రాష్ట్రీయం

దేశాన్ని దోచేశారు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: కేంద్రంలో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల మతతత్వ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి వామపక్ష, ప్రజాతంత్ర, ప్రజాసంఘాలన్నీ సంఘటితం కావాలని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయో సర్కార్ వల్ల ఏమైనా జరిగిందా? అంటే ఆర్థిక దోపిడి మరింత పెరగడం తప్ప మరేమి లేదన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ధరలు, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు మరింతగా పెరిగిపోయాయన్నారు. మతతత్వ శక్తుల ఆగడాలు పెచ్చరిల్లిపోయాయని, దళితులు, మహిళలకు
రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ దేశాన్ని మతోన్మాద రాజకీయాల నుంచి విముక్తి చేయడానికి ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీపీఎం 22వ జాతీయ మహాసభలు ఆదివారం హైదరాబాద్‌లో ముగిసిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీతారామ్ ఏచూరి ప్రసంగించారు. మోదీ హయాంలో దేశాన్ని లూటీ చేసి పారిపోతున్న మోదీలే ఉన్నారని సీతారామ్ ఏచూరి ఎద్దేవా చేసారు. రైతులకు రుణ మాఫీని చేయలేకపోయారు కానీ, బడా పెట్టుబడిదారులకు రూ. 3 లక్షల కోట్లను మాఫీ చేశారని ఏచూరి దుయ్యబట్టారు. రామాయణం పేరు చెప్పి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చాక మహాభారతాన్ని నడిపిస్తున్నారని, ఇందులో మోదీ, అమిత్‌షా దుర్యోధనుడు, దుష్యాసనుడి పాత్రలు పోషిస్తున్నారని ఏచూరి అన్నారు. ‘మీరు కౌరవులు అయితే, మేము పాండవులం.మిమ్మల్ని గద్దే దింపడమే లక్ష్యంగా పని’చేస్తామన్నారు. లాల్, నీల్ జెండాల కిందనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీజేపీల కూటమీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్న తృతీయ ఫ్రంట్‌తో కలిసి పని చేయాల్సిందిగా కేసీఆర్ తనను కోరారని, అయితే అధికారం కోసం అయితే తృతీయ ఫ్రంట్ అవసరం లేదన్నారు. ఆ ఫ్రంట్ విధానాలు ఏమిటో తెలిశాక, కలిసి పని చేసేది, లేనిది నిర్ణయిస్తామన్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ, సరళీకృత విధానం కాంగ్రెస్ హయాంలో మొదలైతే బీజేపీ హయాంలో మరింత విస్తరించిందన్నారు. దేశంలో సామ్రాజ్యవాదం బలంగా పని చేస్తోందని, ప్రజాస్వామిక, లౌకిక శక్తులను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. దీనిని అడ్డుకునేందుకు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకం కావాలన్నారు. రైతుల ఆత్మహత్యలను ఆపడానికి కేరళలో తమ ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా మరింత సమకూర్చి ఆదుకుంటున్నామన్నారు. రైతులకు, మహిళలకు, వృద్ధుల కోసం తమ రాష్ట్రం అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్ర కూడా ప్రశంసిందన్నారు.
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ మాట్లాడుతూ ‘మోదీకో హటావో-దేశ్‌కో బచావో’ అని పిలుపునిచ్చారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు గోరక్షక్ నుంచి రేపిస్ట్ రక్షక్‌గా మారారని ధ్వజమెత్తారు.ఏన్డీయే హయాంలో దేశంలో దళితులు,మహిళలు, మైనార్టీలు,పేదలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మక్కా మసీదు పేలుళ్ల నిందితులను బీజేపీ సర్కార్ వదిలేసిందన్నారు. ఇక్కడ దళిత విద్యార్థి రోహిత్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడమే కాకుండా, అసలు అతను దళితుడే కాదని తేల్చిసిందన్నారు. ఎస్సీ,ఎస్టీల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. కాశ్మీర్‌లోని కతువాలో పసిపిల్లపై సాముహిక అత్యాచారం చేసిన నిందితులకు అండగా నిలిచిన చరిత్ర బీజేపీదన్నారు. ప్రజాకంటక, రాజరిక పాలనకు వ్యతిరేకంగా తిరగబడి సాయుధ పోరాటం చేసిన ఘనమైన చరిత్ర తెలంగాణదన్నారు. అదే స్ఫూర్తితో మతతత్వ బీజేపీ సర్కార్‌ను గద్దె దింపే పోరాటం కూడా ఇదే గడ్డ నుంచి ప్రారంభం కావాలని బృందా కారత్ పిలుపునిచ్చారు.
చిత్రం..జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా
ఐక్యతను ప్రదర్శిస్తున్న సీపీఎం నేతలు ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరి ప్రభృతులు