రాష్ట్రీయం

65ఏళ్లు పైబడ్డ అర్చకులకు విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 16: కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి కొలువులో అర్చకులుగా పనిచేస్తూ 65 సంవత్సరాలు పైబడిన వారికి విశ్రాంతి ఇవ్వాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించినట్లు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన టీటీడీ పాలకమండలి తొలి సమావేశం బుధవారం పుట్టాసుధాకర్ యాదవ్ అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో జరిగింది. తొలి సమావేశంలో పాలనాపరమైన అంశాలపై సమావేశం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ముఖ్యంగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మంగళవారం చెన్నయ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి శ్రీవారి కైంకర్యాల నిర్వహణ, వీఐపీలకు ఇస్తున్న ప్రాధాన్యత, పురాతన ఆలయమైన శ్రీవారి ఆలయంలో కట్టడాలకు జరుగుతున్న నష్టం, స్వామివారి కైంకర్యాలు నిర్వహించే అర్చకుల పట్ల టీటీడీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా, శ్రీవారి ఆలయాన్ని భక్తులు కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. బుధవారం బోర్డు సమావేశం జరుగుతుందని తెలిసీ రమణ దీక్షితులు చెన్నయ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. వాస్తవానికి తొలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఆసక్తి సగటు ఉద్యోగులు, శ్రీవారి భక్తులు నిరీక్షించారు. అందుకు ప్రధాన కారణం ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తిరుమలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, అందుతున్న తీరుతెన్నులు, పరిశుభ్రత వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీంతో భక్తులకు అనుకూలమైన నిర్ణయాలు రావచ్చని అందరూ భావించారు. అయితే ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల విమర్శలపై సమావేశం లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అర్చకుల ఉద్యోగ విరమణ పట్ల అజెండాలో లేకపోయినా సమావేశం ఆ అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకోవడం గమనార్హం.
సమావేశానంతరం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ శ్రీవారి కైంకర్యాలు నిర్వహించే అర్చకుల ఉద్యోగ విరమణకు వయోపరిమితిని 65 ఏళ్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రమణ దీక్షితులు కూడా ఉద్యోగ విరమణ చేస్తారా? అన్న విలేఖరుల ప్రశ్నకు ఈ ఓ సింఘాల్ స్పందిస్తూ అర్చకుల్లో 65 సంవత్సరాలు పైబడిన వారు ఎవరికైనా ఈ నిబంధన వర్తిస్తుంది కదా అని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించడంతో మిరాశీ అర్చకులుగా ఉండి నేడు టీటీడీ అర్చకులుగా పనిచేస్తున్న దీక్షితుల వంశానికి చెందిన రమణ దీక్షితులతోపాటు శ్రీనివాసులు దీక్షితులు, నారాయణ దీక్షితులు కూడా ఉద్యోగ విరమణ పొందాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉండి టీటీడీ అంశాలపై మీడియాముందుకు వచ్చిన రమణ దీక్షితుల వివరణ కోరాలని కూడా సమావేశం నిర్ణయించిందన్నారు. శ్రీవారి భక్తుల ద్వారా టీటీడీకి సమకూరుతున్న నిధులను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి సబ్‌కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సలహామండలి ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నామన్నారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ పరిధిలోవున్న కోదండరామ స్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఏడాది కాలం టీటీడీకి ధర్మకర్తల మండలి లేకపోవడంతో అధికారులు ఆలయ, భక్తుల సౌకర్యాలకోసం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆమోదముద్ర వేశామన్నారు. జూన్ 5వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈసమావేశంలో బోర్డు సభ్యులు జి ఎస్ ఎస్ శివాజీ, బోండా ఉమామహేశ్వరరావు, బికే పార్థసారథి, రాయపాటి సాంబశివరావు, చల్లా రామచంద్రారెడ్డి, పొట్లూరి రమేష్ బాబు, ఈ.పెద్దిరెడ్డి, సండ్రవెంకటవీరయ్య, సుధా నారాయణ మూర్తి, సప్న, రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణా రెడ్డి, డొక్క జగన్నాధం, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వై.వి.అనురాధ, ప్రత్యేక ఆహ్వానితులు అశోక్ రెడ్డి, శ్రీకృష్ణ, తిరుమల జే ఈ ఓ శ్రీనివాసరాజు, తిరుపతి జే ఈ ఓ పోలభాస్కర్‌లు పాల్గొన్నారు.