రాష్ట్రీయం

ప్రతి విజయం వెనుకా మహిళామూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: ప్రతి వ్యక్తి సాధించే విజయం వెనకా తప్పకుండా మహిళా మూర్తి ఉంటుందని, తన విజయం వెనకా తన తల్లి, సతీమణి ఉన్నారని రాజ్యసభ సభ్యుడు టీ.సుబ్బరామి రెడ్డి అన్నారు. ట్యూటర్స్ ప్రైడ్ ఆధ్వర్యంలో విద్య, కళా, సాంస్కృతిక, క్రీడా, సేవా తదితర రంగాల్లో అత్యుత్తమైన సేవలందించిన వంద మంది మహిళలకు లేడీ లెజెండ్ అవార్డుల ప్రదానోత్సవ సభ ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్క్ హోటల్‌లో జరిగింది. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీఎస్‌ఆర్ మాట్లాడుతూ ఇరవై ఏళ్ల తన రాజకీయ జీవితంలో కేంద్ర మంత్రి వంటి ఎన్నో ఉన్నతమైన పదవులను చేపట్టి, రాజకీయ, సినీ రంగాల్లో సాధించిన ఎన్నో విజయాల వెనక తన మాతృమూర్తి, ఇపుడు తన సతీమణి ఉన్నారని స్పష్టం చేశారు. పలు రంగాల్లో నేడు మహిళలు సమాజానికి మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని వివరించారు. సమాజానికి మరింత సేవలందించే విధంగా వారిని ఎప్పటికపుడు గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు. మహిళలను సత్కరించుకునేందుకు ఇలాంటి వేదికలు ఇంకా ముందుకు రావాల్సిన అవసరముందని సూచించారు. మహారాష్ట్ర పోలీస్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలను గుర్తించి, సన్మానించుకోవటం అభినందనీయమని అన్నారు. సంపూర్ణమైన, సేవా ధృక్పతం కలిగిన వ్యక్తిత్వానికి చాలా విషయాలపై అవగాహన ఉంటుందని, ఇలాంటి వారే దేశానికి ఎంతో ముఖ్యమని సూచించారు. మహిళలను సత్కరించుకునే ఇలాంటి కార్యక్రమాలను మున్ముందు మరిన్ని నిర్వహించాలని కార్యక్రమ నిర్వాహకులు డా. బీఆర్ అంకెం, రామానుజను అభినందించారు. టీఆర్‌ఎస్ నాయకురాలు గుండు సుధారాణి మాట్లాడుతూ వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న వంద మందిని గుర్తించి, సత్కరించడం సాహసోపేత చర్య అని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందాలని, ఓ రాజకీయ నాయకురాలిగా తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పురస్కారాన్ని టీవీ యాంకర్లు, బుల్లితెర నటులు, సామాజిక కార్యకర్తలు, రచయితలతోపాటు ఆంధ్రభూమి వార, మాసపత్రికల అసిస్టెంట్ ఎడిటర్ ఏఎస్ లక్ష్మి స్వీకరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి ప్రకాశ్, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, దేవ్‌నార్ ఫౌండేషన్‌కు చెందిన డా. సాయిబాబా గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా డా.అంకెం రచించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు.

చిత్రం..లేడీ లెజెండ్ పురస్కారాన్ని స్వీకరిస్తున్న ఆంధ్రభూమి వార, మాస పత్రికల అసిస్టెంట్ ఎడిటర్ ఏఎస్ లక్ష్మి