ఆంధ్రప్రదేశ్‌

రమణదీక్షితులు తప్పు చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 20: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి పట్ల ప్రపంచ వ్యాప్తంగా భక్తుల్లో అపార భక్తి విశ్వాసం ఉందని, ఆగమోక్తంగానే స్వామివారి ఆలయంలో కైంకర్యాలు జరుగుతున్నా జరగడం లేదని మాజీ ప్రధానార్చకులు డాక్టర్ రమణదీక్షితులు వ్యాఖ్యలు చేసి తప్పు చేశారని ప్రధానార్చకులు, సంభావన అర్చకులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. రమణదీక్షితులు టీటీడీ అధికారులపైన, కైంకర్యాలపైన విమర్శలు చేసిన నేపధ్యంలో ఇటు అధికారులు, అటు అర్చక, సంభావనార్చకులు ముక్తకంఠంతో ముప్పేట దాడి చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం అర్చక నిలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పైడిపల్లి వంశానికి చెందిన కృష్ణశేషాచల దీక్షితులు మాట్లాడుతూ గత వారం రోజులుగా శ్రీవారి ఆలయం, కైంకర్యాలపైన పలు రకాల ఆరోపణలు వింటున్నామని, ఇది మనసుకు ఎంతో బాధ కలిగిస్తోందన్నారు. నైవేద్యాలు, కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయని, సేవల్లో మార్పులు చేసే నిర్ణయం అందరూ కలసికట్టుగా తీసుకునే నిర్ణయమన్నారు. రెండవ ప్రాకారంలోనే నైవేద్యం నిర్వహించే ఆనవాయితీ గత ఎన్నో సంవత్సరాలుగా అనుసరిస్తున్నదేనన్నారు. ఇక పోటు (వంటశాల)లో ఎన్నో అగ్నిప్రమాదాలు జరిగాయని, ఆగమ సలహాలదారుల సలహాలతోనే టీటీడీ మరమ్మతులు చేపట్టిందన్నారు.
ఇక గొల్లపల్లి వంశానికి చెంది ప్రస్తుతం ఆలయ ప్రధానార్చకులుగా నియమితులైన వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ రమణదీక్షితుల కుమారులను విధుల నుండి తప్పించారని చెప్పడం అవాస్తవమన్నారు. ఇక 2001లో రెండు పోట్లు జీర్ణోద్ధరణ చేసి రెండు వంటశాలల్లో ప్రసాదాలు చేయవచ్చునని తీసుకున్న నిర్ణయం ప్రకారమే అన్నప్రసాదాలు చేస్తున్నారన్నారు. ఇక చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధానార్చకులు సౌందరరాజన్‌కు ఏం సంబంధం ఉందని శ్రీవారి ఆలయం గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్రేయబాబు ఒక న్యాయవాది అని ఆయన రమణదీక్షితులను ఎందుకు సమర్థిస్తున్నారన్నారు. సాక్షాత్త్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలోనే కంకణభట్టార్ వస్త్రాన్ని లాక్కున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అప్పుడు ఎందుకు ఎవరూ రమణదీక్షితులను తప్పు పట్టలేదని ప్రశ్నించారు. అప్పుడు కూడా ఆయన్ను ఆలయం నుండి వెలుపలకు పంపలేదు కదా? అన్నారు. ఆయన యథావిధిగా వచ్చి కైంకర్యాలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు కూడా రమణదీక్షితులు విధుల నుండి విశ్రాంతి పొందినా పర్యవేక్షణ చేయవచ్చునన్నారు. 2013 నుండి కోర్టులో కేసులు వేసి వాటి చుట్టూ తిరుగుతున్నారన్నారు. తిరగాల్సిన అవసరం ఏముందని తాను అడిగానన్నారు. మంచిని నేర్పిస్తే తాము నేర్చుకుంటామని, చెడును ఎలా సమర్థిస్తామన్నారు. వాస్తవానికి గొల్లపల్లి వంశంలో రమణదీక్షితులు ఒక దత్తపుత్రుడేనన్నారు. స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించే సమయంలో ఉచ్ఛరించే మంత్రాలను ఆయన చెప్పగలరా? అని రమణదీక్షితులను ప్రశ్నించారు. వారి కుమారుడు అభిషేకం రోజున