శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బాబు పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 23: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని, చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పోరాటం చేస్తున్నారని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా సాధన కోసం పదవులకు రాజీనామా చేసిన అనంతరం మొదటిసారి పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు రైల్వేస్టేషన్‌కు చేరుకోగా ఆయనకు వైసీపీ శాసనసభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రైల్వేస్టేషన్ నుండి నగరంలోని వైకాపా కార్యాలయానికి భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వైకాపా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మేకపాటి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా ప్రాణవాయువు లాంటిదన్నారు. 11 రాష్ట్రాలు అనుభవిస్తున్న హోదాను ఏపీకి కల్పించి ఆదుకోవాలన్న డిమాండ్‌తోనే పోరాటం చేస్తున్నామన్నారు. ఆంధ్రాను చీల్చడంలో భారతీయ జనతాపార్టీ పాత్ర కూడా ఉందని, హోదా ఇవ్వకపోవడంలో మోదీ ప్రధాన ముద్దాయి అయితే చంద్రబాబు రెండో ముద్దాయి అని అన్నారు. మోదీ వైభవం తగ్గుముఖం పడుతుందనే చంద్రబాబునాయుడు బీజేపీకి దూరమయ్యారన్నారు. 2019 ఎన్నికల్లో 20 ఎంపీ స్థానాలు గెలిపించాలని పార్టీశ్రేణులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. రాబోవు ఎన్నికల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ అవడం ఖాయమని, చంద్రబాబుకు ప్రజలు సరైన బుద్ధి చెబుతారన్నారు. ప్రత్యేకహోదా సాధించే వరకు జగన్ పోరాటం ఆగదన్నారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి పోరాటాలు కొత్తేమీ కాదన్నారు. గతంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి జగన్ వెంట నడిచి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికల్లో జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక మెజార్టీతో గెలుపొందారన్నారు. ప్రత్యేకహోదా కోసం పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొని హోదా నినాదాన్ని ఢిల్లీ వీధుల్లో వినిపించి నెల్లూరుకు వచ్చిన ఎంపీ మేకపాటిని పార్టీశ్రేణులు, కార్యకర్తలు ఆదరించి తరలివచ్చిన ప్రతిఒక్కరికి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియచేశారు.
నెల్లూరు రైల్వేస్టేషన్‌లో ఘన స్వాగతం
ఎంపీ పదవికి రాజీనామా చేసి మొదటిసారి నెల్లూరుకు చేరుకున్న ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి సోమవారం వైకాపా శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మేకపాటి గౌతమ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జడ్పీ వైస్ చైర్‌పర్సన్ పొట్టేళ్ల శిరీష, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాధ్, నాయకులు, మేరిగ మురళి, కార్యకర్తలు తదితరులు పెద్దఎత్తున స్టేషన్‌కు తరలి వచ్చారు. పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరుకు వచ్చిన ఎంపీ మేకపాటిని ఘనంగా స్వాగతించారు. కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. స్టేషన్ ఆవరణ అంతా దద్దరిల్లేలా కార్యకర్తలు ప్రత్యేక హోదా నినాదం చేశారు.
నగరంలో భారీ ర్యాలీ
నెల్లూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పార్టీశ్రేణులు, నాయకులు, కార్యకర్తలు నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన ర్యాలీ బోసుబొమ్మ కూడలి నుంచి గాంధీబొమ్మ, వీఆర్‌సీ, ఆర్టీసీ మీదుగా మాగుంట లేఅవుట్‌లోని వైకాపా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈ బైక్ ర్యాలీలో విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున జై జగన్, జై మేకపాటి అంటూ నినాదాలు చేశారు. ఈసందర్భంగా నగరంలో కొంతమేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.