శ్రీకాకుళం

ఊపందుకున్న స్థానిక ఎమ్మెల్సీ సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 1: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఘట్టంనుండి నామినేషన్ దాఖలు... పరిశీలన ప్రక్రియ పూర్తికావడంతో జిల్లాలో సమరం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీకి అధికశాతం ఓటర్లు ఉండటంతో అభ్యర్థి గెలుపు సునాయాసంగా ఉంటుందని తొలుత పరిశీలకులు భావించారు. 90శాతం ఓటర్లు అధికార పార్టీతో ఉండటంవలన ప్రత్యర్థులు సరైన పోటీ ఇవ్వలేరని రాజకీయ వాదులంతా విశే్లషించారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఎంపికలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చివరిక్షణం వరకు ఉత్కంఠ రేపే విధంగా నిర్ణయం వెల్లడించలేదు. విజయనగరం జిల్లాకు చెందిన శత్రుచర్ల విజయరామరాజు 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుండి టిడిపి తీర్థం పుచ్చుకుని పాతపట్నం నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమి చవిచూశారు. ఈయనను ఎమ్మెల్సీ నామినేషన్ గడువుకు 12గంటల ముందు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు గరంగరంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన భూమికి పోషించాల్సిన ఎంపిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటిసిలు అధిష్టానం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు.
స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థత్వానికి స్థానికేతరులను ఎంపిక చేయడం ఒకింత నిరంకుశధోరణే అని హైకమాండ్‌పై నిప్పులు చెరుగుతున్నారు. కేడర్ మనోభావాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడం జిల్లాలో ఉన్న ప్రధాన సామాజికవర్గాలను విస్మరించడం ఎంతవరకు సమంజసమని వారంతా ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన 20మంది ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నా వీటిని పరిశీలించకుండా ఏకపక్షంగా అభ్యర్థత్వాన్ని నిర్ణయించడంపై కీలకనేతలు కూడా విస్మయానికి గురైన విషయం తెలిసిందే. ఆశావహులకు ముఖం చాటేసిన ముఖ్య నేతలంతా తలదించుకునే పరిస్థితి అధిష్టానం తీసుకువచ్చిందని కేడర్ ముందు ఏకరవు పెట్టుకుంటున్నట్లు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పెద్దపీట వేయాల్సిన సమయంలో పార్టీ శ్రేణులను పక్కనపెట్టే నిర్ణయాలు అధినాయకత్వం తీసుకోవడం మంచిది కాదని వారంతా స్పష్టంచేస్తున్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం కుటుంబ సభ్యుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా హైటెక్ నిర్ణయాలు తీసుకోవడంపై నిరసన సెగలు ఎగిసిపడుతున్నాయి. సీనియర్‌గా ఉన్న కొల్ల అప్పలనాయుడును సిఎం బుజ్జగించి, మిగిలిన ఆశావహులతో ఇన్‌ఛార్జి మంత్రి మాట్లాడకపోవడం వారంతా ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెంచుకుని పార్టీ బలోపేతానికి చేపట్టిన వివిధ పార్టీ కార్యక్రమాల్లో కాసులు తగలబెట్టుకుని బేబులకు చిల్లులు పడేలా నష్టపోయి పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిందని వారివారి అనూయలవద్ద వాపోతున్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశాన్ని అధికారం వైపు నడిపించేందుకు ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని కాయకష్టం చేసినప్పటికీ పార్టీ గుర్తించలేదని ఆశావహుల తరఫున మండల స్థాయి కేడర్ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అల్లుడు ఇల్లరికం కొడుకు పాలేరు తనం అనే సామెత మాదిరిగా రోజురోజుకీ పార్టీ ఐడియాలజీ మారుతూ వస్తుందని, ఇటువంటి పరిణామాలు ఉనికికే ముప్పు తెస్తాయని మేధావులు సైతం తప్పు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్న నామినేటెడ్ ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా ఇటువంటి సమయాల్లో కూడా పార్టీని నమ్ముకుని పనిచేసిన నేతలకు సముచిత స్థానం కల్పించకపోవడం సరైంది కాదని తమ్ముళ్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా యువతకు అవకాశం కల్పించకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పదవులు వడ్డించే వైఖరి విడనాడకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఎన్టీఆర్ అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఈ అసమ్మతి తీవ్రరూపం దాల్చి గడిచిన స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ భంగపడే మాదిరిగా ఫలితం ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాజకీయ విశే్లషకులు చెప్పకనే చెబుతున్నారు.
ఇదిలా ఉండగా వైకాపా అభ్యర్థిని బరిలో దింపకపోయినా ఆ పార్టీకి చెందిన మాజీ జెడ్పీ చైర్మన్ పాలవలస రాజశేఖరం మేనల్లుడు మామిడి శ్రీకాంత్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈయన కాపు సామాజికవర్గానికి చెందిన యువనాయకుడు కావడం, పాలకొండ డివిజన్‌లో పాలవలస కుటుంబానికి మంచి పట్టు ఉండటంతో స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాపు అస్త్రంతో ముందుకు సాగే వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు తెలిసింది. దీనికి తోడు వైకాపా రాష్ట్ర నాయకుడు, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ మద్దతుతోపాటు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం గెలుపే వ్యూహంగా రాజకీయాలు నెరుపుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకు ఝలక్ ఇచ్చి ఉనికిని చాటుకోవాలన్న లక్ష్యంతో వైకాపా పావులు కదుపుతోంది. ఇటువంటి రసవత్తరమైన పోరులో ఎవరు విజేతలుగా నిలుస్తారో వేచి చూడాలి మరి.

రాజాంలో భారీ చోరీ
రాజాం, మార్చి 1: రాజాం పట్టణం దుర్గమ్మవనం సమీపంలో నివసిస్తున్న గడే సత్యనారాయణ అనే బియ్యం వ్యాపారి ఇంటిలో బుధవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. ఇంటిలో ఉన్న సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఏదో పనిమీద బయటకు వెళుతూ తాళం వేయడం మరిచిపోవడంతో ఆగంతకులు వెనుక నుంచి లోపలకు ప్రవేశించి బీరువా పగులకొట్టి బంగారు నగలు తస్కరించారు. సత్యనారాయణ ఇచ్చిన వివరాలు ప్రకారం సుమారు 30 తులాల వరకు బంగారం చోరీ జరిగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. 2013లో కూడా ఇదే ఇంటిలో చోరీ జరిగిందని, మళ్లీ అదే ఇంటిలో చోరీ జరగడంతో ఈ ప్రాంతం తెలిసినవారే చోరీకి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. చోరీ జరిగిన విషయాన్ని ఇరుగుపొరుగు వారు గుర్తించి సత్యనారాయణ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు లబోదిబోమన్నారు. పాలకొండ డిఎస్పీ సిహెచ్.ఆదినారాయణ, సిఐ ఎస్.శంకరరావు రంగప్రవేశం చేసి ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. శ్రీకాకుళం నుంచి క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్‌లను రప్పించగా, పోలీసు జాగిలాలు శ్రీకాకుళం రోడ్డులోని ఎల్‌ఐసి కార్యాలయం వరకు వచ్చి ఆగిపోయాయి. రాజాం ప్రాంతంలో ఇంత భారీ చోరీ జరగడంతో ఆ ప్రాంతీయులు ఆందోళనకు గురవుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని చోరీలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు.

రౌడీలా వ్యవహరిస్తున్న జగన్
* టిడిపి అధ్యక్షుడు కళా వెంకటరావు
కంచిలి, మార్చి 1: ప్రతిపక్ష నాయకుడు జగన్ రౌడీలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కళా వెంకటరావు అన్నారు. బుధవారం తెలుగుదేశం ప్రచార కార్యదర్శి జగదీష్ పట్నాయక్ కుమారుడు వెంకటేష్ వివాహానికి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఇటీవల ప్రతిపక్ష నాయకుడు వ్యవహరిస్తున్న తీరు రౌడీయిజాన్ని తలపిస్తుందని, ఇప్పటికే ఒకసారి ప్రజలు ఆయనను తిరస్కరించారని, వ్యవహారశైలి మారకుంటే జీవితంలో అధికారంలోకి రారన్నారు. ఈయనతోపాటు ఎమ్మెల్యే అశోక్‌పాల్గొన్నారు.

