తెలంగాణ

విజృంభిస్తున్న మెదడు వాపు వ్యాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మెదడువాపు (ఎన్‌సెఫలైటిస్) వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రమాదకరమైన ఈ వ్యాధి చిన్నపిల్లలకు వైరల్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల ద్వారా సోకుతుంది. తాజాగా హెల్పింగ్ హేండ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో 2015-16కి గాను 203 మెదడువాపు వ్యాధి కేసులు నగరంలోని పలు హాస్పిటళ్లలో నమోదయ్యాయని తేల్చింది. నగరంలో పేరొందిన ఏడు చిన్న పిల్లల హాస్పిటళ్ల నుంచి రక్త నమూనా పరీక్షల నివేదికలను సేకరించిన ఫౌండేషన్ సంస్థ ఆ వివరాలను వెల్లడించింది. రెయిన్‌బో చిల్డ్రన్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్‌లో 43, నిలోఫర్ హాస్పిటల్‌లో 80, దక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్‌స్ 17, గాంధీ హాస్పిటల్‌లోని చిన్నపిల్లల యూనిట్‌లో 24, ఆదిత్య చిన్న పిల్లల హాస్పిటల్‌లో 25, ప్రిన్స్‌సెస్ దుర్రే షెహవార్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో 9, ప్రిన్స్‌సెస్ ఎస్రా హాస్పిటల్‌లో 5 కేసులు నమోదైనట్లు సర్వేలో తేలింది. 2015-16లో మొత్తం 203 మెదడు వాపు కేసులు నమోదైనట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. పైకి కనిపించకుండా మెదడు వాపు వ్యాధి క్రమేణా పెరుగుతోంది. వైరల్, బ్యాక్టీరియా ద్వారా సోకే ఈ వ్యాధి వల్ల చిన్న పిల్లల మెదడుపై ప్రభావం చూపుతుంది. తద్వారా రోగనిరోధక శక్తిని క్రమేణా తగ్గిస్తుంది. మెదడు వాపు వ్యాధి తీవ్రతపై తాజా నివేదికను హెల్పింగ్ హేండ్ ఫౌండేషన్ సంస్థ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డికి సమర్పించింది. వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను ఆ నివేదికలో వివరించింది. ప్రపంచ మెదడు వాపు దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న ప్రభుత్వం ఈ వ్యాధి నివారణకు తగిన పరిష్కారాలను వెల్లడించాలని మంత్రిని కోరింది. మెదడు వాపు వ్యాధి 5 నుంచి 10 ఏళ్లలోపు పిల్లలకు ఎక్కువగా సోకుతుందని, ఐదేళ్ల లోపు వారికి కూడా సోకే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల మానసిక లక్షణాలను పసిగట్టి ముందుగానే వైద్య పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవాలని ప్రముఖ వైద్యులు, దక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్‌స్ అధిపతి ప్రొఫెసర్ అత్త్ఫా నసీన్ తెలియజేస్తున్నారు. రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉన్న పిల్లల్లో ఈ తరహా వ్యాధులు చాలా తొందరగా సోకుతాయి. 2015లో ఒక్క నిలోఫర్ హాస్పిటల్‌లో ఆరోగ్య శ్రీ పథకం కింద నమోదైన కేసుల్లో 31 కేసులు మెదడు వాపు వ్యాధి ఉన్నట్లు ధృవీకరణ జరిగింది. మెదడును సిటీ స్కాన్ లేదా, ఎంఆర్‌ఐ చేయడం ద్వారా ఈ వ్యాధి తీవ్రతను గుర్తించ వచ్చని వైద్యులు చెబుతున్నారు. దీంతో మెదడు వాపు వ్యాధి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

