ఆంధ్రప్రదేశ్‌

వైకాపాకు మరో షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప/ గుంటూరు: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో కూరుకుపోతోంది. రెండురోజుల క్రితం సిఎం చంద్రబాబు సమక్షంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరగా, తాజాగా బుధవారం బద్వేలు ఎమ్మెల్యే జయరాములు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వీరితోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం అధిష్టానంతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
దీంతో ఏం జరుగుతుందో అర్థంగాక జగన్ శిబిరంలో అయోమయం నెలకొంది. సొంత జిల్లాలో పరిస్థితి అదుపుతప్పడంతో ఢిల్లీలో ఉన్న జగన్ హుటాహుటిన బుధవారం రాత్రి కడపకు చేరుకున్నారు. ఉదయమే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లాకు వచ్చి పార్టీలోకి వచ్చేందుకు సంకేతాలిస్తున్న వైకాపా ఎమ్మెల్యేల విషయమై పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరుపుతూ బిజీబిజీగా ఉండగా, జగన్ ఆఘమేఘాలపై ఢిల్లీనుంచి బయలుదేరి రాత్రి పొద్దుపోయాక కడప చేరుకుని తాజా పరిస్థితిపై అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. ఇదిలావుంటే, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని సిఎం అధికార నివాసంలో జయరాములు మర్యాదపూర్వకంగా బాబును కలిశారు. సిఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తదితర పార్టీ నేతలు ఆయనకు పసుపు కండువా కప్పి ఆహ్వానించారు. జయరాములు జంప్‌తో వైసిపిని వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 5కు చేరింది. ఈసందర్భంగా జయరాములు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధికి సిఎం చంద్రబాబు కృషిచేస్తానని హామీ ఇవ్వడంతో ఆయనపై విశ్వాసంతో తెలుగుదేశంలో చేరుతున్నట్లు తెలిపారు.
గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఒక సీనియర్ ఎమ్మెల్యే, జిల్లా సరిహద్దుల్లో వైకాపాకు చెందిన మరో శాసనసభ్యుడు, కడప పార్లమెంటు పరిధిలోని మరో యువ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇప్పటికే సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 2014 సార్వత్రిక ఎన్నికల్లో 9 అసెంబ్లీ స్థానాలను వైకాపా కైవశం చేసుకుంది. కేవలం రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే టిడిపి గెల్చుకుంది. తాజాగా వైకాపా నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలతో కలుపుకుంటే టిడిపి మద్దతుదారుల సంఖ్య ప్రస్తుతానికి మూడుకు చేరుకుంది. రేపో మాపో మరో ఇద్దరు కానీ ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరితే కడపజిల్లాలో వైకాపా మైనార్టీలో పడే అవకాశముంది. బుధవారం టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రధమ, ద్వితీయ శ్రేణి వైకాపా నేతలు, స్థానిక సంస్థల్లో గెలుపొందిన నేతలు, కడప డిప్యూటీ మేయర్ మేయర్ బి.ఆరిఫుల్లాతోపాటు ఇద్దరు కార్పొరేటర్లు, వెయ్యిమందికి పైబడి వైకాపా కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. పార్టీలో చేరిన నేతలంతా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే రాజంపేట కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి ఏ.సాయిప్రతాప్, మరో కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత , రాష్ట్ర మాజీ మంత్రి ఎస్‌ఎండి అహ్మదుల్లా, మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా సైకిలెక్కేందుకు మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. సామాజికవర్గాల వారీగా ఆయా నేతలతో సంప్రదింపులుచేసి పార్టీలోకి తీసుకురావడానికి చర్యలు ఊపందుకున్నాయి. మొత్తమీద తాజా పరిణామాలు వైకాపా అధినేత జగన్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. టిడిపి యువనేత లోకేష్ గురువారం కూడా జిల్లాలోనే మకాం వేసి ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా వైకాపా నుంచి సాధ్యమైనంత ఎక్కువమందిని టిడిపిలోకి రప్పించేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

చిత్రం... తెలుగుదేశం పార్టీలోకి వైసిపి ఎమ్మెల్యే జయరాములును కండువా కప్పి ఆహ్వానిస్తున్న సిఎం చంద్రబాబు