శ్రీకాకుళం

అణుపార్కును నిర్మించేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం)
గత రెండున్నర దశాబ్ధాలుగా అణువిద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నామంటూ ప్రచారం చివరికి భారత్ - అమెరికా ఒప్పందంలో ఆ పనులు ఎవరు చేపడతారంటూ గుత్తేదారులను అనే్వషించుకునే దుస్థితికి చేరింది. వెస్టింగ్‌హౌస్ కాంట్రాక్టు ఈ ప్రాజెక్టును చేపట్టలేమంటూ చేతులెత్తేసి వెనక్కి తగ్గడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్‌గా మారింది. ఇప్పటికే, వేలాది కోట్ల రూపాయలు వెచ్చించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా భూసేకరణ, ఇతర సాంకేతికపరమైన అనుమతులు, పనులు ప్రారంభించేందుకు కలెక్టర్ ఖాతాకు రూ. 400 కోట్లు ప్రభుత్వాలు జమ చేశాయి. ఆ నిధులన్నీ కొన్నాళ్ళుగా మూలుగుతునే ఉన్నాయి. కేవలం కార్పొరేట్ బ్యాంకు ఖాతాల్లో నిల్వ చేసుకునేందుకే ఉన్నట్టుఉన్నాయి. సామాజిక సర్వే నివేదికలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ పంపారు. అక్కడ నుంచి భూసేకరణకు అనుమతులు ఇంకా రావల్సిఉంది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ గ్రామంలో ప్రభుత్వం తలపెట్టిన అణువిద్యుత్ పార్కుకు బాలారిష్టాలు తొలగడం లేదు. కొవ్వాడలో అణుపార్కు ఏర్పాటును ప్రతిపాదించి 25 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇదిగోఅదిగో ప్రారంభిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంపిసిఐఎల్ సంస్థల అధికారులు ప్రకటిస్తున్నా ప్రాథమిక స్థాయిలో అణుపార్కు ప్రారంభం కాలేదు. కొవ్వాడ అణువిద్యుత్ పార్కుకు సంబంధించి 10వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక దిశగా లక్షకోట్లు వ్యయంతో దీనిని నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. ఇందుకు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్, అదేవిధంగా జిఇ, తోషిబా, ఇటాకీ కంపెనీల సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో అణుపార్కు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మూడింటిలో రెండు సంస్థల సహకారంతో అణుపార్కు నిర్మితవౌతుందని 2010లోనే భారతప్రభుత్వం ప్రకటన చేసింది. ఇటీవల ప్రధాన సాంకేతిక పరిజ్ఞానం సంస్థ వెస్టింగ్ హౌస్ కాంట్రాక్టు నుండి వైదొలగతున్నట్లు సమాచారం. దీంతో కొవ్వాడ అణుపార్కుకు సాంకేతిక పరిజ్ఞానం ఎవరు అందిస్తారో ఎంపిసిఐఎల్ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇదే జరిగితే మరికొనే్నళ్లపాటు అణుపార్కు ఏర్పాటుకు ఆలస్యమయ్యే అవకాశం ఉందని, అందులో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారులే సుస్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కొవ్వాడలో అణుపార్కు ఏర్పాటుచేస్తే చేయండి లేకపోతే రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనైనా చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. దీనివలన గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొవ్వాడలో భూసేకరణకు ప్రభుత్వం కలెక్టర్ ఖాతాకు సుమారు రూ.400కోట్ల్లు జమ చేసినా భూసేకరణ కూడా ఒక్క అడుగు ముందుకు పడలేదు. పలు దఫాలుగా మత్స్యకారులతో యంత్రాంగం చర్చలు జరిపినా పరిహారం ఎంత ఇస్తారు అన్న దానిపై అధికారులవద్ద స్పష్టత లేదు. అన్ని విధాలుగా కొవ్వాడ అణుపార్కు ఏర్పాటుకు అడ్డంకులే ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపకపోతే అణుపార్కు రద్దు చేయాలని మత్స్యకారుల నుండి ఉద్యమాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అయితే కొవ్వాడ అణుపార్కుకు భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ప్రారంభిస్తామని భూసేకరణ అధికారి సీతారామారావు స్పష్టంచేశారు. ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానం అందించే వెస్టింగ్ హౌస్ సంస్థే ఉంటుందని, త్వరలో అన్ని ఖరారు అవుతాయని కొవ్వాడ అణుపార్కు పి.డి వెంకటరమేష్ ‘ఆంధ్రభూమి’కి స్పష్టంచేశారు. ఇటీవలే కొవ్వాడతోపాటు అక్కడ చుట్టుపక్కల అణుపార్కు నిర్వాసిత గ్రామాల్లో సామాజిక సర్వే నిర్వహించిన జిల్లా యంత్రాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం చొరవతో పలుమార్లు మత్స్యకార గ్రామాల్లో ప్రజాభిప్రాయసేకరణ సమీక్షలు, సమావేశాలు శ్రీకాకుళం ఆర్డీవో బలివాడ దయానిధి సమక్షంలో జరిగినప్పటికీ, అణుపార్కు నిర్మాణానికి ఎదురయ్యే కీలకమైన సాంకేతిక అడ్డంకులు ఇక్కడ అధికారులను మరింత ఇరకాటంలో పడేస్తోందన్న వాదన లేకపోలేదు. ఏదిఏమైనప్పటికీ, కలెక్టర్ ఖాతాలో జమ అయిన రూ. 400 కోట్లు భూసేకరణకు వినియోగించుకునేందుకు అవకాశం లేకపోవడం, వెస్టింగ్‌హౌస్ గుత్తేదారు తన ఒప్పందాలను వెనక్కి తీసుకునే ప్రయత్నాలతో కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం కలెక్టర్ జిల్లా నుంచి స్థానచలనం తప్పనిసరి అంటూ రాజధాని వర్గాల ద్వారా తెలిసింది.

నీటి సదుపాయాల కల్పనతో
సస్యశ్యామలం
* ఎమ్మెల్యే కళా
లావేరు, మార్చి 5: సాగునీరు, తాగునీరు సదుపాయాలతో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయనున్నట్లు ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. ఆదివారం కేశవరాయునిపాలెంలో వైకాపా నేత రాజాపంతుల ప్రకాశరావు తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాశరావు, అతని సోదరుడు తవిటిబాబులకు పార్టీ కండువా వేసి ఎమ్మెల్యే కళా ఆహ్వానించారు. ఎమ్మెల్యే కళా మాట్లాడుతూ బుడుమూరు, రణస్థలం, లావేరులకు నాగావళి నుండి నీటి సదుపాయం అందించేందుకు ప్రతిపాదన ఉందని రూ.75కోట్లతో నాబార్డు ఈ ప్రతిపాదన పరిశీలిస్తుందని వెల్లడించారు. బుడుమూరు నారాయణసాగరం రిజర్వాయర్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. అనుసంధానంతో నీటి సమస్యను పరిష్కరించే ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. రాష్ట్రంలో 80శాతం మంది తెలుగుదేశం పార్టీ అభిమానులుగా మార్చేందుకు పార్టీ చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయన్నారు. వైకాపా నుండి నేతలు టిడిపిలోకి క్యూ కట్టడం శుభపరిణామమని, ప్రజా సంక్షేమాన్ని ప్రజలు అభివృద్ధిని కాంక్షించే పార్టీ అని అది గుర్తించే నేతల వలసల రాక ఆరంభమైందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన ముప్పిడి సురేష్ మాట్లాడుతూ మండలంలో 22 పంచాయతీల్లో పూర్తిస్థాయిలో తెలుగుదేశం పాతుకుపోయిందన్నారు. మిగిలిన నాలుగు పంచాయతీల్లో కూడా పార్టీ పటిష్టతకు ప్రణాళిక సిద్ధం చేశామన్నాఠు. ఈ కార్యక్రమంలో రాజా పంతుల ప్రకాశరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ అభివృద్ధి పథకాల పట్ల మక్కువతో పార్టీతీర్థం పుచ్చుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీతుకుమారి, మాజీ జెడ్పిటిసి ఆర్.సుశీల, ఎంపిటిసి సుశీల, ఉప సర్పంచ్ రమణమ్మ, రామప్పడు, గురునాయుడు, లక్ష్మణ్, సూర్యనారాయణలను తెలుగుదేశం పార్టీలోకి కండువాతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ఇనపకుర్తి తోటన్నదొర, ఎచ్చెర్ల, ఎంపిపి బి.రమణారెడ్డి, సర్పంచ్‌లు గాలిరెడ్డి, బోర సాయిరాం, శ్రీరాములనాయుడు, గొర్లె శ్రీనివాసరావు, ఎం.వెంకటేష్, నాయిన వెంకటేష్ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీగా మాధవ్‌ను గెలిపించండి
