శ్రీకాకుళం

‘స్థానిక’ ఎమ్మెల్సీకి సామాజిక సమతుల్యత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
‘స్థానిక’ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీల్లో ఇప్పటికే అంతర్గతంగా కసరత్తు ప్రారంభమైంది. ముఖ్యంగా అధికార పార్టీ ఎవరిని అభ్యర్ధిగా ఎంపిక చేస్తుందన్న అంశమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా సామాజిక వర్గాల సమీకరణల్లో సమతూల్యత పాటించి ధీటైన అభ్యర్ధిని బరిలో దింపాలన్న ఆలోచనతో ముందుకెళ్తుందని ఆ పార్టీ నేతలు ప్రకటన చేసారు. వాస్తవానికి జిల్లాలో మూడు ప్రధాన సామాజిక వర్గాలుగా ఉన్న వెలమ, కాళింగ, తూర్పుకాపులు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వెలమ, కాళింగ వర్గాలకు చెందిన నేతలు కీలక పదవుల్లో కొనసాగుతుండడంతో తూర్పు కాపులకు ఎమ్మెల్సీ టిక్కెట్‌ను కేటాయించాలన్న బలీయమైన కాంక్ష ఆ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో, కార్యకర్తల్లో కనిపిస్తోంది. గతంలో జరిగిన పరిణామాలను కూడా గుర్తుకు తెచ్చుకుంటూ తూర్పు కాపులకే ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టాలన్న భావన రాజకీయ విశే్లషకుల్లో సైతం వ్యక్తమవుతోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా సైతం తూర్పు కాపులకే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టాలని యోచిస్తున్న సమయంలో అధికార పార్టీ వైఖరి, నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఆ రెండు సామాజికవర్గాలకే కీలకపదవులు!!
జిల్లాలో వెలమలు, కాళింగలు కీలక రాజకీయ పదవుల్లో కొనసాగుతున్నారు. వెలమ సామాజిక వర్గానికి సంబంధించి కార్మికమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో పాటు శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాలకు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి కీలక పదవుల్లో ఉన్నారు. అలాగే జిల్లా స్థాయి పదవిగా గుర్తింపు పొందిన వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవికి కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన నేత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక కాళింగ సామాజిక వర్గం నుంచి రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా కూన రవికుమార్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా చౌదరి ధనలక్ష్మీ, ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్‌తో పాటు బిసి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా ఇదే సామాజిక వర్గానికి చెందిన ఎల్.ఎల్.నాయుడు కొనసాగుతున్నారు. రాష్టస్థ్రాయి, జిల్లాస్థాయి కీలక పదవుల్లో ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన నేతలు కొనసాగుతూ జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండింటికి ధీటుగా ఉన్న తూర్పు కాపులకు జిల్లా స్థాయి పదవి అయినా ఎమ్మెల్సీని కట్టబెడితే సామాజిక వర్గాల పరంగా సమతూకం పాటించినట్టవుతుందని విశే్లషిస్తున్నారు.
తూర్పు కాపులకు ప్రాతినిధ్యం అంతంతమాత్రమే...
జిల్లాలో పాతపట్నం, రాజాం, పాలకొండ, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో తూర్పు కాపుల జనాభా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస నియోజకవర్గాల్లోనూ ఈ సామాజికవర్గం తన ఉనికి చాటుకుంటోంది. కానీ అధికార పార్టీలో ఆ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కలేదన్న అపవాదు మాత్రం ఉంది. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిమిడి కళా వెంకటరావుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుని బాధ్యతలు అప్పగించినా అధికారిక పదవి కాదన్న భావన ఉంది. ఇక గత ఎన్నికల్లో తూర్పుకాపులు అత్యధికంగా నివసిస్తున్న పాతపట్నం నియోజకవర్గం నుంచి శత్రుచర్ల విజయరామరాజును బరిలో దించడం తెలుగుదేశం చేసిన రాజకీయ తప్పిదమని, ఆ కారణంగానే తెలుగుదేశం ప్రభంజనంలో కూడా వైకాపాకి చెందిన కలమట వెంకటరమణమూర్తిని ఆ నియోజకవర్గ ప్రజలు గెలిపించారన్న వాదన కూడా ఓ వైపు వినిపిస్తోంది. దీంతో పాటు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి వైకాపా తూర్పు కాపుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని రెడ్డి శాంతికి టిక్కెట్ కేటాయించిన విషయాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవాలని టిడిపి పెద్దలకు పరోక్షంగా తెలియజేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరిణామాలివి...
