క్రైమ్/లీగల్

గురుకుల పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయుడుపేట, ఆగస్టు 24: పట్టణ పరిధిలోని బాలుర గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పిగిలాం శివప్రతాప్ (15) అనే విద్యార్థి పాఠశాల గదిలో తలుపులు వేసుకొని ఉరేసుకుని మృతి చెందిన సంఘటన పట్టణంలో శుక్రవారం సంచలనం సృష్టించింది. పాఠశాల ఉపాధ్యాయులు చదువులపై ఒత్తిడి పెంచి కొట్టడం వలనే తమ బిడ్డ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, విద్యార్థి మృతి పట్ల తమకు ఎలాంటి సంబంధం లేదని ఉపాధ్యాయులు చెప్తుండటంతో పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. వివరాలిలా ఉన్నాయి. చిట్టమూరు మండలం తాడిమేడు గ్రామానికి చెందిన శివప్రతాప్ 5వ తరగతి నుంచి నాయుడుపేట గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. ప్రస్తుతం ఈ పాఠశాలలో వౌలిక సదుపాయాలు సరిగా లేవన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు గత ఏడాది ఈ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణతశాతం ఆశాజనకంగా రాలేదు. దీంతో ఈ ఏడాది పాఠశాల ఉత్తీర్ణత శాతం పెంచడానికి ఉపాధ్యాయులు దృష్టి పెట్టారు. శివప్రతాప్ చదువులో చురుకైన విద్యార్థి కాకపోవడంతో మందలింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో గడచిన బుధవారం బక్రీద్ సెలవుదినం కావడంతో ఉపాధ్యాయుల వద్ద గంటసేపు అనుమతి పొంది పట్టణంలోని తమ కుటుంబ సభ్యుల శుభకార్యంలో శివప్రతాప్ పాల్గొన్నాడు. అక్కడి నుంచి పాఠశాలలో చెప్పకుండానే తన తండ్రి మునిరత్నంతో కలసి నేరుగా ఇంటికి వెళ్లాడు. ఇంటి వద్ద తల్లి వెంకటరమణమ్మతో బడికి వెళ్లనని, ఉపాధ్యాయులు కొడుతున్నారని మొరపెట్టుకున్నాడు. అయినప్పటికీ తల్లి వినకుండా గురువారం మధ్యాహ్నం పాఠశాలకు తీసుకొచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడింది. శివప్రతాప్‌ను పాఠశాలలో చేర్చుకునేది లేదని, అనుమతి లేకుండా ఇంటికి వెళ్లిపోతున్నాడని ఉపాధ్యాయులు చెప్పారు. పాఠశాలలో విద్యార్థి మాయమైతే తమకు ఎలాంటి సంబంధం లేదన్న తల్లి హామీపత్రం మేరకు తిరిగి పాఠశాలలో చేర్చుకున్నారు. శుక్రవారం పాఠశాలలో లెక్కలు క్లాసుకు హాజరైన శివప్రతాప్ తరువాత జరిగిన సోషల్ స్టడీస్ క్లాసులో విద్యార్థి మాయమయ్యాడు. దీంతో కంగారుపడ్డ ఉపాధ్యాయులు కొంతమంది విద్యార్థులచే శివప్రతాప్ ఎక్కడ ఉన్నాడని వెతికించారు. అయితే అతను పడుకునే గదిలో ఉరితాడుకు వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన తోటి విద్యార్థులు వెంటనే అక్కడున్న వారికి తెలియచేశారు. అందుబాటులో ఉన్న ఎలక్ట్రీషియన్, నర్సు సౌమ్య ఉరితాడును తప్పించి విద్యార్థిని కిందకు దించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ పీవీ సుబ్బారావు తెలిపారు. అయితే తమ బిడ్డ ఉరివేసుకొని మృతి చెందిన వైనాన్ని కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. పాఠశాల నిర్వాహకులే బిడ్డను కొట్టి, చనిపోవడంతో ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరిస్తున్నట్లు తండ్రి మునిరత్నం ఆరోపిస్తున్నారు. శరీరంపై గాయాలు ఉన్నాయని, తమ బిడ్డ మృతిపై దర్యాప్తు చేయించాలని వారు కోరారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సిఐ మల్లికార్జునరావు సంఘటన స్థలంలోని గురుకుల పాఠశాలలో విచారణ ప్రారంభించారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను విచారించారు. ఎస్సై వేణు కేసు నమోదు చేశారు. డీఎస్పీ రాంబాబు ఆసుపత్రి వద్ద మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శవ పంచనామా అనంతరం దోషులు ఎవరని తేలితే ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని హామీ ఇచ్చారు. దావానంలా వ్యాపించిన ఈ సమాచారంతో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆసుపత్రి వద్ద మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదే బాటలో మాజీ మంత్రి పరసా రత్నం, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ పట్టణాధ్యక్షుడు కామిరెడ్డి రాజారెడ్డి తదితరులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ హేమలత, బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

నీటితొట్టిలో పడి చిన్నారి మృతి
పొదలకూరు, ఆగస్టు 24 : పట్టణంలోని కెఆర్ నగర్‌లో శుక్రవారం అఫ్రిన్ (2) అనే చిన్నారి నీటి తొట్టిలో పడి మృతి చెందింది. కసుమూరు మండలం ఇస్లాంపేటకు చెందిన మొబిన బాను, ఆసిఫ్ దంపతులు గత పదేళ్ల నుంచి ఇక్కడికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండేళ్ల కుమార్తె అఫ్రిన్ ఆడుకుంటూ పొరపాటున వరలతో తయారు చేసిన తొట్టిలో పడిపోయింది. పాప కనిపించకపోవడంతో తల్లి వెతుకుతుండగా తొట్టిలో చిన్నారి మృతదేహం కనిపించింది. విగత జీవిగా పడి ఉన్న తమ బిడ్డను చూసిన తల్లిదండ్రులు మృతదేహంపై పడి రోదించడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. పాప మృతదేహాన్ని స్వగ్రామమైన ఇస్లాంపేటకు తరలించారు. మండల కో ఆప్షన్ మెంబర్ షేక్ అంజాద్ నిరుపేద బాధిత కుటుంబానికి దారి ఖర్చులకు గాను ఆర్థిక సహాయం అందజేశారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
అనంతసాగరం, ఆగస్టు 24: మోటారు బైక్ ఢీకొన్న సంఘటనలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని ముత్తుకూరులో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కలువాయి మండలం పెన్న బద్వేలు గ్రామానికి చెందిన దండు పెంచలయ్య(54) అనే వ్యక్తి తన కుమార్తె వివాహానికి సంబంధించిన పెళ్లికార్డులు బంధువులకు అందచేస్తున్నారు. అందులో భాగంగా మండలంలోని ముత్తుకూరులోని బంధువులకు కార్డులు పంచి ఆత్మకూరుకు వెళ్లేందుకు బస్సుకోసం సెంటరులో నిలబడి ఉండగా గుర్తుతెలియని వ్యక్తి మోటారుబైక్‌తో ఢీకొట్టి వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో పెంచలయ్య అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై రఘునాథ్‌రావు తెలిపారు. పెంచలయ్య మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కూతురు వివాహం జరుగుతోందన్న సంతోషంలో బంధుమిత్రులను ఆహ్వానించేందుకు వెళ్లిన పెంచలయ్యను మృత్యువు మోటారు వాహనం రూపంలో బలిగొంది. ఇంటిపెద్దను కోల్పోయిన ఆ కుటుంబం, వేయి ఆశలతో అత్తారింటికి వెళ్లాల్సిన ఆ యువతి తలరాతను తలచుకుని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.