శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

మాయ జింకను చంపాల్సిందేనని లక్ష్మణుడికి చెప్పిన రాముడు ( అరణ్యకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతాదేవి కోరిన విధంగా మృగాన్ని పట్టుకోవాలని భావించిన శ్రీరామచంద్ర మూర్తి సంతోషంగా లక్ష్మణుడితో అన్నాడిలా: ‘లక్ష్మణా! చూశావా! ఈ జింక మీద సీతకు ఎంత ఆశ కలిగిందో? ఆడవారి మాటలకు, కోరికలకు ఏముంది అంటావా? అది వేరే సంగతి. మనం కూడా ఇలాంటి సౌందర్యంకల జింకను చూశామా? మున్ముందు చూడగలమా? ప్రపంచమంతా మనం చూశామా? ఎక్కడేముందో ఎవరికి తెలుసు అంటావేమో? చూడకపోతే పోనివ్వు. ఈ లోకంలో కాకపోతే పోనీ. ఇంద్రుడి నందనవనంలో కుబేరుడి చైత్ర రథం ఉందని ఎవరైనా చెప్పగా విన్నామా? లేదు కదా? దీని (జింక) కాంతి ఆకాశాన్ని తాకుతున్నది కదా? బంగారు వనె్నతో ప్రకాశించే చుక్కల సమూహంతో అందంగా వుంది కదా? వెంట్రుకలు కొన్ని అనులోమంగా, కొన్ని ప్రతిలోమంగా ఉన్నాయి కదా? అది ఆవలిస్తే మేఘం నుండి వెలువడ్డ మెరుపు లాగా అగ్నిజ్వాల లాంటి నాలుక నోటి నుండి బయటకు వస్తున్నది.’
‘ఈ జింక ముఖం ఇంద్రనీల కాంతిలాగా, కడుపు శంఖం లాగా ముత్యంలా తెల్లగా, ఠీవి సౌందర్యంలో అతి గొప్పగా ఉంది. ఇలాంటిది ఎవరి మనసు హరించదు? అనేకమైన రత్నకాంతులతో నిండి, బంగారు వనె్నతో కూడి, రూపం చూడగానే సీత మాట ఎలా వున్నా, ఏ మనుష్యుడి మనస్సు కరగకుండా ఉంటుంది? రాజులు మాంసం కొరకు వేటలో మృగాలను చంపుతారు. ధాతువులనే మణులను, బంగారాన్ని, ధన సమూహాన్ని, వేటలోనే సంపాదిస్తారు. రాజుకు సర్వం అడవిలోనే దొరుకుతుంది. ఈ మృగాన్ని చంపడం వల్ల ఏ విధంగా విశేషార్థ లాభం కలుగుతుంది అంటావా? బంగారుమయమైన ఈ శ్రేష్టమైన జింక చర్మం మీద సీతాదేవి నాతో కలిసి కూర్చోవాలని ఆశ పడుతున్నది. మృగ జాతుల్లో భూమీదఈ జింక, ఆకాశంలో చంద్రుడిలోని జింక, రెండే మనోహరమైనవి కానీ మిగతావన్నీ కావని నా అభిప్రాయం. ఇది మాయామృగం. జీవితంలో పట్టుబడదు. అందుకే దీన్ని చంపాలి.’
శ్రీరాముడు లక్ష్మణుడితో ఇంకా ఇలా అన్నాడు. ‘ఈ కారణాన పరాక్రమంతో దీన్ని చంపడమే తగిన పని. ఈ ప్రదేశంలోనే పూర్వం వాతాపి అనే రాక్షసుడు మునుల కడుపుల్లో ప్రవేశించి తేలులాగా వాళ్ల పొట్టలు పగులచీల్చి హింసా మార్గంలో నడుస్తుండే వాడు. ఒకనాడు అగస్త్య ముని వాడిని తిన్నాడు. అతడి కడుపులోంచి లేవడానికి ప్రయత్నించే సమయంలో అగస్త్యుడు వాడు భయపడేట్లు, రాక్షసుడు బ్రాహ్మణులంటే లక్ష్యం లేకుండా దయాహీనుడై పాపం పనులు చేస్తున్నాడనీ, శాశ్వతంగా తన కడుపులో జీర్ణమై పొమ్మనీ అన్నాడు. ఆ విధంగా అగస్త్యుడు వాడిని చంపాడు. వీడూ ఆ వాతాపి అంతటివాడే! అగస్త్యుడి వల్ల వాడు ఎలా చచ్చాడో, వీడు కూడా మనల్ని మోసగించడానికి వచ్చాడు కాబట్టి, వీడూ చావాల్సిన వాడే. నేను వేట కోసం పోతాను. నువ్వు