ హరికేన్ సంభవిస్తే గాలుల వేగం గంటకు 74 నుంచి 95 కి.మీ మేర ఉంటుంది. ఇక రెండో కేటగిరీ హరికేన్ సంభవిస్తే దాని వేగం గంటకు 154 నుంచి 177 కి.మీ వరకు ఉంటుంది. కేటగిరీ మూడు విషయానికి వస్తే ఈ గాలుల వేగం 178 నుంచి 208 కి.మీ వరకు ఉంటుంది. కేటగిరి నాలుగు హరికేన్లు సంభవిస్తే గాలుల వేగం 209 నుంచి 251 వరకు ఉంటుంది. కేటగిరీ 5 విషయానికి వస్తే దీని వేగం గంటకు 252 కి.మీకి పైగానే ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో సంభవించిన హరికేన్ నాల్గవ కేటగిరీ కిందకు వస్తుంది. మనిషి అభివృద్ధి కాంక్ష అనేక రకాలుగా వాతావరణ సమతూకాన్ని దెబ్బతీస్తున్న నేపథ్యంలో ప్రకృతి పరమైన మార్పులు అనివార్యంగానే సంభవిస్తున్నాయి. కంచు కవచాలుగా ఉండాల్సిన హిమాలయా పర్వతాలు సైతం కరిగి తరిగిపోతున్నాయి. అనేక హిమనీనదాలు అడుగంటిపోతున్నాయి. వీటన్నింటికీ కారణం వాతావరణం వేడెక్కిపోవడం, అదే వేడి కారణంగా అనేక హిమపర్వతాలు కరిగి సముద్రాల్లో కలిసిపోవడం జరుగుతోంది. వీటివల్లే సముద్ర జలాలు వేడెక్కిపోతున్నాయి. దీని కారణంగా తీర ప్రాంతాల్లో ఉన్న దేశాలు పెను నష్టాలకు లోనవుతున్నాయి. ఈ రకమైన విలయాలను నివారించాలంటే ప్రమాదాలను గరిష్ఠ స్థాయిలో తగ్గించుకోవాలంటే ప్రకృతితో సహజీవనం చేయాలి తప్ప దానికి సవాలు విసరకూడదు. ఇప్పటికే ఈ రకమైన విలయ తీవ్రతను చవిచూసిన మానవాళి సూర్యతాపాన్ని పెంచేసుకునే చర్యలను కట్టిబెట్టి భూతలాన్ని సమస్త జీవకోటి జీవనానికి దోహదం చేసేదిగా మార్చే ప్రయత్నం చేయాలి ఇప్పటికే ఇందుకు సంబంధించి అపారమైన నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చుకోలేకపోయినా, విరుద్ధ చర్యల ద్వారా ప్రకృతికి మరింత ఆగ్రహాన్ని కలిగించి పెంచుకోకుండా ఉంటే చాలు.
సైక్లోన్లు
దాదాపు అన్ని దేశాల్లోనూ సంభవించే సాధారణ స్థాయి తుపానే్ల ఇవి. తూర్పు పసిఫిక్, ఉత్తర అట్లాంటిక్, కరేబియన్ మహాసముద్రం, మెక్సికో ఖాతంలలో ఈ రకమైన తుపాన్లను హరికేన్లుగా వ్యవహరిస్తారు. ఇవన్నీ కూడా సుళ్లు తిరిగే విలయ స్వభావాన్ని కలిగిన వ్యవస్థలే.
ఈ ఉష్ణమండల ప్రాంతాల్లోనూ సముద్ర జలాల వేడినుంచే ఈ రకమైన తుపాన్లు శక్తిని సంతరించుకుంటాయి. అనేక దశల్లో కొత్త బలాన్ని పుంజుకుంటూ పటిష్టం అవుతాయి. సాధారణంగా ఈ రకమైన హరికేన్లు అన్నవి పిడుగులతో కూడిన భారీ వర్షాలతో మొదలై అనతికాలంలోనే విలయ రూపాన్ని సంతరించుకుంటాయి.
అన్ని విధాలుగా వీటికి వాతావరణపరమైన శక్తి లభిస్తే ఇవి ఉష్ణమండల అల్పపీడనంగా మారతాయి.

బి.రాజేశ్వర ప్రసాద్