శ్రీకాకుళం

10న ముఖ్యమంత్రి చంద్రబాబు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 30: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల పదో తేదీన జిల్లాకు రానున్నారు. ఒకటో తేదీ నుంచి 14 వరకూ నియోజకవర్గాల వారీగా నిర్వహించనున్న జనచైతన్య యాత్రల్లో భాగంగా సి.ఎం. జిల్లా పర్యటన ఖరారైనట్టు రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు చెప్పారు. జిల్లాలో పలాస నియోజకవర్గంలో పర్యటన కోసం పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నారు. 16 నెలలుగా జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, పార్టీ తీసుకున్న నిర్ణయాలు సామాన్యుల గడపకు చేర్చే ఈ జనచైతన్య యాత్రలో భాగంగా సి.ఎం. స్వయంగా రెండు నియోజకవర్గాలు పర్యటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందుచేత ఒకటో తేదీ నుంచి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా జిల్లా వ్యాప్తంగా కొనసాగించాలని ఇప్పటికే హైకమాండ్ ఆదేశించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో నిమగ్నమై ప్రజలకు ప్రభుత్వ విధానాలను, పథకాలను ప్రచారం చేపట్టాలని నిర్ణయించడంతో మంగళవారం నుంచి నియోజకవర్గాలవారీగా జనచైతన్య యాత్రలు ప్రారంభం కానున్నాయి.

‘బ్యాంకు గ్యారంటీ’పిడుగు!
ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
జిల్లా రైసు మిల్లర్లపై ప్రభుత్వం ఆర్థిక వాత పెట్టింది. బకాయిలు ఉన్న ఆరు కోట్ల రూ.లు వెంటనే చెల్లించాలంటూ ప్రభుత్వం ఇచ్చిన తాకీదులకు స్పందించకపోవడంతో ఈ ఏడాది మిల్లలపై బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి అంటూ హుకుం జారీ చేసింది. దీంతో ప్రతీ మిల్లరు తప్పనిసరిగా కోటి రూ.లు బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు ప్రభుత్వం అందించనుంది. దానిని బియ్యంగా మిల్లింగ్ చేసిన తర్వాత లెవీ ఇవ్వాల్సిన రైస్‌మిల్లర్లు అంతా తు.చ.తప్పకుండా కస్టడ్ మిల్లింగ్ రైస్ (సి.ఎం.ఆర్) విధానంతో అనుసంధానం కావాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. నిర్బంధ నిబంధనల నుంచి తప్పించమంటూ మిల్లర్లు జిల్లా మంత్రి, ఎం.పి., స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచారు. ప్రభుత్వం ఏర్పాటై మంత్రిగా అచ్చెన్న జిల్లాకు వచ్చిన సందర్భంలో జిల్లా రైసు మిల్లర్ల సంఘం సుమారు 25 లక్షల రూపాయల వరకూ చందాలు దండి ఘనంగా ఊరేగింపులు, ఉత్సవాలు చేసినందుకా ఈ ఫలితం అంటూ అసోసియేషన్‌లో కొంతమంది గళం విప్పుతున్నారు. దీనివల్ల జిల్లా రైస్‌మిల్లర్ల సంఘంలో రెండు వర్గాలుగా చీలిక ఏర్పడింది. ప్రతీ ఏటా ధాన్యం విక్రయించుకునేందుకు రైతులు కష్టాలు పడాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఈ ఏడాది ప్రకృతి అనుకూలించడంతో సిరులు రాశులు కల్లాల్లో విక్రయాల కోసం ఎదురుచూడాల్సిన సంకట పరిస్థితికి సర్కార్ నిర్ణయమే కారణమంటూ అన్నదాతలు ఆడిపోసుకుంటున్నారు. గత ఏడాది నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సేకరించిన వివిధ గ్రేడుల్లో గల ధాన్యాన్ని మిల్లర్లు కస్టడ్ మిల్లింగ్ రైస్ (సి.