దృఢ ప్రయత్నంతో సీతకు అపాయం కలగకుండా కాపాడాలి. మన ప్రయత్నాలన్నీ ఈమె మీదే ఆధారపడి వున్నాయి. కాబట్టి శ్రద్ధగా రక్షించు. ఈ మృగం నువ్వు చెప్పినట్లు రాక్షస మాయ అయితే చంపుతాను. లేక సహజ మృగమే అయితే జాగ్రత్తగా పట్టి తెస్తాను. వీటిలో ఏదో ఒకటి చేస్తాను. లక్ష్మణా! సీతాదేవిని చూస్తుండు జాగ్రత్తగా. ఆ మృగం చర్మం మీద ఎంత మోహం పెట్టుకుని చూస్తున్నదో కదా!’
‘కాబట్టి ఒక్క బాణంతో ఈ జింకను చంపి చర్మం తీసుకుని శీఘ్రంగా వస్తాను. ఒక బాణ ప్రయోగానికి ఎంతసేపు పట్తుందో, అంతసేపట్లోనే వస్తాను. నేను బాణం ప్రయోగించడమే ఆలస్యం. నేను వచ్చేదాకా ఈ సీతను నువ్వు హెచ్చరిక తప్పకుండా ఏకాగ్ర మనస్సుతో సర్వదా కాపాడు తమ్ముడా. పక్షిరాజైన జటాయువు కార్యసాధన సమర్థుడు. మంచి బలవంతుడు. కార్యాలోచన, కార్యదక్షణ, ధైర్యం కలవాడు. ఆయన నీకు సహాయకుడుగా ఈ సీతాదేవిని ప్రతిక్షణం, ఏ మూల ఏం జరుగుతుందో అన్న ఏమరుపాటుతో, ఏ మాత్రం పొరపాటు చేయకుండా ఒక వ్రతంగా భావించి రక్షిస్తాడు.’
(శ్రీరాముడి చర్య వలన గ్రహించాల్సిన నీతి ఉంది. ఆయన భ్రమ పడడమే కాకుండా, లక్ష్మణుడు చెప్పినా వినలేదు. మారీచుడి మాయ అని నమ్మితే, ఉన్నచోటే వుండి బాణ ప్రయోగం చేయవచ్చు కదా? జింక వెంట పోవాల్సిన పని లేదు. కాకాసురుడి వెంట పడిపోలేదు కదా? కాబట్టి అది నిజమైన జింకే అన్న భ్రాంతి వదలలేదు. సీతాదేవి లోకమాన్య స్ర్తి అవుతుందా? ఆమెకు తెలియని విషయాలు లేవు కదా? బంగారు జింక లోకంలో వుండదని తెలియదా? పరమ భక్తిగల సీత ఎందుకు ఒక క్షుద్ర మృగానికై భర్తను వదిలి వుండాలని అనుకుంది? కాబట్టి కర్మానుసారం బుద్ధి అనే నీతి బలపడుతున్నది.
పరమార్థం విచారిస్తే.. మనుష్యులకు కోరికలు కోరే స్వాతంత్య్రం ఉంది. దాన్ని నెరవేరుస్తాడు. కాని దాని ఫలం అనుభవించమని అంటాడు. కాబట్టి మంచి కోరికలు కోరే వారికి మంచి ఫలమే కలుగుతుంది. చెడు కోరికలు కోరేవారికి కలిగేది చెడు ఫలమే! ప్రకృతి విషయమైన కోరికలు కోరేవారందరికీ సీతాదేవికి పట్టిన గతే పడ్తుంది. మారీచుడి మాయే ప్రకృతి. ప్రపంచంలో మనం చూసేవి, వినేవి అన్నీ ప్రకృతి చిత్రాలే! సీతాదేవి మాయ జింకను చూసి భ్రమించి ఆశ పడినట్లు మనం కూడా చిత్ర విచిత్రమైన ప్రకృతి పదార్థాలను చూసి సత్యమని భ్రమ పడుతున్నాం. ఇవి సత్యం కావు. క్షణభంగురాలు. ఆ జింక వల్ల సీతాదేవి ఎలా సుఖపడాలని కోరుకుందో అలాగే మనం ప్రకృతి పదార్థాలవల్ల ఆనందపడాలని కోరతాం. రామచంద్రమూర్తి సీతాదేవి కోరిక నెరవేర్చినట్లే మన కోరికనూ నెరవేరుస్తాడు. సీతాదేవి అనుభవించిన ఫలం మనం కూడా అనుభవించబోతున్నాం. సీతకు ఏం ఫలం కలిగింది? అది మున్ముందు తెలుసుకుంటాం.)

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690
-సశేషం

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12