రాష్ట్రీయం

నాలుగేళ్లయినా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లయినా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో విభజన సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు. రెండు రాష్ట్రాలు ప్రత్యేక ఆర్టీసీలను ఏర్పాటు చేసుకుని ఎవరి పాలన వారు నిర్వహించుకుంటున్నా విభజనతో ఏర్పడ్డ సమస్యలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. ఆస్తుల పంపకం అంశం కేంద్రం ప రిధిలోని షీలాబేడీ కమిటీ పర్యవేక్షిస్తుండడం వల్ల రెండు రాష్ట్రాలు ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎలాగు ఆస్తులన్నీ తెలంగాణలోనూ, హైదరాబాద్ నగరంలోనూ ఉన్నందున మనకొచ్చే నష్టం ఏమీలేదని టిఎస్‌ఆర్టీసి భావిస్తుంటే, ఆస్తుల్లో 58 శాతం ఎపిఎస్‌ఆర్టీసికి కేటాయించాలని ఎపి పట్టుబడుతోంది. ఈ పరిస్థితి గత నాలుగేళ్ల నుంచి కొనసాగుతున్నా ఏమాత్రం ముగింపునకు రాలేదు. గత ఏడాది ఒకసారి విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీల ఉన్నతాధికారులు సమావేశమై పలు అంశాలపై విస్తత్రంగా చర్చించినా ఏకాభిప్రాయం రాలేదు. ఆ తర్వాత మళ్లీ అదే పరిస్థితి. 14 ఉమ్మడి ఆస్తుల్లో ఏపీ తమ వంతు వాటాగా 58 శాతం విభజన చట్టాన్ని అనుసరించి ఇవ్వాలని కోరింది. అప్పటి ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య ఈ మేరకు టీఎస్ ఆర్టీసీకి ప్రతిపాదించారు. అయితే టీఎస్ ఆర్టీసీ అధికారులు తిరస్కరించారు. అప్పటి సమావేశ వివరాలను కేంద్రం నియమించిన షీలా బేడీ కమిటీకి నివేదించారు. ఆ కమిటీ తదుపరి చర్యలు చేపట్టకపోవడంతో ఆ సమస్యలన్నీ ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. ఆస్తుల పంపంకం అంశం ఒక్కటి తప్ప మిగిలిన పెద్దగా జఠిల సమస్యలు లేవని, షీలా బేడీ కమిటీ త్వరలోనే పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. కాగా నగర నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ బస్ భవన్‌లో ఏపీఎస్ ఆర్టీసి సగభాగం సంస్థను నడుపుకునేందుకు అవకాశం ఇచ్చి ఏ-బ్లాక్‌ను కేటాయించారు. అనుకున్న దానికంటే ముందుగానే ఏపిఎస్ ఆర్టీసీ తన కార్యకలాపాలను విజయవాడకు మార్చుకోవడంతో బస్‌భవన్ ఏ బ్లాక్ ఖాళీగానే ఉంది. బస్‌భవన్ నిర్వహణకు వెచ్చిస్తున్న మొత్తంలో సగభాగం ఏపీఎస్ ఆర్టీసీ భరిస్తోంది. దాదాపు 8 నుంచి 9 లక్షల వరకు ప్రతి నెల ఖర్చు భరిస్తోంది. అయితే ఖాళీగా ఉంచుకునే కన్నా బస్‌భవన్‌లో ఏ బ్లాక్‌ను ఏపీఎస్ ఆర్టీసీ తమకు అప్పగిస్తే దానిని ఇతర ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చని టీఎస్ ఆర్టీసీ భావిస్తోంది. ఇప్పటికే పేరుకుపోయిన టీఎస్ ఆర్టీసీ నష్టాలు రెండు వేల కోట్ల నుంచి ఉపశమనం పొందేందుకు ఏపీఎస్ ఆర్టీసీ తిరిగి అప్పగిం చే బ్లాక్‌ను వాణిజ్యపరమైన అవసరాలకు ఇతరులకు ఇస్తే ఆదాయం వస్తుందని భావిస్తోంది. ఇందుకు ఏపీఎస్ ఆర్టీసీ సరిగ్గా స్పందించకపోవడంతో ఆ సమస్య కూడా అక్కడే ఆగిపోయింది. ఇక ఆర్టీసీలు రెండు వేర్వేరుగా పని చేస్తు న్నా బోర్డు ఇంతవరకు విడిపోలేదు. కేంద్ర చట్టం ప్రకారం పని చేసే రెండు రవాణా సంస్థలు ఆ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కానీ ఆస్తుల పంపకం అంశం తేలే వరకు ఈ ప్రక్రియ ముందుకు సాగేటట్లు లేదు. షీలా బేడీ కమిటీ కోర్టులోనే ఆర్టీసీ బంతి ఉన్నందున ఆ కమిటీ తీసుకునే చర్యలను బట్టి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి సురేంద్రబాబు టీఎస్ ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావుతో హైదరాబాద్ బస్ భవన్‌లో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఆర్టీసి రెండు సంస్థలుగా పని చేస్తున్నా కొన్ని చిక్కుముళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లో అంతర్‌రాష్ట్ర సర్వీసులకు సంబంధిన అంశాలపై చర్చించుకున్నారు. సాంకేతికంగా ఉన్న ఇబ్బందులను పరిష్కరించుకుని అంతర్‌రాష్ట్ర సర్వీసులను నడుపుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరువురు ఎండిలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రధాన ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో టికెట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయడం, రెండు ఆర్టీసీల నుంచి ఇటు ఏపీకి, అటు తెలంగాణకు వస్తున్న బస్ డ్రైవర్లకు విశ్రాంతి గదుల ఏర్పాటు, సౌకర్యాలు వంటి చిన్న చిన్న అంశాలను తక్షణమే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఆయా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు (ఈడీ)ల స్థ్ధాయిలో కమిటీలను నియమించుకుని పరస్పరం చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకునేందుకు ఇరువురు ఎండీలు చర్చించుకున్నారు. దీంతో ఇకనైనా విభజన కష్టాల నుంచి ఆర్టీసీలు గట్టెక్కాలని కోరుతున్నారు.