ఎం.ఆర్) పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి ఈ ఏడాది మాత్రం బ్యాంకు గ్యారంటీ పితలాటకాన్ని తెరపైకి తేవడంతో మిల్లర్లు అంతా కొనుగోలుకు ముందుకు రావడం లేదు. దీంతో అన్నదాతలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 1400 రూ.లు క్వింటాకు మద్దతు ధర (కామన్ రకం) అలాగే 1440 రూ.లు ఏ-గ్రేడ్‌కు చెల్లిస్తున్నట్టు చేసిన ప్రకటన రైతులకు ఊతం అందించని స్థితిలో ఉండడం బాధాకరం. గత ఏడాది సి.ఎం.ఆర్. పథకం కింద బియ్యం సరఫరా చేస్తామని రాష్ట్రంలో గల మిల్లర్లు 18 కోట్లు బకాయిలు ఉండగా, జిల్లా నుంచి సుమారు ఆరు కోట్లు బకాయిలు పేరుకుపోవడంతో బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి అంటూ ప్రభుత్వం నిబంధనలు సిద్ధం చేసింది. దీంతో పౌరసరఫరా అధికారులు ప్రతీ మిల్లరు కోటి రూపాయల బ్యాంకు గ్యారంటీ చూపకపోతే సి.ఎం.ఆర్. విధానంలో భాగస్వామ్యులు కాలేరంటూ హుకుం జారీ చేయడంతో మిల్లర్లు చేతులెత్తేశారు. దీంతో ధాన్యం కొనుగోలు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. జిల్లాలో 350 రైస్ మిల్లులు ఉండగా, కనీసం ఒక క్వింటా ధాన్యం కూడా కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతాంగం ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మిల్లర్లు అంతా గత ఏడాది ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు సుమారు 16 కోట్ల రూ.లు ప్రభుత్వం చెల్లించాల్సివున్నప్పటికీ, జిల్లా యంత్రాంగం మోకాలడ్డడంతో ఈ ఏడాది ధాన్యం కోనుగోలుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం రైతులకు శాపంగా మారింది. ప్రతీ ఏటా నూర్పులు పూర్తి చేసిన వెంటనే కల్లాల వద్దే చిరు వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసి, వ్యవసాయ మదుపులకు వాడిన రుణాల భారాన్ని నిలువరిస్తూ ఉండేవారు. అయితే, పి.ఎ.సి.ఎస్. ఆధ్వర్యంలో వెలుగు అధికారుల పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చిరు వ్యాపారుల హవాకు చెక్ పెట్టడం రైతులకు లాభం చేకూర్చారు. బ్యాంకు గ్యారంటీపై పౌరసరఫరాల శాఖ అధికారులు మొండిగా ఉండడంతో మిల్లర్లు కూడా ప్రతిష్ఠకు పోయి వ్యూహాత్మకంగా అధికారుల ఆదేశాలకు అడ్డుతగులుతున్నారు. ఇలా...అటు మిల్లర్లు, ఇటు పౌరసరఫరా అధికారులు ప్రచ్ఛన్న యుద్ధంలో సామాన్య, మధ్యతరగతి రైతులు నలిగిపోయే పరిస్థితి ఈ ఏడాది దాపురించింది. ఇక్కడ జరుగుతున్న తంతు అంతా స్థానిక మంత్రి, ఎమ్మెల్యే దృష్టిలో ఉన్నప్పటికీ ప్రభుత్వ పాలసీ అంటూ కప్పదాటు వేయడంతో రైతుల కష్టాలు మరింత ఎక్కువయ్యేలా ఉన్నాయి. గతానికి భిన్నంగా పి.ఎ.సి.ఎస్.ల వద్దే ధాన్యం సేకరించి గ్రేడింగ్ ప్రక్రియ పూర్తి చేస్తే తప్ప సి.ఎం.ఆర్. పథకంలోకి తాము భాగస్వామ్యులం కాలేమని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. ఒకవైపు వాతావరణ హెచ్చరికలు, మరోవైపు ధాన్యం చెల్లక ఇబ్బందులు మున్ముందు వ్యవసాయ మదుపుల పేరిట పేరుకుపోయిన అప్పులు తలచుకుంటూ ఆ కుటుంబాలు బతుకుదేవుడా అంటూ బాబు సర్కార్ నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నాయి.