గతంలో జరిగిన స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంలో ప్రధాన రాజకీయ పార్టీలు తూర్పు కాపులకు సీట్లు కేటాయించడం వల్ల కలిగే ప్రయోజనాలు, వేరే సామాజిక వర్గాలకు అప్పగించినప్పుడు ఎదురైన చేదు అనుభవాలు ప్రస్తుతం ఆ పార్టీలోని తూర్పుకాపు నేతలు వై ఎస్ హయాంలో కళింగ కోమటి సామాజిక వర్గానికి టంకాల బాబ్జీకి ఎమ్మెల్సీ టిక్కెట్ కేటాయించినప్పుడు తగినంత మెజార్టీ ఉన్నా తమకు సీటుదక్కలేదన్న భావనతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన గొర్లె హరిబాబునాయుడును గెలిపించి తమ ఆకాంక్షను తెలియజేసారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే తర్వాత ఎన్నికల్లో తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన పీరుకట్ల విశ్వప్రసాద్‌ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపగా ఆయన సునాయాసంగా గెలుపొందారు. ప్రతిపక్షాల్లో ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులు సైతం తమ కులానికి వెన్నుదన్నుగా నిలిచి ఆయనను గెలిపించారు. దీంతో ఎమ్మెల్సీ స్థానం ఎప్పటికీ తమకే ఉండాలన్న ఆకాంక్షను ప్రతిసారి తూర్పుకాపులు తమ ఓటు ద్వారా తెలియజెబుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో ఇదే తరహా నిర్ణయం తీసుకోవాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. తూర్పు కాపులకే ఈ స్థానాన్ని కేటాయిస్తే రానున్న 2019 సాధారణ ఎన్నికల్లో సైతం కాపులు తెలుగుదేశానికి దన్నుగా నిలబడే అవకాశముందన్న భావన వ్యక్తమవుతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించాలని కోరుతున్న ఆ సామాజిక వర్గ టిడిపి నేతలు తాము కోరినట్టు అధిష్టానం నిర్ణయం తీసుకోకపోతే అవసరమైతే ఉద్యమించడానికి సైతం సిద్దమవుతున్నారు. కొద్ది నెలల క్రితం మెళియాపుట్టి మండలం చాపరలో తూర్పుకాపుల ఐక్య గర్జన పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్షలాదిగా తరలివచ్చిన సామాజిక వర్గ నేతల సమక్షంలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై లోతైన చర్చ జరిగింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ సామాజిక వర్గాల సమీకరణలు సమతూకం పాటించే క్రమంలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తూర్పు కాపులు ఆశిస్తున్నారు.

నివగాం కొండపై గజరాజుల తిష్ఠ
కొత్తూరు, జనవరి 28: మండలం నివగాం కొండపై గత మూడు రోజులుగా గజరాజులు తిష్టవేశాయి. శనివారం ఇదే కొండ సమీపంలో ఏనుగులు సంచరిస్తుండడంపై పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. నివగాం, మదనాపురం, పాతపాడు, ఆర్‌కేపురం గ్రామాలు ఈ కొండ చుట్టూ ఉండడంతో ఆయా గ్రామాల వైపు ఏనుగులు సంచరిస్తూ ఉండడం, ఎటువంటి ప్రమాదాలు దాపురిస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నివగాం, మదనాపురం గ్రామాల పరిధిలో ఉన్న పంటలను నాశనం చేయగా, కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని కూడా ధ్వంసం చేస్తుండడంతో వీటిని అంచనాలు వేసి రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అయితే అటవీశాఖాధికారులు రైతులకు జరిగిన నష్టాలను అంచనా వేయాల్సి ఉండగా, ఆ శాఖాధికారులు అటువంటిచర్యలు ఏవీ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

వంశధార నిర్వాసితులు త్యాగధనులు!
