శ్రీకాకుళం

‘గుట్కా’ బాబు!.. బ్యాంకాక్ చెక్కేశాడు...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎత్తున నిషేధిత గుట్కాను తయారుచేసి, వ్యాపారం చేస్తున్న గుట్కా నిందితుడు అనూహ్యరీతిలో బ్యాంకాక్ పారిపోయినట్టు తెలుస్తోంది. బరంపురం నుంచి భాగ్యనగరం వరకూ అక్రమ వ్యాపారం చేసే ఈ నిందితుడిని కొంతమంది పోలీసులే తెలివిగా దేశాలు దాటించారన్న ఆరోపణలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం ఆయన విలాసవంతంగా బ్యాంకాక్‌లో సేదతీరుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో డివిజనల్ పోలీసు అధికారుల నుంచి స్టేషన్ హౌస్ అధికారుల వరకూ అంతా ఈ నిందితునికి ‘చేయూత’ ఇచ్చేవారే. అయితే, శ్రీకాకుళం ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన జె.బ్రహ్మరెడ్డి కఠిన చర్యలకు వారంతా కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.
ప్రతీ నెలా లక్షలాది రూపాయలు ఆదాయం ఇచ్చే గుట్కా అక్రమ తయారీ కేంద్రాలపై ఎస్పీ ఉక్కుపాదం మోపారు. దీంతో గత వారం రోజుల్లో మూడున్నర కోట్ల రూపాయల గుట్కాను సీజ్ చేశారు. అంతేకాకుండా.. వాటి మూలాలు వెలికితీసేందుకు ఎస్పీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఏవోబీలో గుట్కా కేంద్రాలపై నిఘా పెంచాయి. దీంతో సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయం నుంచి ఇచ్ఛాపురం పోలీసులు వరకూ చేసేది ఏమీలేక గుట్కా కింగ్‌గా పేరుమోసిన ఆ నిందితుడిని దేశానే్న దాటించేశారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భువనేశ్వర్, కటక్‌లలో తలదాచుకున్నారంటూ కొద్దిరోజులుగా చేసే పోలీసుల ప్రచారం వెనుక ఆయనను విదేశాలకు పంపే ప్రయత్నం అన్న వాస్తవం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంగతి ఎస్పీ తన ప్రత్యేక బృందాలతో తెలుసుకున్నట్టు సమాచారం. నిషేధిత గుట్కాను అక్రమంగా ఇచ్ఛాపురం కేంద్రంగా తయారీ చేస్తూ కోట్లాది రూపాయల సరుకు బరంపురం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రవాణా చేసేందుకు ఆ బాబు నడిపుతున్న ముఠాలో కీలకమైన వ్యక్తులెవ్వరినీ స్థానిక పోలీసులు ఇప్పటి వరకూ అరెస్టు చేయలేకపోయారు.
రౌడీయుజం, దాదాగిరీ, అక్రమదందాలు, వ్యాపారాలపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే హెచ్చరిస్తూ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌నే పోలీసుశాఖకు అమల్లోకి తెచ్చే రోజులువి. రెండు రోజుల్లో ఏడు లారీల గుట్కా ప్యాకెట్లు, గుట్కా ముడి పదార్థాలు స్వాధీనం, ఐదు భారీ జనరేటర్ల సీజ్.. వీటి విలువ సుమారు రూ.3.50కోట్లు! ఇచ్ఛాపురం ప్రాంతంలో గుట్కా అక్రమదందా ఇంత భారీగా రెండేళ్ల నుంచి సాగుతున్నట్టు స్థానిక పోలీసులకు తెలిసినా.. ఎస్పీ బ్రహ్మారెడ్డి కొరఢా ఝుళిపించేంతవరకూ ఎందుకు మేల్కొనలేదన్నది మిలయన్ డాలర్ల ప్రశ్న!
గుట్కా తయారీ మూలాలు...