* టిడిపి రాష్ట్రఅధ్యక్షుడు కళా
ఎచ్చెర్ల, మార్చి 5: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గం నుంచి టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన పివిఎన్ మాధవ్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు. మండలంలోని భగీరథపురం, ఎస్‌ఎస్‌ఆర్‌పురం, చిలకపాలెం గ్రామాల్లో ఆదివారం పలు శుభకార్యాలకు హాజరై స్థానిక నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్న అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి టిడిపి, ఎన్డీయే ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని, ఈ విషయాన్ని గ్రామాల్లో ఉన్న పట్ట్భద్రులకు వివరించాలన్నారు. ప్రత్యేక రైల్వేజోన్, వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు బడ్జెట్‌లో అధిక శాతం నిధులు అభివృద్ధికి కేటాయింపు అంశాలను తెలియజేయాలన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు చంద్రబాబు కేంద్రం సాయంతో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేసి ప్రతిభ ఆధారంగా అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ఉపాధ్యాయుల నియామకం, ఎస్‌ఐలు, పోలీసులు ఏపిపిఎస్‌సి ద్వారా వివిధ సర్వీసెస్‌లో ఉద్యోగాలు పొందేందుకు నోటిఫికేషన్లు జారీ చేశారన్నారు. దీనిద్వారా అనేకమంది ఉద్యోగావకాశాలు పొందారని గుర్తు చేశారు. ఇంజినీరింగ్ చదువుకున్న పట్ట్భద్రులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేలా ఇన్నోవేషన్స్, ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు స్కిల్‌డెవలప్‌మెంట్ ద్వారా ప్లేస్‌మెంట్ కల్పించే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఇటువంటి విషయాలను పట్ట్భద్రులకు వివరించి ఉమ్మడి అభ్యర్థి మాధవ్‌ను గెలిపించే బాధ్యతను పార్టీ శ్రేణులు స్వీకరించాలన్నారు.
జిల్లా నుండి స్థానిక ఎమ్మెల్సీగా శత్రుచర్ల విజయరామరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈయనతోపాటు ఎంపిపి బల్లాడ వెంకటరమణారెడ్డి, ఏఎంసి మాజీ చైర్మన్ జీరు రామారావు, పొందూరు జెడ్పిటిసి లోలుగు శ్రీరాములనాయుడు, గాలి వెంకటరెడ్డి, పిఏసిఎస్ అధ్యక్షుడు బోర సాయిరాం, సాదు మల్లేశ్వరరావు, చిలక రాము, గాడు రామారావు ఉన్నారు.

ఏనుగుల తరలింపుపై
అటవీ అధికారులను నిలదీసిన రైతులు
కొత్తూరు, మార్చి 5: మండలంలోని మదనాపురం సమీపంలోని సుమారు నాలుగు ఎకరాల జొన్న పంటను ఆదివారం ఉదయం ఏనుగులు దాడి చేసి ధ్వంసం చేశాయి. గత కొద్ది రోజులుగా మండలం నివగాం, మదనాపురం మైదాన ప్రాంతంలో గజరాజులు తిష్టవేసి సంచరిస్తున్న సంగతి తెలిసిందే. జొన్న పంటను నాశనం చేయడంతో సింహాచలం అనే రైతుతోపాటు మరికొంతమంది అటవీశాఖ అధికారులపై ఆగ్రహించారు. ఏనుగులు సంచరిస్తుండడంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నామని,. పంటలు నాశనమై ఆర్థికంగా నష్టపోతున్నామని వారు ఆందోళన వ్యక్తంచేశారు. అలాగే ఏనుగుల దాడిలో తమ పంటలైన అరటి, చెరకు, జొన్న, జీడిమామిడి నష్టపోతుండగా, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అందించడంలో అటవీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఏనుగులను తరలిస్తామని ప్రకటనలు చేయడమే తప్ప చర్యలు చేపట్టకపోవడంతో మండిపడ్డారు. అధికారులు పరిశీలించడమే తప్ప వాటిని తరలించేందుకు ఎటువంటి మార్గాలను ఆలోచించడం లేదని రైతులు ఆగ్రహం చెందారు.