నువ్వలరేవులో సామూహిక పెళ్లిసందడి
* ఒకే ముహూర్తంలో ఒక్కటవుతున్న
70 జంటలు
* ఆచార సంప్రదాయాలకు పెద్దపీట
* 5న సామూహిక పెళ్ళిళ్లకు ముహూర్తం

వజ్రపుకొత్తూరు, మార్చి 1: ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేసే నువ్వలరేవుగ్రామం జిల్లాలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఒకేమాట, ఒకేబాటగా సాగిపోయే వారి ఆచార వ్యవహారాలు ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే పెళ్లి వేడుకలతో గ్రామం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పెళ్లి బాజాలు మోగకుండానే గ్రామంలో పెళ్లి కళతో సందడి నెలకొంటుంది. ఈనెల 5వతేదీన గ్రామంలోని 70 జంటలు బ్రహ్మ ముహూర్తాన ఒక్కటవుతున్నాయి.
ప్రతి రెండేళ్లకు వివాహ వేడుక : ప్రతి రెండేళ్లకు సామూహిక వివాహాలు జరుపుకోవడం నువ్వలరేవులో అనాది ఆచారంగా వస్తుంది. ఎవరి ఇంట పెళ్లి జరిగినా ఊరంతా వేడుకగా జరుపుకోవడం ఇక్కడ సంప్రదాయంగా వస్తుంది. గ్రామపెద్ద (బెహరా) పెళ్లి ముహూర్తాలకు తేదీలు నిర్ణయిస్తారు. పెళ్లి రోజుకు 15 రోజుల ముందు నుంచే గ్రామంలో సందడి నెలకొంటుంది. సుమారు 10 వేలు జనాభా కలిగి ఉన్న గ్రామంలో అందరికీ పెళ్లి భోజనాలు ఏర్పాటు చేయాలంటే ఏ ఒక్కరివలన కాదనే ఉద్దేశంతోనే సామూహిక వివాహాలవైపు మొగ్గు చేపుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. గ్రామం నుంచి వధువు బయటకు వెళ్లదు, అలాగే బయట నుంచి వధువును తీసుకురారని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇదే సామాజికవర్గం(కెవిటి)కి చెందిన కుటుంబాలు లేకపోవడం ఒక కారణం కాగా, వీరి యాస, భాష భిన్నంగా ఉండడం మరో కారణంగా పేర్కొంటున్నారు.
అధికారుల కనుసన్నల్లో వివాహాలు : సామూహిక వివాహాల కారణంగా బాల్యవివాహాలు జరిగిపోతున్నాయని అధికారులు గత రెండేళ్ల నుంచి గ్రామస్థులకు కౌనె్సలింగ్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కారణంగానే గత ఏడాది జరగాల్సిన వివాహాలు నిలిచిపోయాయి. ప్రతి రెండేళ్లకు 200లకు పైగా వివాహాలు జరిగేవి. మహిళా శిశు సంక్షేమశాఖ, పోలీసుశాఖ, చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారుల చొరవ మేరకు 70 వివాహాలు జరుగుతున్నాయి. కాశీబుగ్గ రూరల్ సిఐ సన్యాశినాయుడు, ఎస్‌ఐ సిహెచ్.ప్రసాద్ చొరవతో గ్రామస్థులకు కౌనె్సలింగ్ నిర్వహించడంతో విద్యార్హత సర్ట్ఫికెట్‌లోని వయసు ఆధారంగా ఈ వివాహాలను జరిపిస్తుండడం విశేషం.
విద్యార్థినులచే ప్రమాణం : బాల్యవివాహాలపై గ్రామంలో స్పెషల్ బ్రాంచి డిఎస్పీ మోహనరావు ఆధ్వర్యంలో అవగాహన సమావేశం గత జనవరిలో నిర్వహించారు. ఈ సమావేశంలో హైస్కూల్ విద్యార్థినులచే బాల్యవివాహాలు చేసుకోమని, ఉన్నత చదువులతో తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు తీసుకొస్తామని ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా అధికారులను మహిళలు ప్రశ్నించిన తీరు ఆలోచింపజేసింది. బాలిక రజస్వల జరిగిన మూడేళ్లు దాటితే ఎవరూ వివాహం చేసుకోవడానికి ముందుకు రారని, మా ఆడపిల్లలను పెళ్లి చేయకుండా ఇంటి వద్దనే ఉంచుకోవాలా? అని ప్రశ్నించడంతో వారి ఆవేదన వ్యక్తమైంది. బాల్యవివాహాల నిర్మూలనపై అధికారులు చూపిన శ్రద్ధ, చొరవకు విద్యావంతులైన యువకుల నుంచి మద్దతు లభించడం నువ్వలరేవు చరిత్రలో కొసమెరపు.