శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

లక్ష్మణుడికి యుద్ధ శకునాలు చూపిన శ్రీరాముడు( అరణ్యకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విధంగా రాక్షసులు యుద్ధ కాంక్షతో పోతుంటే, గాడిద రంగు కల మేఘం రక్తవర్షం కల నీళ్లను వానగా కురిసింది. రథానికి కట్టిన గుర్రాలు, ఎత్తుపల్లాలు, గుంటలు లేని సమానమైన ప్రదేశంలో పూలున్న చోట తటాలున జారిపడ్డాయి. సూర్యుడి చుట్టూ కొరివి చక్రంలాగా గుండ్రంగా, నల్లగా, అంచున ఎర్రగా, భయంకరంగా పరివేషం కనపడింది. బంగారు ధ్వజ దండం మీద గద్ద ఒకటి వాలి కూచుంది. మాంసం తినే జంతువులు వికార స్వరాలతో అరిచాయి. సూర్యుడికి ఎదురుగా ఆయన్ను చూస్తూ నక్కలు కూశాయి. కొండల గుంపును వజ్రాయుధంతో ఇంద్రుడు రెక్కలు నరికినప్పుడు నెత్తురు ఎలా కారిందో, అలాగే ఇప్పుడూ కారడం జరిగింది. భూమేదో, దిక్కులేవో, తెలియకుండా చిమ్మచీకట్లు కమ్మి మబ్బులు పెరిగాయి. సంధ్యాకాలం కాకపోయినా ఆకాశం నెత్తుట తడిసిన ముద్దలాగా కనిపించింది. ఖరుడికి ముఖాముఖిగా గద్దలు, తడేళ్లు పరుషమైన ధ్వనులు చేశాయి. నక్కలు మంటలు కక్కుకుంటూ భయంకరంగా కూశాయి.
అమావాస్య కాకపోయినా రాహువు సూర్యుడిని మింగింది. సూర్యుడికి పక్కన భయంకరమైన మొండెం ఒకటి కనబడింది. ఎదురు ముఖంగా పెద్ద గాలి రివ్వున వీచింది. సూర్యుడి కాంతి క్షీణించింది. రాత్రి కాకపోయినా, చుక్కలు, నక్షత్రాలు ఆకాశంలో మిణుగురు పురుగుల్లా కనిపించాయి. నీళ్లలో దాగిన చేపలు కమలాలతో కలిసి సరస్సుల్లో వుండిపోయాయి. చెట్ల నుండి పూలు, పళ్లు రాలిపోయాయి. గాలి లేకున్నా ఎదురుగా ఎర్రటి దుమ్ములు ప్రబలాయి. గోరువంక పక్షులు వీచి - కూచి అని అరవసాగాయి. భయంకర ఆకారంతో నిర్ఘాతవాయువులు ఉల్కా తేజస్సులు అతిశయించాయి. భూమి కొండలతో, నదులతో వణికింది. ఖరుడికి ఎడమ భుజం అదిరింది. సింహనాదం చేద్దామంటే గొంతు మొద్దుబారి పోయి ధ్వని రాలేదు. నిష్కారణంగా కళ్ల వెంట నీళ్లు కారాయి. నొసట నొప్పి కలిగింది. ఇన్ని అపశకునాలు కలిగినా ఆ మూర్ఖుడు ప్రయాణం ఆపుచేసుకోలేదు.
ఈ విధంగా భయంకరమైన గొప్ప అపశకునాలు నాలుగు పక్కలా కలగడం చూసి ఆ రాక్షస నాయకుడు బలగర్వంతో వాటిని అలక్ష్యపరచి రాక్షస గుంపుతో వారు అధైర్యపడకుండా ఇలా అన్నాడు.
‘స్పష్టంగా కనపడే ఆ అపశకునాలకు నేను జంకేవాడిని కాను సైనికులారా! పిరికివాడు వీటికి భయపడుతాడు కాని, భుజబలం ఉన్నవారు వీటిని లక్ష్యపెట్టడుగా? నా బాణ వర్షంతో నక్షత్రాలనైనా నేలపడగొట్తాను. యముడిని దండిస్తా. అలాంటి బలపరాక్రమాలు కల నేను రామలక్ష్మణులను యుద్ధంలో చంపకుండా వెనక్కు పోతానా? మా అక్క తన కోరిక తీరా వారి రక్తాలు తాగాలి కాక. యుద్ధంలో ఇంతకు ముందు నాకెప్పుడూ అపజయం కలగలేదు. ఇది మీరే కళ్ళారా చూశారు. అసత్యం చెప్పను. యుద్ధంలో ఇంద్రుడిని జయించాను. అలాంటి వాడిని ఇలాంటి నిస్సారపు మనుష్యుల చేతిలో చస్తానా?’