కలెక్టర్ పోలింగ్ కేంద్రాల పరిశీలన
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, మార్చి 5: ఈనెల 9వతేదీన జరగనున్న ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆదివారం ఉదయం పరిశీలించారు. ముందుగా స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని, అందుకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు అవసరమైన వౌలికవసతులను సమకూర్చాలని, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. అనంతరం ప్రభుత్వ పురుషుల జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ నుండి ఎన్టీఆర్ నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాలకు, టంగుటూరు ప్రకాశం నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీనృసింహం మాట్లాడుతూ ఉత్తరాంధ పట్ట్భద్రుల ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగతుండటంతో ఎన్నికల్లో విద్యావంతులు పాల్గొంటారని, వారి నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. పోలిగ్ కేంద్రాలకు కావాల్సిన వసతులను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ పర్యటనలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి బలివాడ దయానిధి, తహశీల్దార్ ఎస్.సుధాసాగర్, డి.టిలు, ఆర్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శిగా చిరంజీవి
* ఆంధ్ర కబడ్డీ కార్యదర్శి సమక్షంలో ఎన్నిక
బలగ, మార్చి 5: జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శిగా ఎక్కేని చిరంజీవిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎన్నుకున్నారు. గత కొంతకాలంగా జిల్లా కబడ్డీ కన్వీనర్‌గా వ్యవహించిన చిరంజీవిని ఆంధ్రా కబడ్డీ సంఘం కార్యదర్శి వీర లంకయ్య ఆధ్వర్యంలో ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ పేరు లేవనెత్తగా కె.శ్రీనివాసరావు మద్దతు పలకగా, దానిని ఆర్.అప్పలస్వామి బలపరిచారు. అదేవిధంగా కార్యదర్శి చిరంజీవిని సభ్యులు కె.రాజారావు బలపర్చగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర సంఘం క్యాదర్శి వీరలంకయ్య మాట్లాడుతూ జిల్లాలో కబడ్డీ క్రీడాకారులు మరింత ఆసక్తి చూపుతున్నారని, ఎందరో క్రీడాకారులను తీర్చిదిద్దాల్సిన అవసరం జిల్లా కబడ్డీ సంఘంపై ఉందన్నారు. ఆ దిశగా పయనించి రాష్ట్రానికి ఉత్తమ క్రీడాకారులను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, కబడ్డీ శిక్షకుడు పి.వి. ఎస్.వి సాయిప్రసాద్, మాజీ కార్యదర్శి పల్లి పాపయ్య, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

పట్ట్భద్రులను..
పక్కన పెట్టిన పార్టీలు
* సిక్కోల్‌లో వేడెక్కిన ఎమ్మెల్సీ ఎన్నిక
* బరిలో 30 మంది అభ్యర్ధులు
* మరో 48 గంటలే ప్రచారం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, మార్చి 5: ఉత్తరాంధ్ర జిల్లాల పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ఊపందుకుంది. మరో 48 గంటల్లో ప్రచారానికి తెరపడుతున్న నేపథ్యంలో టిడిపి - బిజెపి ఉమ్మడి అభ్యర్థి మాధవ్ విజయానికి జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలంతా ఏకతాటిపై పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పచ్చదండును పరుగులు పెట్టిస్తున్నారు. కాని - వీరంతా పట్ట్భద్రులను పక్కనపెట్టి మేధావి వర్గాన్ని దూరంగా ఉంచుతూ పార్టీ మార్కులేని ఎన్నికలకు పార్టీ గుర్తులతో అడుగులు వేస్తున్నారు. మేధావి వర్గానికి చెందిన పట్ట్భద్రులంతా పెద్దల సభ ఎన్నికలకు రాజకీయ రంగులను పులమడమేమిటని చర్చించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్లుగా ఉన్న పట్ట్భద్రులను పక్కన పెట్టి స్థానిక ప్రజాప్రతినిధులతో ఒత్తిడి పెంచే కార్యక్రమాలపై టిడిపి, బిజెపి తీరును ఆక్షేపిస్తున్నారు. అధికారం వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకుండా గ్రాడ్యుయేట్స్‌కు గేలం వేసేలా తాజాగా నిరుద్యోగ భృతి అన్ని కొత్త పల్లవి అందుకోవడం మేధావులు తప్పు పడుతున్నారు. ఉద్యోగ నియామకాలపై కూడా నీలినీడలు అలముకోవడంపై సర్కారు తీరుపట్ల పట్ట్భద్రులు గుర్రుగా ఉన్నారు.