వంశధార నిర్వాసితులపై
ఉక్కుపాదం!
హిరమండలం, నవంబర్ 30: వంశధార రిజర్వాయరు నిర్మాణంలో ఎన్నడు లేని విధంగా సర్వం కోల్పోయి నిరాశ్రయులైన నిర్వాసితులపై ఉక్కుపాదం మోపడం సంచలనం రేపింది. రిలే నిరాహార దీక్షలను భగ్నం చేసి బలవంతంగా అరెస్టు చేయడం పోలీసులు తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దౌర్జన్యంతో నిర్వాసితులను బెదిరించి అధికారులు, పోలీసులు రిజర్వాయరు పనులు చేపడుతున్న పరిస్థితులు సోమవారం సంఘటన అద్దం పడుతున్నాయి. పనులు చేపట్టి పదేళ్లు గడుస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారంకాకపోవడంతో గొట్టాబ్యారేజ్ జంక్షన్ నిర్వాసితులు నిరసన కార్యక్రమాలకు దిగారు. సిపిఎం ఆధ్వర్యంలో బ్యారేజ్ జంక్షన్‌కు వెనుకభాగంలో పనులు జరుగుతున్న చోట గత కొన్ని రోజులుగా దశల వారీ ఆందోళన చేసి రిజర్వాయరు పనులు నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలో పాలకొండ డిఎస్పీ సిహెచ్ ఆదినారాయణ, పాతపట్నం, కొత్తూరు సిఐలు శ్రీనివాసరావు, అశోక్‌కుమార్‌లు ఆధ్వర్యంలో భారీ పోలీసులు బలగాలతో దీక్షా శిబిరం వద్ద మోహరించారు. పాలకొండ ఆర్డీవో కె.సాల్మన్‌రాజ్, ఎస్‌జిసి మనోరమలు సిపిఎం నాయకులు, నిర్వాసితులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో నిర్వాసితులు మాట్లాడుతూ ఇళ్లు, దుకాణాలు స్థలాలు కేటాయింపు, యూత్ ప్యాకేజీ, ఇళ్లు అంచనాలు పరిహారం తదితర సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు, నిర్వాసితులు మాటల మధ్య పొంతన కుదరకపోవడంతో ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. నిర్వాసితులు కుటుంబ సమేతంగా పనులను అడ్డుకున్నారు. పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో అధికారులు, పోలీసులు సమాలోచనలు జరిపారు. దీంతో పోలీసులు మోహరించి శిబిరాన్ని తొలగించి నిర్వాసితులను చెదరగొట్టారు. మరికొంత మందిని బలవంతంగా లాక్కుని వాహనంలోకి ఎక్కించి పోలీసు స్టేసన్‌కు తరలించారు. సిపి ఎం జిల్లా కార్యదర్శి బవిరి కృష్ణమూర్తి, కోరాడ నారాయణరావు, గంగరాపు సింహాచలంతోపాటు 13 మందిని అరెస్టు చేసి, సొంత పూచికత్తులపై విడిచిపెట్టినట్లు ఎస్సై వేంకటేశ్వరరావు తెలిపారు.
* అరెస్టులు అన్యాయం
శాంతియుతంగా సమస్యలు పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న నిర్వాసితులను అరెస్టు చేయడం అన్యాయమని సిపి ఎం రాష్ట్ర నాయకులు చౌదరి తేజేశ్వరరావు అన్నారు. సమస్యలు పరిష్కారం పక్కనెట్టి పనులు చేపడుతున్నారని, వీటిని అడ్డుకున్న నిర్వాసితులకు బెదిరింపుచర్యలకు పాల్పడం అన్యాయమన్నారు.