గుట్కా, ఖైనీ తయారీ విక్రయాలపై రెండేళ్ల కిందట ఒడిశా రాష్ట్రంలో ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. నిషేధాన్ని కఠినంగా అమలు చేయడంతో బరంపురం ప్రాంతంలోని తయారీదారులు, వ్యాపారుల దృష్టి ఇచ్ఛాపురం బోర్డర్‌లో ఖాళీగా ఉన్న రవాణా సంస్థ గోదాములపై పడింది. ఇక్కడి రవాణా సంస్థలన్నీ మూతపడటంతో ఈ ప్రాంతం అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారింది. దీంతో గోదాముల యజమానులకు పెద్ద మొత్తంలో అద్దెలు ఇస్తూ గుట్కా తయారీ యూనిట్లను నెలకొల్పడం ప్రారంభించారు. విద్యుత్ కనెక్షన్ తీసుకుంటే అనుమానం వస్తుందని భారీ జనరేటర్లను వినియోగించేవారు. దాదాపు ఏడాది పాటు గుట్కా తయారీ గుట్టుగా సాగినా తర్వాత బయటకు పొక్కింది. దీంతో పోలీసులు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అప్పుడప్పుడూ దాడులు చేసి కొంతమేరకే గుట్కా ముడిసరుకుని స్వాధీనం చేసుకొని వదిలేసేవారు. ఇక్కడి గోదాములో తయారైన గుట్కా ప్యాకెట్లు ఒడిశా రాష్ట్రంలో బరంపురం స్టాక్‌పాయింట్‌గా ఎంచుకుని సరఫరా చేయడం ప్రారంభించారు. అలాగే, ఇచ్ఛాపురంలో తయారైన గుట్కాలను విశాఖపట్నం స్టాక్‌పాయింట్‌గా హైదరాబాద్ వరకూ అక్రమ రవాణా చేస్తూ వ్యాపారం చేస్తున్నారు.
నిందితుడు పెదబాబే : పోలీసువర్గాల నిర్థారణ
గుట్కా అక్రమ తయారీ, రవాణా, వ్యాపారానికి కీలకమైన వ్యక్తి నిమ్మన హేడంబరరావు అలియాస్ పెదబాబే అంటూ ఇచ్ఛాపురం పోలీసులు నిర్థారించారు. ఇచ్ఛాపురం సి.ఐ. అవతారం ‘ఆంధ్రభూమి’కి చెప్పిన వివరాలు మేరకు ఇచ్ఛాపురానికే చెందిన ఈయన కొన్నాళ్లు బిస్కెట్ల వ్యాపారం చేసేవాడు. అనంతరం ఒడిశాలోని బరంపురంలో స్థిరపడి గుట్కా వ్యాపారంలో అడుగుపెట్టాడు. భారీగా లాభాలు వస్తుండటంతో బినామీల పేరిట గుట్కా తయారీ సంస్థలు ఏర్పాటు చేసి రెండేళ్ళుగా నడుపుతున్నాడు. ఒడిశాలో గుట్కాపై నిషేధం విధించడంతో ఇచ్ఛాపురం సరిహద్దుల్లో ఈ కేంద్రాలకు తలుపులు తెరిచాడు. ఏవోబీపై పెదబాబుకు పూర్తి అవగాహన ఉండటంతో ఈ ప్రాంతాన్ని తయారీ కేంద్రంగా ఎంచుకున్నాడు. ఈ వ్యాపారంలో గోదాముల యజమానులు కొందరు, ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన కొందరు లారీల యజమానులను భాగస్వాములుగా ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా, కొంతమంది రాజకీయ నేతలు సైతం గుట్కా మాఫియాతో సంబంధాలు ఉన్నప్పటికీ, పోలీసులు ఆ సంగతులు చెప్పడం లేదు. ఇక్కడి తయారు చేసిన గుట్కాప్యాకెట్లను విశాఖపట్నంలోని కొండభీమలింగేశ్వరరావుకు పంపేవారని ఆయన రాష్టవ్య్రాప్తంగా పంపిణీ చేస్తుంటాడని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అవతారం చెప్పారు. భీమలింగేశ్వరరావుకు ఆయన సోదరుని కుమారులు కాశీవిశ్వనాథ్, జగన్‌లు సహకరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతానికి వీరి నలుగురిపై కేసు నమోదు చేయగా భీమలింగేశ్వరరావును అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మిగిలిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
ముందస్తు బెయిల్ కోసం ‘బాబు’ యత్నాలు
ముందస్తు బెయిల్ కోసం పెదబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, న్యాయస్థానం ఉత్తర్వులు అందినతర్వాతే బ్యాంకాంగ్ నుంచి ఇచ్ఛాపురం వస్తారన్నది ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పెద్దబాబుకు హైదరాబాద్‌లో బిస్కెట్ ఫ్యాక్టరీ, బరంపురంలో బంగారం దుకాణం, 24 గంటల ఫాస్ట్ఫుడ్ సెంటర్‌లు ఉన్నాయని ఆయన మిత్రులు వివరించారు. ఇదిలావుండగా, గుట్కా తయారీ, అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసు చట్టంలో కఠిన నిబంధనలు లేవు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మాదిరిగా నాన్-బెయిల్‌బుల్ యాక్టు కానప్పటికీ, నిందితుడిని కొంతమంది పోలీసులే వ్యూహాత్మకంగా అరెస్టు చేయకుండానే తప్పించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.