మాత్రమే విధులకు వస్తారని, తక్కిన రోజుల్లో స్వామివారి కైంకర్యాల్లో పాల్గొన్న దాఖలాలు లేవన్నారు. స్వామివారికి నామాలను తప్పుగా పెట్టింది రమణదీక్షితులేనన్నారు. ఇప్పుడు ప్రభుత్వం, టీటీడీ తీసుకున్న నిర్ణయంతో మూడవ తరానికి అవకాశం వచ్చిందన్నారు. బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాలు ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్చకులు నుదుటి నుండి శరీరంపై 12 నామాలు పెట్టుకోవాలన్నారు. రమణదీక్షితులు ఏనాడూ 12 నామాలు పెట్టలేదన్నారు. 12 నామాలు పెట్టకపోతే కైంకర్యాలు చేయరాదని నిబంధన అన్నారు. 25 సంవత్సరాలు రమణదీక్షితులు ఆధ్వర్యంలో స్వామివారి కైంకర్యాలు నడిచాయన్నారు. కార్తి నరసింహదీక్షితులు మాట్లాడుతూ రమణదీక్షితుల ఉద్యోగ విరమణపై వివాదాలు రావడం అర్థరహితమన్నారు. 32 మంది కైంకర్యపరులు ఉన్నామన్నారు. తమకు కైంకర్యం చేసే అవకాశం అందించడం కోసమే 65 సంవత్సరాల వయోపరిమితి చేయాలని తామే ముఖ్యమంత్రిని కోరామన్నారు. మిరాశీ అర్చకుల తరహాలోనే తమకు కూడా సౌకర్యాలు కల్పించాలని కోరామన్నారు. రిటైర్‌మెంట్ అర్చకులకు అవసరమన్నారు. తద్వారా కొత్తతరం వారికి అవకాశం వస్తుందన్నారు. ఇప్పుడు ఆయనకు విరమణ ఇచ్చినప్పటికీ వారి వంశం వారికే అవకాశం ఇచ్చారు కదా? అన్నారు. అలాగే కైంకర్యపరుల పిల్లలకు అవకాశం ఇవ్వాలని తాము కోరుతున్నామన్నారు.
రాయలవారి నగలు ఎక్కడా నమోదు కాలేదు. మైసూర్, గద్వాల్, వెంకటగిరి రాజులు ఇచ్చిన నగలు గురించి వివరాలు ఉన్నాయని, రమణదీక్షితులు నగలు తిరిగి ఇచ్చినప్పుడు కూడా నగల ప్రస్తావన లేదన్నారు. వారి కుమారుల గైర్హాజరు ప్రశ్నించినందుకే నేడు ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అర్చకులను రమణదీక్షితులు అతిహీనంగా చూస్తారన్నారు. తమకు అన్యాయం జరిగినపుడు బ్రాహ్మణసంఘాలు, అర్చక సంఘాలు నోరు మెదపలేదన్నారు. ఇప్పుడు మాట్లాడడం సరికాదన్నారు. సీనియర్ అర్చకులు ఖాద్రిపతి స్వామి మాట్లాడుతూ 32 మంది కైంకర్యపరుల సర్వీసులను క్రమబద్ధీకరించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మిరాశికాలంలో రమణదీక్షితులు 8 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కైంకర్యాలు నిర్వహించేవారన్నారు. 2001లో వజ్రం పోతే 2018 వరకు రమణదీక్షితులు ఎందుకు ఆ విషయాన్ని బయటపెట్టలేదన్నారు. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేయడం బాధ కలిగిస్తోందన్నారు.
తప్పిదాలను ప్రశ్నించినందుకే..
శ్రీవారి ఆలయంలో జరుగుతున్న తప్పిదాలను ప్రశ్నించినందుకే తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రమణ దీక్షితులుఆరోపించారు. ఆదివారం విలేఖర్ల సమావేశంలోనూ, ఛానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మాట్లాడుతూ అక్కడ జరుగుతున్న పొరపాట్లు వెలుగు చూడాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. కాగా రానున్న కాలంలో టీటీడీలో వ్యవహారాలు ఏ స్థాయికి వెళతాయోనన్నది సగటు భక్తుడు ఆందోళన చెందుతున్నాడు. మరికొంతమంది ఈ అంశాన్ని రాజకీయం చేయడం కూడా భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా ఈ వ్యవహారాలకు సంబంధించి అంతిమతీర్పుకు వెంకన్న ఎప్పుడు మార్గం సుగమం చేస్తారో, ఎలాంటి మార్గనిర్దేశం చేస్తారో వేచి చూడాల్సిందే.