రాష్ట్రీయం

తెలుగువాడి సత్తా చూపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్): వీరపుత్రులకు జన్మనిచ్చిన పుణ్యభూమి...మహా ప్రవక్తలు పుట్టిన వేదభూమి...పౌరుషానికి ప్రతీతి అయిన బ్రహ్మనాయుడు నడయాడిన నేల...బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గడ్డ ఈ తెలుగు గడ్డ అని హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ గుజరాత్ తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో సాగించేందుకు ప్రధాని మోదీ చూస్తున్నారని, అటువంటి ఆటలు ఇక్కడి తెలుగు ప్రజల ముందు సాగవన్నారు. వ్యక్తులను గౌరవించడం మోదీ ముందుగా నేర్చుకోవాలన్నారు. ఏపీకి నమ్మకద్రోహం చేసిన బీజేపీకి ఒక్కసీటు కూడా రాష్ట్రంలో రాదన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన పూర్వపు రోజుల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహాన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. బడుగు, బలహీన, మైనారిటీ, వెనుకబడిన తరగతుల కులాలను పైకి తీసుకువచ్చి వారిని అధికార పీఠంలో కూర్చోబెట్టిన ఎన్టీఆర్ పుట్టిన ఈ నేలపై ప్రాంతాల వారీగా విభజించే పాలనను సాగనివ్వమన్నారు. అశాస్ర్తియంగా విభజించిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్న సమయంలో అన్ని విధాలుగా కేంద్రం అదుకుంటుందనే భావనతోనే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సామ, దాన, భేదాలు ఇప్పటి వరకు కేంద్రం లోని బీజేపీపై వినియోగించామన్న ఆయన ఇక చివరకు దండోపాయం వినియోగించాల్సిన సమయం వచ్చిందని ఆవేశపూరితంగా ప్రసంగించారు. రాజకీయాల్లో మోదీ కంటే సీనియర్ అయిన చంద్రబాబును చూసి మోదీ ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యంగా పెద్దలను గౌరవించడం ముందు మోదీ నేర్చుకోవాలని, సొంత భార్యను, పార్టీలో పెద్దలను గౌరవించాలని సూచించారు. తెలుగువారి మనోభావాలను తెలుసుకునేందుకు దేశంలోనే హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే తెలుగును నేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశాన్ని ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజించి పాలించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. తెలుగువారు పిరికివాళ్లు అనే భావనతో ప్రధాని కొందరితో కలసి కుప్పిగంతులు వేయిస్తూ, చిల్లర రాజకీయాలు చేస్తూ, కొన్ని పార్టీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటూ శిఖండిలా, కొజ్జాలా వ్యవహరిస్తున్నారని ఘాటుగా ఆరోపించారు. కొందరు ఎంపీల రాజీనామాలు, నిరాహార దీక్షల వెనుక ఎన్ని ప్యాకేజీలో ఉన్నాయో దేశంలోని అందరికీ తెలుసని వైకాపా ఎంపీలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఏపీలో బీజీపీ, వైకాపాల చీకటి ఒప్పందాల గురించి రాష్ట్రంలోని అందరికీ తెలుసన్నారు. తెలుగువారి జోలికి వస్తే వారు వీరు అని తేడా లేకుండా అందరికీ తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. అంతకముందు ప్రత్యేక హోదా...ఆంధ్రుల హక్కు నినాదాలతో ఆయన ప్రసంగం ప్రారంభించి, దేశం కోసం రాష్ట్రం కోసం అమరులైన ఎందరినో గుర్తుచేస్తూ అందరిని అకట్టుకునేలా హిందీ భాషాలో మాట్లాడి, సభకు వచ్చినవారిలో ఉత్సాహాన్ని నింపారు. చివరిగా రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.