క్రైమ్/లీగల్

ట్రాక్టర్ బోల్తా: వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాకాడు, నవంబర్ 8: మండల పరిధిలోని అందలమాల గ్రామంలో పండుగపూట విషాదచాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన ఒక రైతు పొలం పనులు చేసుకుని ట్రాక్టర్‌పై తిరిగి వస్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తాపడటంతో ఆ రైతు అక్కడికక్కడే మృతిచెందగా, తన కుమారుడు మరణాన్ని తట్టుకోలేక ఆయన తల్లి దుర్మరణం చెందింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం బుధవారం సాయంత్రం వెంకటయ్య(45) అనే రైతు వ్యవసాయ పనులకోసం ట్రాక్టర్‌పై వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా ట్రాక్టర్ బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని స్థానిక పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాలిరెడ్డిపాళెంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుమారుడి మృతిని తట్టుకోలేక వెంకటయ్య తల్లి పోలమ్మ(80) అపస్మారకస్థితిలోకి వెళ్లి మృతిచెందింది. పోలమ్మ, సోమయ్య దంపతులకు ఆరుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. మూడవ కుమారుడైన వెంకటయ్య వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతుడు వెంకటయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లీ, కొడుకు మృతిచెందడంతో అందలమాల గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. వాకాడు ఎస్సై రఘునాథ్ కేసు నమోదు చేసారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తంరెడ్డి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 11మందిపై కేసులు
తడ, నవంబర్ 8: మద్యం సేవించి జాతీయ రహదారిపై వాహనాలు నడుపుతున్న 11మందిపై ఎస్సై కేసులు నమోదు చేశారు. తడ పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 11మందిపై కేసులు నమోదు చేసినట్లు తడ ఎస్సై వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా వాహనాలకు సంబందించిన పత్రాలు కలిగి ఉండాలని, మద్యం సేవించిన వారికి వాహనాలను ఇవ్వవద్దని, చిన్నపిల్లలకు కూడా వాహనాలు ఇవ్వకూడదని ఎస్సై వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన ఈ-చలానా విధానం అమలులోకి వచ్చిందని, ఇకపై వాహనదారుల వద్ద సక్రమమైన పత్రాలు లేకపోతే కేసులు నమోదు చేస్తామని, వాహనదారులకు ఈ చలానా విధిస్తామని తెలిపారు. ఈ చలానా వచ్చినవారు మీ-సేవా కేంద్రాల నుంచి కానీ, ఏపీ ఈ-చలానా పోర్టల్ ద్వారా కానీ, పేటీఎం ద్వారా కానీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. వాహనదారులు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలన్నారు.

రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
సూళ్లూరుపేట, నవంబర్ 8: సూళ్లూరుపేట మండలం కోటపోలూరు రైల్వేగేట్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తుతెలియని యువకుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం తెలుసుకొన్న రైల్వే ఎస్సై టి.చెంచుకృష్ణయ్య సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుని జేబులో తెనాలి నుంచి చెన్నైకి వెళ్లే టికెట్ తప్ప మరేమి ఆధారాలు దొరకలేదు. మృతుడు సిమెంట్ కలర్ ఫ్యాంట్, ఎరుపురంగు టీషర్టు ధరించి ఉన్నాడు. వయస్సు 25 సంవత్సరాలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. తెనాలి నుంచి చెన్నైకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.