శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పాతకు పాతర.. కొత్తకు జాతర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 19: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడకముందే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని సమర్ధిస్తూ అడుగు ముందుకేసిన వ్యక్తికి ప్రస్తుతం జిల్లాలో పార్టీపరంగా ప్రాధాన్యత తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పగ్గాలు అప్పచెప్పాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి తెలిపిన తొలి వ్యక్తిగా మేకపాటి రాజమోహన్‌రెడ్డికి జిల్లాలో పేరుంది. కానీ సోనియాగాంధీ నిర్ణయం వేరేలా ఉండడంతో వైఎస్ జగన్ వెంటే మేకపాటి కుటుంబం ఉంటుందంటూ సంచలన ప్రకటన చేయడమే కాకుండా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడే సమయంలో ఉన్న అతి కొద్దిమంది నేతల్లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి ముందు వరుసలో ఉంటారు. తమ నేత జగన్మోహన్‌రెడ్డి మాటకు విలువనిచ్చి తన ఎంపీ పదవిని తృణప్రాయంగా వదిలేసి వైకాపా తరపున నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికల బరిలో నిలిచి సుమారు 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో టి.సుబ్బరామిరెడ్డిపై గెలుపొందిన ఘటన మేకపాటి సొంతం. మేకపాటి చర్యలకు ప్రతిచర్యగా అప్పటి యుపిఏ ప్రభుత్వం ఆర్థికంగా ఆయన వ్యాపారాలను నష్టపరచినప్పటికీ అనుకున్న సిద్ధాంతానికి అనుగుణంగా ఆయన ముందుకు నడిచారు. 2014 ఎన్నికల్లో జిల్లాలో వైకాపా అత్యధిక స్థానాలు గెలుపొందడం వెనుక ఆయన కృషి ఉంది. తనతో పాటు తన కుమారుడు గౌతంరెడ్డిని కూడా ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిపించుకోగలిగారు. మేకపాటిపై గౌరవంతో ఆయన్ను జగన్మోహన్‌రెడ్డి లోక్‌సభలో వైకాపా ఫ్లోర్‌లీడర్‌గా నియమించారు. అంతటి వ్యక్తికి ప్రస్తుతం జిల్లాలో పార్టీపరంగా గడ్డుకాలం కనిపిస్తున్నట్లుగా ఉంది. జిల్లాలోనే కాకుండా ఢిల్లీ స్థాయిలోనూ మేకపాటిని కాస్త దూరం జరుపుతున్నట్లుగా కనిపిస్తోంది. లోక్‌సభలో పార్టీ నేతగా ఉన్నప్పటికీ ప్రతి మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డే ప్రధాన వక్తగా మారి మాట్లాడుతుండగా, పక్కన ప్లకార్డులు పట్టుకునేందుకు మేకపాటి పరిమితమవుతున్నారు. పార్టీ విధానాలను ప్రకటించడం, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో జరుపుతున్న పోరాటాన్ని కూడా విజయసాయిరెడ్డే మీడియా ద్వారా తరచూ తెలుపుతున్నారే తప్ప మేకపాటి వెల్లడించిన సందర్భాలు బహు స్వల్పం. నెల్లూరు జిల్లాకే చెందిన విజయసాయిరెడ్డి వైకాపా అధినేత జగన్‌కు ఎంతో సన్నిహితుడు. ప్రస్తుతం మరో నెల్లూరు వాసి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడంలో విజయసాయిరెడ్డి పాత్రే కీలకం. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ప్రభ తగ్గుతున్న మేకపాటికి జిల్లాలోనూ అదే పరిస్థితి ఎదురవుతుండడం గమనార్హం. నెల్లూరు లోక్‌సభ పరిధిలో పార్టీకి చెందిన కార్యక్రమాల్లో పార్టీకి చెందిన ఎంపీగా, పార్టీ వ్యవస్థాపక సమయంలో ఉన్న అతి కొద్ది మంది నేతల్లో ఒకరిగా ఉన్న మేకపాటికి సరైన ఆహ్వానం ఉండడం లేదనేది నిర్వివాదాంశం. తొలుత ఆయన కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎన్నికలు మరో ఏడాదిలో ఉన్న తరుణంలో తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లోకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల పిలుపు లేకపోవడంతో ఎక్కువ శాతం పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉండాల్సి వస్తోంది. అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల నాయకులు పిలిచినా హాజరవుతునే ఉన్నారు. పార్టీలోకి కొత్తనీరు రావడంతో ఆది నుండి పార్టీని భుజస్కంధాలపై మోస్తూ జిల్లాలో పార్టీ ఉనికికి ఎంతో కృషి చేసిన మేకపాటి కుటుంబానికి ప్రస్తుతం దక్కుతున్న ప్రాధాన్యత అంతంతమాత్రంగానే ఉంది. జిల్లాలో పార్టీ వ్యవహారాలన్నీ ప్రస్తుతం విజయసాయిరెడ్డి కేంద్ర బిందువుగా కొనసాగుతుండడం గమనార్హం. సాధారణ ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉన్న సమయంలో మేకపాటి వంటి రాజకీయ కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై తమ నేత జగన్మోహన్‌రెడ్డి దృష్టి నిలపాలని మేకపాటి అభిమానులు కోరుతున్నారు.