రాష్ట్రీయం

రజనీ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ విజయవాడ, ఏప్రిల్ 22: ప్రముఖ రచయిత, గాయకుడు, సంగీత విద్వాంసుడు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం మాజీ డైరెక్టర్ బాలాంత్రపు రజనీకాంతరావు (98) ఆదివారం తెల్లవారు జామున 5.30కు విజయవాడలో కన్నుమూశారు. రజనీకాంతరావుకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రజనీకాంతరావు అంత్యక్రియలు సోమవారం ఉదయం 10.30కు విజయవాడలోని ‘స్వర్గపురి’లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1920 జనవరి 29న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించిన రజనీ, ‘కవి రాజహంస’ బాలాంత్రపు వెంకటరావు కుమారుడు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, కాకినాడలలో పాఠశాల విద్యపూర్తి చేసిన రజనీ, ఆంధ్రా వర్శిటీ నుండి 1940లో బీఏ (హానర్స్) తెలుగు, సంస్కృతం ప్రధాన సబ్జెక్టులుగా పట్టా తీసుకున్నారు. 1941లో ఆకాశవాణి మద్రాస్ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా చేరిన రాజనీకాంతరావు, 36ఏళ్లపాటు వివిధ హోదాల్లో ఆకాశవాణికి సేవలు అందించారు. ఆకాశవాణి అహమ్మదాబాద్, బెంగళూరు, విజయవాడలలో స్టేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1947 ఆగస్టు 15 అర్థరాత్రి దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తర్వాత రజనీకాంతరావు రాసి, బాణీ సమకూర్చి, స్వయంగా పాడిన ‘మోగించు జయభేరీ- వాయించు నగారా’ దేశభక్తి గేయం ఆకాశవాణి మద్రాస్ కేంద్రం నుండి ప్రసారమై అందరి ప్రశంసలు అందుకుంది. స్వాతంత్య్రం సిద్ధించిన తొలిఏడాది ఆకాశవాణిలో ఆయన రాసిన ‘మాది స్వతంత్రదేశం- మాదీ స్వతంత్ర జాతి’ పాట ప్రసారమైంది. టంగుటూరి సూర్యకుమారి పాడిన ఈ పాట అందరి మన్ననలు అందుకుంది. రోజూ ఆకాశవాణిలో ఉదయం 6.10 గంటలకు ప్రసారమయ్యే ‘్భక్తిరంజని’ కార్యక్రమం సృష్టించింది రాజనీకాంతరావే. ఆకాశవాణిలో శ్రోతల ప్రశంసలు పొందిన ‘్ధర్మసందేహాలు’ పేరిట రూపొందించిన కార్యక్రమం కూడా రజనీకాంతరావు సృష్టించిందే. రేడియోలో విస్తృత ప్రచారం పొందిన సూర్యస్తుతి ‘శ్రీసూర్యనారాయణ- వేద పారాయణ’ రజనీ రాసిందే. ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర, విశ్వవీణ, శతపత్ర సుందరి, ఏకాంతసేవ (టిటిడి), క్షేత్రయ్య, రామదాసు, జేజిమామయ్య పాటలు, మువ్వగోపాల పదావళి, త్యాగరాజు, ఏటికి ఎదురీత తదితర పుస్తకాలను రజనీకాంతరావు రాశారు. స్వర్గసీమ, గృహప్రవేశం తదితర అనేక సినిమా పాటలకు బాణీ సమకూర్చారు. రజనీ చదువుకున్న ఆంధ్ర వర్శిటీనుంచి గౌరవ డాక్టరేట్, ‘కళాప్రపూర్ణ’ 1981లో పొందారు. సంగీత, నాటక అకాడమీ, సాహిత్య అకాడమీల నుండి అవార్డులు అందుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రభుత్వం ఇటీవలే ఆయనకు విశిష్ట పురస్కారం అందచేసింది. సమైక్య ఏపీ ప్రభుత్వం 2007లో కళారత్న అవార్డును అందచేసింది. 1961లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇవికాకుండా అనేక సంస్థలు రజనీ కళాసేవకు అవార్డులు ప్రకటించి సత్కరించుకున్నాయ.
స్వరమే రజనీ శ్వాస: బాబు
సప్తస్వరాలను శ్వాసించి, ధ్యానించిన రజనీకాంతరావు సంగీత రుషి అని సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఆకాశవాణికి సిగ్నేచర్ ట్యూన్ సమకూర్చి రేడియోనే చిరునామాగా మార్చుకున్నారన్నారు. ఆయన స్వరాల్లో దేశభక్తి ప్రవహించిందని, స్వాతంత్య్రోద్యమ కాలంలో రజనీ స్వరపరచిన గీతాలు ప్రజల్లో అణువణువూ దేశభక్తి నింపాయన్నారు. బాలాంత్రపు కలం నుంచి జాలువారిన గేయాలు ప్రేక్షక హృదయ నాదాలుగా మోగాయన్నారు. దిగ్గజాలు ఒక్కొక్కరూ కనుమరుగవుతున్నారని, వివిధ రంగాల్లో విశిష్టులైన ఒక బాలాంత్రపు, ఒక మంగళంపల్లి, ఒక వేటూరి మళ్లీ జన్మించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కాగా లలిత సంగీత దిగ్గజం బాలాంత్రపు రజనీకాంతరావు పార్ధీవ దేహానికి విజయవాడలో సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఈమేరకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.