లోపాల అధ్యయనానికే...
జనచైతన్య యాత్రలు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, నవంబర్ 30: ఏడాదిన్నర పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలులో తలెత్తిన లోపాలు అధ్యయనానికి జనచైతన్య యాత్రలు మరింత దోహదపడతాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు స్పష్టంచేశారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చి మెరుగైన పాలన అందించేలా పార్టీ శ్రేణులకు ఈ యాత్ర బాధ్యతను అప్పగించామని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం రాత్రి ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆరంభమైన జనచైతన్య యాత్రల ముఖ్య ఉద్దేశాన్ని ఆయన వివరించారు. ఇప్పటికే పింఛన్‌లు, ఎన్టీఆర్ వైద్యసేవలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా సభ్యులకు పెట్టుబడి నిధి వంటి కార్యక్రమాలను తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లబ్ధిదారులకు అందించామన్నారు. అలాగే రేషన్‌కార్డులు త్వరలో అందించనున్నామని ఇందుకు అర్హులు ఈ యాత్రలో దరఖాస్తు అందించవచ్చునన్నారు. షెడ్యూల్డ్ ప్రాప్తికి గ్రామ పంచాయతీ ప్రధాన గ్రామంలో జెండా ఆవిష్కరణతో ఈయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే లేకుంటే నియోజకవర్గం ఇన్‌చార్జ్ మొదలుకొని జన్మభూమి కమిటీ సభ్యుల వరకు జనచైతన్య యాత్రలో భాగస్వామ్యులు అవుతారన్నారు. ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలుతోపాటు పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచి తెలుగుదేశం పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రూపొందించినట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇటీవలి తిరుపతి రాష్ట్ర కమిటీ నేతృత్వంలో నిర్వహించిన మేధో మథనం సదస్సులో జనచైతన్య యాత్ర దిశ నిర్ధేశం చేసినట్టు చెప్పారు. గ్రామస్థాయి కార్యకర్తలు అటు ప్రభుత్వానికి ఇటుప్రజలకు వారధిగా వ్యవహరించే బాధ్యతను గుర్తుచేసేందుకు జనచైతన్య యాత్రలు ఓ వేదిక కానున్నాయన్నారు. తాను ఈనెల 3వ తేదీన విశాఖపట్నం జనచైతన్య యాత్రలో పాల్గొని 4న ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పలు యాత్రలో పాల్గొంటానని కళా తెలిపారు.

గురు‘జాడ’లు
శాశ్వతం
రాజాం, నవంబర్ 30: సూర్యచంద్రులు ఉన్నంత వరకు గురుజాడ రచనలు సజీవంగా ఉంటాయని గురుజాడ అప్పారావు సంస్మరణ సభలో పాల్గొన్న వక్తులు పేర్కొన్నారు. స్థానిక సూర్యకల్యాణ మండపంలో సోమవారం నవ్వులు లేని నూరేళ్లు కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న కథానిలయం కారా మాస్టార్, ద్రావిడ విశ్వవిద్యాలయం ఆచార్యుడు కినె్నర శ్రీదేవి, విశాఖపట్టణం, బెంగూళూరు నుంచి ఆచార్యులు చెందు సుబ్బారావు, కవన శర్మ, ఢిల్లీ ఆచార్యులు దేవరకొండ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని గురుజాడ రచనలు లేని సమాజాన్ని ఉహించలేమన్నారు. వాస్తవిక అంశాలపై రచనలు చేసి పరిష్కార మార్గాలను రచనలు ద్వారా సూచించిన వ్యక్తి గురుజాడ అని కొనియాడారు. అధునిక కథలు, కవితలకు గురుజాడ రచనలు మార్గదర్శకాలన్నారు. ఈ సందర్భంగా గురుజాడ సంస్మరణ సంచిక అనేక పుస్తకాన్ని కారా మాస్టార్ అవిష్కరించారు. ఈ సభలో రచయితల అట్టాడ అప్పలనాయుడు, బిడ్డి రాంబాబు, వెలుగు రామినాయుడు పాల్గొన్నారు.

