శ్రీకాకుళం

ఉద్దానాన్ని వీడని కిడ్నీ వ్యాధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
* వయస్సు 47 సంవత్సరాలు... కానీ నా రూపం చూడటానికి 60 ఏళ్ళుపైబడినట్టు ఉంటుంది. నేను తీవ్రమైన కిడ్నీ సమస్యలను ఎదుర్కొంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా నీరు తాగను.. తాగలేను.. సురక్షితమైన నీరు ఇప్పుడు అందుబాటులో లేదు. నేను ఇక ఎక్కువ కాలం బతకను, అదే నాకున్న పెద్ద భయం!
* రెండు దశాబ్దాల కిందట నుంచే కిడ్నీ వ్యాధి ఉంది. కానీ, ఆ రోజుల్లో ఉద్యానవనాల్లో ఎన్నో చెట్లు ఉండేవి. దాదాపు అర్ధ గంటసేపు పంపుసెట్లువద్ద స్నానం చేసే అవకాశం కలిగేది. రోజూ ఆరు లీటర్లు సురక్షితమైన నీరు తాగేవాడిని. ఇప్పుడు అంతనీరు ఉద్దానం ప్రాంతానికి లేదు. అప్పట్లోనే నీటిని కాపాడండి.. సేవ్ వాటర్ అంటూ హెచ్చరికలు, వాల్‌పోస్టర్లు ఉండేవి, రేడియో, టీవీల్లో కూడా ప్రచారం చేసేవారు. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. నీరనేది ఎప్పటికీ తరగని వనరని మాకు భావన ఉండేది. ఇప్పుడు చూస్తే.. నదులు, చెరువులు, బోర్లు అన్నీ పూర్తిగా ఎండిపోతున్నాయి. కలుషితమైపోయాయి... మంచినీరు తాగేందుకు దొరకడం లేదు.
ఇవీ.. ఉద్దానంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఆవేదనలు..
ప్రకృతి అందాలు.. ఆహ్లాదకరమైన కొబ్బరి తోటల నడుమ కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, పలాస మండలాలు ఉన్నాయి. అయితే, ఇక్కడ జీవనం.. ఊహించినంత సుఖమయం కాదు. మూత్రపిండాల వ్యాధులు దెబ్బతిస్తున్నాయి. వేలాది మంది కిడ్నీ రోగాలతో మంచానపడితే.. ప్రతీ నెలలో ఐదుగురు మృత్యువాత పడుతున్నారు. ప్రతీ మూడు మాసాలకోసారి రక్తనమూనాలను వైద్యబృందాలు సేకరించి అక్కడ కిడ్నీ వ్యాధి తీవ్రతను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తునేవుంటారు. కానీ, వ్యాధి మూలాలు ఇంకా దొరకడం లేదు. ఇక్కడి నీరు అంత సురక్షితం కాదని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఇటీవల కాలంలో ఎన్టీఆర్ సుజలధార ద్వారా రక్షిత తాగునీరు అందిస్తామన్న ప్రభుత్వం ఉద్దానం ప్రాంతంలో అవసరానికి ఏర్పాటు చేయలేకపోతోంది. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ముందుకువచ్చి 11 ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి కిడ్నీ రోగులకు రక్షిత తాగునీరు అందించే చిరుప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బొరివంక, వరక, కుసుంపురం, ముత్యాలపేట, బి.గొనసపుట్టుగ వంటి పది పంచాయతీల్లో మృత్యువాతపడుతున్న కిడ్నీ రోగులకు తాగేందుకు నీరు అవసరమైనంతగా దొరకడంలేదనే అక్కడ ప్రజలు ‘ఆంధ్రభూమి’ వద్ద ఆవేదన చెందారు. ఒక్క కవిటి మండలంలో గల 76,000 జనాభాలో పదివేలకుపైగా వ్యాధిగ్రస్తులు ఉన్నారు.
కరవైన మానవత్వం!
ఉద్దానం ఫౌండేషన్ పేరుతో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఏర్పాటు చేసిన వైద్యపరికరాలు, రక్షిత తాగునీటి ప్లాంటులను అధికారులు సద్వినియోగంలోకి తీసుకురాలేదు. వాటిపై పసుపుమార్కు లేదన్న కారణంగా ప్రజాప్రతినిధులు కొందరు మానవతాదృక్పథాన్ని వదిలేసి, రాజకీయ నీలినీడలతో కప్పేయడంతో ఆ పరికరాలు వినియోగంలోకి రాలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఊహించని విధంగా భూగర్భ జలమట్టం పడిపోయింది. సముద్రతీరంలో ఉండే భూముల్లోనూ ఉప్పునీటి శాతం పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే 4.8 మీటర్లపైగా భూగర్భజలం అడుగంటింది. లోటు వర్షపాతంతోపాటు భూమిలోకి ఇంకే నీటిశాతం తగ్గిపోవడం, పరిమితికి మించి భూగర్భజలాలు వాడటంతో ఈ పరిస్థితి నెలకొందని భూగర్భజల నిపుణులు చెబుతున్నారు. ఉద్దానంలో ఏ పంచాయతీలో చూసినా 250 అడుగుల లోతునుంచి తాగునీటిని బావుల నుంచి వెలికితీయాల్సిన దుస్థితి. ఏడాది కాలంలో ఎనిమిది నెలలపాటు వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా వంటి నదులు నీరు ప్రవహించే జిల్లాలో ప్రస్తుతం తాగునీటికి ఇబ్బందులు నెలకొన్నాయి. 193 కిలోమీటర్లు పొడవునా గల సముద్రతీరంలో జలాలు ఉప్పుగా మారడంతో ఇతర ప్రాంతాల నుంచి నీటిని పంపింగ్ చేసుకునే పరిస్థితి దాపురించింది. ఇప్పటికే సురక్షితమైన తాగునీరు ఉద్దానం ప్రజలకు అందివ్వలేని గత ప్రభుత్వం వర్షపునీటికి నడకనేర్పించి చెరువుల్లో నిల్వలు చేయాలంటూ పథకాలు కుమ్మరించి, లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆ ప్రాంతీయులు దుమ్మెత్తిపోస్తున్నారు.
తాజాగా బాబు సర్కార్ ఇంకుడు2గుంతలు తవ్వాలంటూ ప్రజల్లో ఆ పార్టీలో గల పెద్దలు, చిన్నలు అంతా చైతన్యం పరుస్తున్నారు. ఇంటి నిర్మాణం ఖర్చులో ఒక శాతం సొమ్మును వెచ్చిస్తే ఇంకుడుగుంత నిర్మించుకోవచ్చునంటూ.. వీధిలో పడిన నీరు, కాలనీ దాటి వెళ్ళకుండా నీరు ఇంకే చర్యలు చేపట్టాలంటూ ఉద్దానం ప్రజలకు ఇప్పుడిప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉచిత సలహాలు ఇస్తున్న నేపథ్యంలో కిడ్నీ రోగాలతో అలమటిస్తున్న వారికి సురక్షితమైన నీరు అందివ్వలేకపోతున్నారు. ఏళ్ళ తరబడి ఉద్దానంలో కిడ్నీ రోగులకు సురక్షితమైన నీరు అందించే ఉద్దానం నీటి ప్రాజెక్టును నూరేళ్ళు ముందుచూపుతో అప్పటి పార్లమెంటు సభ్యుడు ఎర్రన్నాయుడు ప్రారంభిస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిర్వాహణ పనులపై కూడా అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టిసారించలేదు.