రాజ్యాంగం కల్పించే ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోకుండా అడుగడుగునా ఒత్తిడి పెంచే కార్యక్రమాలను అధికార పార్టీలు తీవ్రతరం చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో గత రెండుసార్లు ఎన్నికల కంటే ఈసారి 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా బరిలో ఉండడం విశేషం. మార్చి 9వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో మొత్తం 1,56,957 వేల మంది ఓటర్లు ఉంటే, అందులో 18 శాతం మంది ఓటర్లు మాత్రమే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. కాని, సిక్కోల్ పట్ట్భద్రుల ఓటర్లే విజయానికి కీలకమంటూ తెలుగుదేశం పార్టీ నేతలంతా అంచనాలు వేస్తున్న నేపథ్యంలో గ్రామ కమిటీల నుంచి జిల్లా పార్టీ అధ్యక్షురాలి వరకూ అంతా ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు అహర్నిశలు పనిచేస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు, పార్టీ కేడర్ ‘సైకిల్’పై చక్కర్లు కొడుతునే ఉన్నారు. టిడిపి- బిజెపిల తరుఫున రంగంలోకి దిగిన మాధవ్‌కు మద్దతుగా మంత్రలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెండు పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. గడువు తక్కువ ఉన్నందున ఆదివారం జిల్లా అంతటా ప్రచారం ఊపందుకుంది. ఇంతలో అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలంతా అమరావతి వెళ్ళే నేపథ్యంలో ఆదివారం రోజున మాధవ్ కోసం గ్రామగ్రామాల్లో ప్రచారాన్ని టిడిపి ముమ్మరం చేసింది.
శ్రీకాకుళం జిల్లా అంతటా నిరుద్యోగులకు భృతి ఇచ్చేలా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతుందని, ఆ బిల్లును ఆమోదం చెప్పేందుకు కృతనిశ్చయతంతో ముఖ్యమంత్రి ఆయన వెంట కేబినెట్ ఉందన్న విషయాన్ని ఈ ప్రచారంలో పట్ట్భద్రులందరికీ వంటపట్టేలా చెప్పారు. ఈ కసరత్తు కేవలం ఎన్నికల్లో విజయం సాధించేలా బిస్కెట్టు వేస్తున్నారని వారంతా పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో లక్షల్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నప్పటికీ వారంతా నిరాశనిస్పృహలకు లోనై ఓటు హక్కును వినియోగించుకోవడం ఇష్టంలేకే చేర్పులకు ముందుకు రాలేదు. దీని కారణంగా 30వేల పైచిలుకకు జాబితా చేరింది. ఇటువంటి తప్పిదాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కప్పి పుచ్చుకునేలా ఎమ్మెల్సీ ఎన్నికలకు జెండా అంటగడుతున్నాయని గ్రాడ్యుయేట్స్ ఆడిపోసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అంశంపై అనుమానాలు అధికార పార్టీ అభ్యర్థిని ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మోదీ, బాబు సర్కారులు పై సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని తటస్థులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో మేధావులుగా ఉన్న పట్ట్భద్రులు మాత్రం ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రచారానికే పరిమితం అవుతుందని కొట్టి పారేస్తున్నారు. ఇప్పటికే పిడిఎఫ్ తరుపున గత రెండుసార్లు ఎంవిఎస్‌శర్మ ఎమ్మెల్సీగా గెలుపు సాధించారు. ఇప్పుడు ఆయన స్థానంలో కార్మికనేత, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజశర్మను పోటీలో ఉంచారు. శర్మకు కామ్రేడ్లు, కార్మిక సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విశాఖ జిల్లాలో అధిక శాతం ఓటర్లు ఉండటం వలన అక్కడ గ్రాడ్యుయేట్స్ ఎవరికి జేజేలు పలుకుతారో అన్న భయం కూడా బిజెపి-టిడిపిలో నెలకొంది. ఈ ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఎలాగైనా ఫలితాన్ని దక్కించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాలిస్తున్న బిజెపి,టిడిపిలు పావులు కదపడమే కాకుండా కేడర్‌ను పరుగులు పెట్టిస్తున్నాయి. కామ్రేడ్‌లు మాత్రం హ్యాట్రిక్ కొట్టాలని వారి ప్రజాసంఘాలు ప్రచారానికి మేధావులు సలహాలు తోడుగా తీసుకొని ముందుకు సాగుతున్నారు. వీరికి వైకాపా బలం తోడైంది. ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నుంచి పెద్దల సభకు ఎవరూ ఎన్నికవుతారో అన్న ఉత్కంఠ రాజకీయ పక్షాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.