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 28: మూడు పంటలు..తొమ్మిది లక్షల ఎకరాలలో పండించుకునేందుకు సాగునీరు ఇచ్చే వంశ‘్ధర’ నిర్మాణానికి సహకరించిన నిర్వాసితులంతా త్యాగధనులు!! జిల్లా సస్యశ్యామలం కావడానికి వంశధార నిర్వాసితులు చేసిన త్యాగం మరువలేనిదని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. శనివారం ఇక్కడ ఆర్ అండ్ బి వసతి గృహంలో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిర్వాసితులకు చెక్కులు ఇవ్వడంలో జాప్యం జరగడంతోనే వారికి కోపం వచ్చిందని, దానికి జరిగిన నష్టానికి సి.ఎం. సారీ చెప్ప డం.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా తనకు ఎంతో బాధకలిగిందన్నారు. నిర్వాసితులకు గతంలో రూ. 420 కోట్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. వాటిని కొన్ని సాంకేతిక కారణాల వల్ల పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేకపోయామని తెలిపారు. ప్రభు త్వ వైఫల్యం వల్లే నిర్వాసితులకు ఆలస్యంగా చెక్కులు పంపిణీ జరిగిందని మంత్రి సునీత అంగీకరించారు. దానికి మూలాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా సర్వే బృందాలు నియమించి, రైతులకు అన్యాయం జరగకుండా చూడాలన్న ఉద్దేశ్యంతో వంశధార నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చేందుకు ఎంత ఖర్చైనా భరిస్తామంటూ భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అదనంగా రూ. 193 కోట్లను అందిస్తున్నట్టు చెప్పారు. రైతులు ఎటువంటి అందోళనలు పడవద్దనీ, సమస్యలను తమ దృష్టికి తెస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి, తప్పక పరిష్కరిస్తామని స్పష్టం చేసారు. శుక్రవారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణలు రైతులతో మాట్లాడటం జరిగిందని వివరించారు. ఎక్కడా ఇవ్వని విధంగా యూత్ ప్యాకేజీ కింద రూ. ఐదు లక్షలు చొప్పున అందిస్తున్నామని తెలిపారు. వారం రోజుల్లోగా పంపిణీకి చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రాజెక్టు సమస్యల పరిష్కరించడానికి 19 టీములను ఏర్పాటు చేసామని చెప్పారు. రైతు సోదరులు రెచ్చగొట్టే వారి మాటలను వినవద్దన్నారు. జలవనరులశాఖామాత్యులు, జిల్లా మంత్రులతో కలిసి మరొకసారి వస్తామన్నారు. నిర్వాసితులు సహకరించాలని, వారికి రావాల్సిన ప్రతీ రాయితీ తప్పక అందచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 24.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 3,700 కోట్లను వారివారి ఖాతాలకు జమచేసామని తెలిపారు. జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కేవలం 2.70 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసారని, చాలా తక్కువ లక్ష్యంలో జిల్లా ఉందంటూ అసంతృప్తి వ్యక్తపరిచారు. జిల్లా అంతటా ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. రైతులు దళారుల నమ్మి మోసపోరాదని, ఇప్పటివరకూ అమ్మకం జరిపిన రైతులకు సంక్రాంతిలోగా నగదును వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసామని చెప్పారు. అమ్మకం జరిపిని 48 గంటల్లోగా నగదును అందిస్తామన్నారు. జిల్లాలో లక్షలాది పౌరసరఫరాలకు చెందిన సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు ఉన్నాయన్నారు. వీటిని సత్వరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అనర్హులను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులను అందించనున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వశుధైకకుటుంబం వంటిదని, అందులో తలత్తే సమస్యలు సర్దుకుపోతాయంటూ వ్యాఖ్యానించారు. పాలకొండ, రాజాం, పాతపట్నం నియోజకవర్గాల్లో తలెత్తిన చిన్నపాటి సమస్యలను శుక్రవారం రాత్రి చక్కపెట్టిసామంటూ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శీరిషా, పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణలు పాల్గొన్నారు.