ఇలా చెప్పి సింహనాదం చేయగా రాక్షస శ్రేష్టులందరు యమపాశంతో కట్టబడినవారైనందున ఆ ధ్వనికి సంతోష సముద్రంలో తేలియాడారు. యుద్ధం చూద్దామని వచ్చిన దేవతలు, సిద్ధులు, ఋషిశ్రేష్ఠులు, గంధర్వులు ఆకాశంలో నిలిచి, గోవులకు, బ్రాహ్మణులకు, లోకహితకారులకు మేలు కలగాలని కాంక్షించారు. లోకహితం కోరి శుభకార్యాలు చేసే సుదర్శన చక్రధారైన విష్ణువు రాక్షసులను జయించిన విధంగానే, శ్రీరామచంద్రుడు సర్వ రాక్షసులను యుద్ధంలో జయించాలని కోరుకుంటూ వుండగా, ఆకాశంలో నిలబడ్డవారికి, రాక్షస సేన సంతోషంగా, ఉత్సాహంగా యుద్ధానికి రావడం చూశారు.
తాను అనుకున్న విధంగా, వేగంగా తన సైన్యం నడవకుండా ఉండడంతో, ఖరుడు ఆలస్యం చేయకుండా సైన్యం అంతా వెనుకబడే విధంగా ముందుగా తన రథాన్ని నడిపించాడు. అతడి వెంట అమాత్యులు శే్యనగామి, పృథుగ్రీవుడు, కాలకార్ముకుడు, యజ్ఞశత్రువు, సర్వాసుడు, దుర్జయుడు, మేఘమాలి, పరుషుడు, మహామాలి, విహంగముడు, రుదిరాశనుడు, కరవీరాక్షుడు అనే పనె్నండు మంది నడిచారు. అలాగే దూషణుడి వెంట స్థూలాక్షుడు, ప్రమాధి, మహాకపాలుడు, త్రిశిరుడు అనే నలుగురు ధ్వని చేసుకుంటూ నడిచారు. సూర్యచంద్రుల మీద క్రూర గ్రహాల గుంపు పరుగెత్తినట్లు సూర్యవంశంలో పుట్టిన వారిలో శ్రేష్టులైన శ్రీరామలక్ష్మణుల మీదికి యుద్ధ కాంక్షతో రాక్షస సైన్యం నడిచింది.
ఆ సమయంలో శ్రీరామచంద్రమూర్తి అన్ని దిక్కులలో స్పష్టంగా కనపడుతున్న అపశకునాలను అన్నిటినీ చూపించి, తమ్ముడితో ఇలా అన్నాడు. ‘లక్ష్మణా! చూశావా? రాక్షసులకు వినాశనం సూచించే అపశకునాలు. అన్ని చోట్లా విస్తారంగా కనిపిస్తున్నాయి. ఏదో కీడు రాగలదు. ఈ శకునాలు వ్యర్థమయ్యేవి కావు. మరణం సమీపించిన వారి ముఖాలు యుద్ధ సమయంలో వెలవెల పోయి కాంతి హీనంగా ఉంటాయి. నీ ముఖం కాంతివంతంగా, శోభాయుక్తంగా, నిర్మలంగా, అందంగా ఉంది. కాబట్టి జయం నాకు మాత్రమే కాకుండా నీకు కూడా కలుగుతుంది. మనకు భయంలేదు. ఆకాశంలో మేఘాలు గాడిద కాంతితో, గాడిదల కఠోర ధ్వనితో, నెత్తురుల లాంటి జలధారలు కలిగినవిగా వున్నాయి. మన విల్లులు పొగలెగుసూత తమంతట తామే కదులుతున్నాయి. చాపాల్లో మంటలు వస్తున్నాయి. అడవుల్లో పక్షుల ధ్వని వింటే ప్రాణ హింసాత్మకమైన భయం కలుగుతుంది. శత్రువులు చస్తారు. మనకు జయం కలుగుతుంది. భయంకరమైన యుద్ధం జరగబోతున్నది. కుడిచేయి అదురుతున్నది. రాక్షసుల భయంకర ధ్వనులు, నగారాల మోతలు వినపడుతున్నాయి. కాబట్టి శత్రువులు సమీపంలోనే వున్నారు. ఆపద రాబోతున్నదని తెలియగానే అనాగత విధాత అయిన ఆలోచనాపరుడు చలింపక ఆ ఆపద తొలగిపోయే ఉపాయాన్ని ముందుగానే తన బుద్ధితో ఆలోచించి చేస్తాడు.
-సశేషం
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం,
గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12