సిరియాలో రక్తపుటేరులు
* కారు బాంబు దాడుల్లో 46 మంది మృతి
* 50 మంది ‘ఐసిస్’ ఉగ్రవాదులు హతం
బీరుట్, ఫిబ్రవరి 21: తిరుగుబాటుదారులు, ప్రభుత్వ బలగాలకు మధ్య దాడులు, ప్రతిదాడులతో రావణకాష్టంలా రగులుతున్న సిరియాలో మరోసారి రక్తపుటేరులు పారాయి. సిరియా నడిబొడ్డు నగరమైన హామ్స్ ఆదివారం శక్తివంతమైన రెండు కారు బాంబు దాడులతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో దాదాపు 46 మంది మృతిచెందారని, అనేక మంది గాయపడ్డారని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. మృతుల్లో ఎక్కువ మంది సామాన్య పౌరులే ఉన్నారని, క్షతగాత్రుల్లో చాలా మందికి తీవ్రగాయాలైనందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది. కాగా, ఈ కారు బాంబు దాడుల్లో దాదాపు 25 మంది మృతిచెందినట్లు హామ్స్ రాష్ట్ర గవర్నర్ తలాల్ బరాజీ ప్రకటించారని ప్రభుత్వ టెలివిజన్ చానల్ పేర్కొంది. ఇదిలావుంటే, తూర్పు ప్రాంత నగరమైన అలెప్పోలో గత 24 గంటల నుంచి ప్రభుత్వ బలగాలు నిర్వహించిన దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)కు చెందిన దాదాపు 50 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సిరియా మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.
కాళేశ్వరంలో పడవ మునక
బాలుడి దుర్మరణం
మహాదేవపూర్, ఫిబ్రవరి 21: కరీంనగర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద నిర్మిస్తున్న అంతర్ రాష్ట్ర వంతెన వద్ద ఆదివారం సాయంత్రం నాటు పడవ మునిగి, ఒక బాలుడు మరణించాడు. సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ కృష్ణారెడ్డి, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర వైపున ఉన్న ప్రయాణికుల కోరిక మేరకు కాళేశ్వరం వద్ద నున్న నాటుపడవ సిరోంచా గోదావరి తీరం వరకు వెళ్ళింది. అక్కడి నుంచి పడవలో 14 మంది ప్రయాణికులు ఎక్కారు. త్రివేణి సంగమ స్థానం వద్దకు వచ్చిన ప్రయాణికులు సమీపంలో గోదావరి నదిపైన నిర్మిస్తున్న అంతర్రాష్ట్ర వంతెన వద్దకు మళ్ళించాలని పడవ చోదకుడిని కోరడంతో బ్రిడ్జి వద్దకు తిప్పాడు. దాంతో నిండు గోదావరి నదీ పారకంలో ప్రయాణికులు ఒక్కసారిగా ఒకే వైపునకు రావడంతో పడవ అదుపు తప్పి అందులో ప్రయాణిస్తున్న 14 మంది నీటిలో మునిగారు. దీంతో గల్లంతైనవారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నాలు ప్రారంభించారు. మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు రంగంలోకి గజ ఈతగాళ్లు, స్థానిక ఈతగాళ్లను రప్పించారు. గల్లంతైన వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా, ఒకరు చనిపోయారు. మృతుడిని మహారాష్టల్రోని ఆదివారంపేటకు చెందిన రాజు (12)గా గుర్తించారు. ఇతని తల్లి సైతం నీటిలో కొట్టుకుపోతుండగా కాళేశ్వరంనకు చెందిన జాలర్లు రక్షించారు.

మేడారంలో భక్తుల కోసం శాశ్వత ఏర్పాట్లు
గిరిజన మంత్రి చందూలాల్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 21:ఏడాది పొడవునా మేడారాన్ని సందర్శించే భక్తుల కోసం శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలు కల్పించనున్నట్టు గిరిజనాభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. గిరిజన టూరిజంలో భాగంగా మేడారంతోపాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని రమణీయ ప్రాంతాలు, కాకతీయుల కాలం నాటి విశాలమైన, సుందరమైన చెరువులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. సమ్మక్క, సారలమ్మలకు ముఖ్యమంత్రి కెసిఆర్ తరఫున మొక్కును చెల్లించిన మంత్రి చందూలాల్ ఆదివారం ముఖ్యమంత్రికి ప్రసాదం అందజేశారు. జాతరను అద్భుతంగా నిర్వహించారని ముఖ్యమంత్రి అభినందించారు.

శాతవాహన, కాకతీయుల చారిత్రక, వారసత్వ సంపద కట్టడాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు చందూలాల్ తెలిపారు.
రెండేళ్ల తరువాత జరిగే మేడారం జాతరను జాతీయ పండుగగా జరుపుకుంటామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు చందూలాల్ తెలిపారు.

ఎప్పుడో
చెప్పలేను!
కాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై మహబూబా ముఫ్తి
ఆంధ్రభూమి పత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: జమ్మూకాశ్మీర్‌లో పిడిపి- బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఇప్పట్లో ఏర్పడే సూచనలు కనిపించటం లేదు. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందనేది చెప్పలేనని పిడిపి అధినాయకురాలు ఎంపి మహబూబా ముఫ్తి ఆదివారం చెప్పారు. ఎల్లుండి నుండి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆమె ఢిల్లీకి వస్తున్నారు. పార్లమెంటు సభ్యురాలిగా తన విధుల నిర్వహణ కోసం ఢిల్లీకి వెళుతున్నానని ఆమె చెప్పారు. జెఎన్‌యులో చోటు చేసుకున్న పరిణామాలపై ఆమె తొలిసారిగా మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు.

పార్లమెంటు దాడి కుట్ర కేసులో నిందితుడు అఫ్జల్ గురును ఉరితీయటాన్ని మొదటి నుండి వ్యతిరేకించిన మహబూబా ముఫ్తి జెఎన్‌యు పరిణామాలపై మామూలుగా మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. బిజెపితో తమ సంబంధాన్ని తుంచుకోవటం ఇష్టం లేనందుకే ఆమె జెఎన్‌యు పరిణామాలపై మెతక వైఖరి అవలంబించారని అంటున్నారు. మహబూబా ముఫ్తి తన ఢిల్లీ పర్యటన సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి.