శ్రీవిరించీయం

అతిశయ అసహాయ భర్త - మితిమీరని పతిభక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శంకరం సన్నగ వుంటాడు. చక్కు దవడలు, సూదిముక్కు, కళ్ళద్దాలు అతని రూపు. ఒక్క లుంగీ మీద వున్నప్పుడు అతని వెనె్నముక, పూసలు పూసలుగా స్పష్టంగా కనిపిస్తుంది. వాటిని తడిమి లెక్కపెట్టుకోవచ్చు. వనజాక్షి కాస్త లావుగా వుంటుంది. ముక్కు చిన్నది, కళ్లు పెద్దవి. ఆమె మీద అతడు బక్కగావుంటాడు. ఆమె చెంతనతను ఆడ కలెక్టర్ దగ్గర అష్టదరిద్రాలూ ఓడుతున్న బంట్రోతులా వుంటాడు’.
శ్రీ జగన్నాధశర్మ వ్రాసిన ‘తెగిపడిన పావురం రెక్క’ అన్న కథానికలో వర్ణన యిది. అందరు దంపతులు చిలుకా గోరింకలలా, మేడ్ ఫర్ ఈచదర్‌గా వుంటారని ఊహించడం అత్యాశ. అయితే సరసన చూడగానే ఎబ్బెట్టుగా కనిపించడం ఆ దాంపత్యం యొక్క దౌర్భాగ్యం అని చెప్పుకోక తప్పదు.
వనజాక్షి అనే అమ్మాయి కడు బీద కుటుంబంలో పుట్టింది. తండ్రి కోర్టు గుమాస్తా. ఆయనకో కొడుకున్నాడు. బి.ఏ, బి.ఎడ్ చదివి టీచర్‌గా ఉద్యోగం సంపాదించాడు. వనజాక్షి మటుకు ఇంటర్ వరకు మాత్రమే చదివి ఆ తర్వాత తండ్రి ఆర్థిక పరిస్థితి సజావుగా లేదు గనుక మానేసింది. ఆమెకు పెళ్లి చేయడం కోసం తండ్రి కుండమార్పిడి సంబంధం కుదిరింది ఆమెకు. శంకరం ఆమె భర్తగా ఖరారు అయ్యాడు. అతనికి యిద్దరు చెల్లెళ్లు, తల్లీ వున్నారు. పెళ్లి కోసం శంకరం కొన్ని అబద్ధాలు కూడా చెప్పగల చాకచక్యం వున్నవాడు. హైదరాబాద్‌లో అతనికో చిన్న ప్రయివేట్ ఉద్యోగం. భార్యతోపాటు, పెద్ద చెల్లెలును కూడా వెంట తెచ్చుకుని హైదరాబాద్‌లో తన వసతిగృహంలో కాపురం పెట్టాడు. గృహంకాదు అది, ఒక గది మాత్రమే. నాలుగు వాటాలకు ఒకటే టాయ్‌లెట్. వనజాక్షికి ఆ వాతావరణం చూసి గుండె గుభేల్ మంది. అందులోనే తను కాపురం సాగించాలి. మరో దారి లేదు. ‘నా జీతం ఏడొందలు. ఇంటద్దె రెండు వందల యాభయి. నా సిగరెట్ ఖర్చులు యాభయ్. మొత్తం మూడొందలు పోను, మిగిలిన నాలుగొందలు! అందులో పాతికో పరకో అమ్మకు పంపాలి. మిగిలిన దానితో ముగ్గురూ గడపాలి. అలా గడపాలంటే నీ సహాయం కావాలి’ అని శంకరం వనజాక్షికి దాపరికం లేకుండా చెప్పేశాడు మొదట్లోనే. ఇంక నలుగుర్నీ మంచి చేసుకుని సంసారాన్ని నువ్వే నెట్టుకురాగలగాలి’ అని కూడా అన్నాడు.
వనజాక్షికి అర్థం అయిపోయింది. అతని ఆర్థిక అసహాయత, లేకితనం. చెల్లెలుకు పుస్తకాలు కొనడానికి కూడా అతనికి స్తోమతు లేదు. ఇంట్లో వంట సామగ్రి పుష్కలంగా యేర్పరుచుకునే సదుపాయం లేదు. చేబదులు, ఎన్నటికీ తీర్చని - చేసుకుంటూ జీవితం గడపాలి. మేడమీద ఒంటరిగా వున్న ఒక బ్రహ్మచారి ‘రామకృష్ణ’ శంకరంతో కాస్త స్నేహంగా, సహాయంగా వుంటాడు. అతన్ని ఉపయోగించుకుని చిన్న, పెద్ద అవసరాలు తీర్చుకోవడం శంకరానికి అలవాటయిపోయింది. రామకృష్ణకు ఒంటరితనంతోపాటు తుంటరితనం కూడా వున్నదని తెలిసిన అతనికి అంత అభ్యంతరం వున్నట్టు కనిపించదు.
చిన్న చిన్న అప్పులకు వనజాక్షిని ఉపయోగించుకుని రామకృష్ణ దగ్గర డబ్బు దండుకోవడం శంకరానికి గ్రహపాటుతోపాటు అలవాటు అయిపోయింది. వనజాక్షి అంటే రామకృష్ణకు ఎంత తేలిక అయిపోయిందంటే- ఆమె అత్తగారు చనిపోయింది. మేం అర్జెంటుగా మా ఊరికి వెళ్లటానికి అయిదు వందల రూపాయలు కావాలి. మీరు ఇవ్వాలి అన్నప్పుడు అతను ‘నా కోసం అయిదు నిమిషాలు నా ఊపిరిలో నీ ఊపిరి కలుపు. నా గుండెలో నీ గుండెను దాచుకో’ అని ఆమెను పూర్తిగా లొంగదీసుకోగలుగుతాడు. ఊరికి వెళ్లి వచ్చిన తరువాత తనతో లేచి రావడానికి దాదాపు ఒప్పందం కుదుర్చుకుంటాడు.
వనజాక్షికి జీవిత చివరి క్షణాలు దగ్గరవుతున్నట్లయింది. ‘నువ్వు మనిషి పుట్టుక పుట్టలేదా?’’ అని భర్తను ముఖం మీదనే అడిగి వేయగలిగింది. అయితే శంకరం డీలాపడిపోలేదు. ‘నువ్వు చెప్పిచ్చుకు కొట్టినా నేను బాధపడను.. పురుగులా బతకడం తప్ప, ఏ మంత్రశక్తులనో సాధించి పెనుపామును కాలేను. ఎవరినో కాటు వేయలేను. నాలో నేను ముడుచుకుపోయి, నన్ను నేను అసహ్యించుకుంటూ హింసించుకొంటూ జీవించటం తప్ప వేరు మార్గం లేదు’ అని కన్‌ఫిషన్ చెప్పలేక, ‘దయచేసి ఈ రాత్రివేళే నువ్వు రామకృష్ణతో వెళ్లిపో. పదిమందీ పగలబడి రకరకాలుగా చెప్పుకుంటారు’ అని ప్రాధేయపడ్డాడు. అతడు చెప్పలేక పోయిన కన్‌ఫిషన్‌ను ఆమె మనసారా, హృదయగతం చేసుకుంది. అతని మీద వున్న అక్కసు అంతా ఆవలకు నెట్టేసి ‘అతన్ని వాటేసుకుంది, పిచ్చిగా అతన్ని కరుచుకు పోయింది.’ పైకి మాత్రం ‘నేను లేకుండా నువ్వెలా బతుకుతావయ్యా-’ అని అతన్ని పెనవేసుకుంది. తరువాత అతనితో అత్తగారి శవదహనానికి సిద్ధం అవుతూ ప్రయాణం అవుతుంది.
పతిభక్తికి పరిమితులున్నాయి. ఆ పరిమితులను దాటి పోవడం పరిస్థితుల ప్రభావం వల్ల యేర్పడుతూ వుండడం- మనం కథలలో- కావ్యాలలో (యివి జీవితాన్ని యథాతథంగా రూపొందించక) చూస్తూ వుంటాం. పరిమితిని దాటకుండా భర్త యొక్క అసహాయతను అర్థం చేసుకుని ఆ స్థితిగతులతో రాజీపడగలగడం వనజాక్షి చేయగలగడం- చదువరులకు కాస్త ఆశ్చర్యం కలిగించే పద్ధతిలోనే వుంటుంది.
జీవితాన్ని గురించి ఎంతటి కమ్మని కలలు కన్నా, వాటినన్నిటినీ దిగమింగుకుని పరిస్థితుల ప్రభావానికి లోనయిపోయిన మనిషి వనజాక్షి. విచ్చలవిడిగా తిరగడానికి అలవాటు పడిన వాళ్లు తప్ప తతిమ్మా స్ర్తిజనం అంత సాధారణంగా ‘శీలం’కు ఎక్కువ విలువ యిస్తారు. ప్రాణం కంటె శీలం ఎక్కువ విలువయినది అని మనసారా నమ్ముతారు. శీలాన్ని తాకట్టు పెట్టగల తత్త్వం బహు అపురూపమయిన పోకడ. ఈ కథానికలో వనజాక్షి స్ర్తిత్వంతోపాటు మానవతా వాదాన్ని రంగరించుకున్న మనిషి. భర్త అంటే ఎంత తక్కువ భావం యేర్పడినా, అతన్ని వంటరిగా వదిలేసి దిక్కులేని పక్షిలా తయారు చేయకుండా అతనితోనే కాలక్షేపం చేయగల గుండె ధైర్యాన్ని సంతరించుకుంది. ధనాపేక్ష, శారీరక కాముకత్వం కాకుండా కేవలం తోటి మనిషిని- మనిషిగా నిలపడానికే తన పతిభక్తిని ఫణంగా పెట్టుతుంది. భక్తి వేరు, బతుకుబాటు వేరు అనే విషయాన్ని వివరించి చెబుతుంది చదువరులకు. సాంసారిక జీవితాన్ని ఓ సరికొత్త కోణంలో- ఆర్థికంగా అణగారిపోయిన స్థితిలో అయితే మటుకేం- మనిషిని మనిషిగా చూపడానికి- చూడటానికి ప్రయత్నించి ఫలితం సాధించిన కథానిక యిది.

- ‘శ్రీవిరించి’