నేటి నుండి జి.సిగడాంలో పాసింజల్ హాల్ట్
జి.సిగడాం, నవంబర్ 30: స్థానిక రైల్వేస్టేషన్‌లో మంగళవారం నుండి గుణ్‌పూర్ పాసింజర్ రైలు నిలుపుదలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని రైల్వే స్టేషన్ మాస్టార్ రామారావు సోమవారం తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం కొరకు ఈ పాసింజర్ ఉదయం 7:30 వచ్చి 7:35, సాయంత్రం 5:00 వచ్చి 5:05 గంటలకు బయలుదేరుతుందని ఆయన తెలిపారు. ఈ సదావకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఎస్పీ ‘గ్రీవెన్స్’కు 17 ఫిర్యాదులు
శ్రీకాకుళం(టౌన్), నవంబర్ 30: జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించే ఎస్పీ గ్రీవెన్సుకు 17 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ ఎ.ఎస్.ఖాన్ అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి స్వయంగా వారి సమస్యలను ఆలకించి సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు సమస్య పరిష్కారానికి ఆదేశాలు జారీచేసారు. ఇందులో ఏడు వినతులు సివిల్ తగాదాలకు చెందినవి కాగా, కుటుంబ కలహాలకు చెందిన అర్జీలు ఐదు అందాయి. ఇదివరకు నమోదై నేటి వరకు కేసు పరిష్కారం కానివి పరిష్కారం కోరుతూ రెండు, ఇతర కారణాలతో మూడు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఫిర్యాదుల విభాగంలో జిల్లా ఎస్పీతో పాటు సిసిఎస్ డిఎస్పీ కె.వేణుగోపాలనాయుడు, న్యాయ సలహాదారులు కె.ఆపీస్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియజేయాలి

జలుమూరు, నవంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపడుతున్న పలు సంక్షేమ పథకాల వివరాలను ప్రతీ పౌరునికి తెలియజేయవలసిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మండలం యలమంచిలి ఎండలకామేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన వన భోజన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజలకు వివరించకపోతే కార్యక్రమం వృథా అవుతుందని ఆయన అన్నారు. మంగళవారం నుండి 13వ తేదీ వరకు జనచైతన్యయాత్ర నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలతో ప్రజలు పల్లెల్లో పండగ వాతావరణం కల్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మార్కెట్ కమిటీ అధ్యక్షుడు వెలమల చంద్రభూషణరావు, మాజీ ఎంపిపి వెలమల కృష్ణారావు, మాజీ పార్టీ అధ్యక్షుడు వైద్య భూషణ మురళీమోహనరావు, పర్లాం డిసి అధ్యక్షుడు కె.సత్యనారాయణ, పార్టీనాయకులు బగ్గు గోవిందరావు, బలరాం, పంచిరెడ్డి రామచంద్రరావు, నీటి సంఘం అధ్యక్షుడు అక్కాజోతుల ఉమాదత్తబాబు, సుబ్బరామారావు పలువురు పాల్గొన్నారు.

శక్తిపీఠాల్లో శ్రీచక్రార్చన, రుద్రాభిషేక పూజలు
శ్రీకాకుళం(కల్చరల్), నవంబర్ 30: పవిత్ర కార్తీక మూడో సోమవారం పర్వదినం పురస్కరించుకొని పట్టణంలోగల వివిధ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాల్లో శ్రీచక్రార్చన పూజలు ఘనంగా జరిగాయి. స్థానిక గాజుల వీధిలో కొలువుతీరిన రాజరాజేశ్వరి శక్తిపీఠంలో దేవీ ఉపాసకుడు వెంకటరావు విమలానంద గురూజీ నిర్వహణలో శ్రీచక్రార్చనలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు జరిగాయి. అదే విధంగా లలితా సహస్తన్రామార్చనలు, దుర్గాష్టకం, సుహాసనీ పూజలు, నివేదన నీరాజనాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
గుడివీధి, కత్తెరవీధి, గుజరాతీపేట శక్తిపీఠాలతోపాటు గోవిందనగర్ లోగల రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాల్లో స్థానిక భక్తులు అభిషేక పూజలు కుంకుమార్చనలు దీపారాధనలు చేశారు.

స్ఫూర్తి ప్రదాత ‘గురజాడ’!
శ్రీకాకుళం(టౌన్), నవంబర్ 30: సమాజానికి స్ఫూర్తి ప్రదాత గురజాడ అంటూ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కొనియాడారు. గురజాడ శత వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం గురజాడ అధ్యయన వేదిక కార్యదర్శి జామి భీమశంకర్ ఆధ్వర్యంలో స్థానిక గొంటివీధిలోని విద్యాదరి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే లక్ష్మీదేవి, జెసి-2 పి.రజనీకాంతరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురజాడ రచనల సారాంశాన్ని వివరించారు. సాహిత్యంనకు హాస్యం జోడించి ఆయన రాసిన కన్యాశుల్కం నాటికలో ముందుగా గుర్తుకు వచ్చేది గిరీశం పాత్ర అయితే నేటి యువత గ్రహించగలిగే పాత్ర సౌజన్యం పంతులు పాత్ర అన్నారు. ఇందులో గిరీశం పాత్ర ద్వారా ఓ లక్ష్యం కోసం చెడును సాహిత్యంలో జోడించినప్పటికీ, సౌజన్యం పంతులు పాత్రద్వారా పూర్తిగా మంచిని బోధించారని తెలిపారు. దీనిద్వారా మంచిని గ్రహించి చెడును విసర్జించాలన్న గురజాడ భావనను అర్థం చేసుకోవలసి ఉందని పేర్కొన్నారు. తెలివితేటలు ఎన్ని ఉన్నా అందులో స్పష్టత కరవైతే చేయగలిందేమీ ఉండదని, గురజాడ రచనలు ఆకలింపుచేసుకోవడం ద్వారా మంచి సాహిత్యంతో పాటు స్వార్థపూరిత చర్యలకు పాల్పడకుండా లక్ష్యఛేదనకు మార్గం సుగమమవుతుందని తెలిపారు. ఆయన రచనలు నేటికీ సజీవంగా నిలిచాయని, వీటితో భవిష్యత్ తరాలు స్ఫూర్తిపొందాలని ఆకాంక్షించారు. ముందుగా గురజాడ చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో ప్రధాన ఆదినారాయణ గజల్ పాటలు ఆకట్టుకున్నాయి. అధ్యయన వేదిక కన్వీనర్ పత్తి సుమతి, అంబేద్కర్ యూనివర్శిటీ ప్రిన్సిపాల్ తులసీరావు, గీతా పౌండేషన్ వ్యవస్థాపకుడు వై.గీతా శ్రీకాంత్, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, ఎస్.వి. రమణ మాదిగ, బస్వా రాజేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రక్తదానానికి ముందుకు రావాలి
శ్రీకాకుళం(టౌన్), నవంబర్ 30: జిల్లాలో రక్తం కొరత తీవ్రంగా ఉందని, కొరత తీరడానికి యువత రక్తదానానికి ముందుకు రావాలని రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక విద్యాదరి డిగ్రీ కళాశాల విద్యార్థులు గురజాడ శతవర్ధంతిని పురస్కరించుకొని మెగా రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో పాటు రెడ్‌క్రాస్ చైర్మన్ ప్రారంభించారు.