రాష్ట్రీయం

సంక్షోభంలో ఆర్టీసీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) సంక్షోభం దిశగా పయనిస్తోందా? రోజురోజుకీ నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం చాలావరకు అందినా ఏమాత్రం ఉపశమనం పొందలేకపోయింది. దీంతో తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం రానున్న రోజుల్లో ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు కార్మిక సంఘాలూ ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీని మూసివేసి ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పగించేందుకు రంగం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల్లోని ఆర్టీసీ సంస్థల్లో అమలు చేస్తున్న వేతన భత్యాలు, సౌకర్యాలు అక్కడ ఉన్న ఆర్టీసీ పరిస్థితులన్నింటికి సంబంధించిన నివేదికను ప్రభుత్వం సేకరించుకుంది. కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రాన్ని బ్లాకులుగా, కొన్నిచోట్ల రూట్ల ఆధారంగా బస్సుల నిర్వహణ, సాంకేతికపరమైన బాధ్యతలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పగించడం ద్వారా ఆయా ప్రభుత్వాలపై ఆర్ధిక భారం తగ్గించుకోవడం, ఇతర తలనొప్పులు లేవని తెలంగాణ ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. టీఎస్‌ఆర్టీసీకి రుణభారం 2600 కోట్లకుపైగా ఉంటే నిర్వహణ నష్టాలు దాదాపు 750 కోట్ల వరకూ ఉందని ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కలను బట్టి తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మిగిలిన రాష్ట్రాల బాటలో తెలంగాణ కూడా అనుసరించే వ్యూహం అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే తాజాగా ఆర్టీసి కార్మికుల సమ్మె అంశంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు కార్మిక సంఘాల్లో దుమారం రేపుతున్నాయి. ‘ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాం. ఆర్టీసీకి ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా భారీగా నిధులిచ్చి ఆదుకున్నాం. అయినా ఇంకా డిమాండ్లంటే ఏం చేయాలి? సమ్మె చేస్తే ఏమవుతుంది? నష్టపోయేది కార్మికులు, మేనేజ్‌మెంటే. ఏం చేయలేం కదాని సమ్మె చేస్తే అది అటునుంచి అటే పోతే..’ అంటూ సీఎం కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై తెగేసి చెప్పిన తీరు అనేక రకాల అనుమానాలను రేకిత్తిస్తోంది. సమ్మె నోటీసుపై కనీసం సానుకూలంగా స్పందించకపోవడమే కాకుండా చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ అనేది లేనేలేదని సీఎం స్పష్టంగా చెప్పారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో ఆర్టీసీ లేనే లేదు. కేరళలో పేరుకే 300 బస్సులు నడుపుతున్నారని సీఎం చెప్పడం జరిగింది. ఈ పరిస్థితిల్లో ఓ వైపు నష్టాలను తట్టుకోవడమే చాలా కష్టమంటే, వేతన సవరణ చేసి గత ఏడాది నుంచి అమలు చేయాలన్న కార్మిక సంఘాల డిమాండ్‌తో సంస్థ మనుగడ పూర్తి ప్రశ్నార్ధకమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సమ్మెకు అంటూ దిగితే ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గే సూచనలు కూడా కనిపించడం లేదు. ఆర్టీసీలోని 8 సంఘాల జెఏసి సోమవారం సమావేశమై ప్రభుత్వం కార్మికులను బెదిరించాలని చూస్తోందని ఆరోపించారు. ప్రైవేటీకరణ చేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోందని కూడా జెఏసి కన్వీనర్ రాజిరెడ్డి ఆరోపించారు. నష్టాలను తగ్గించుకునే బాధ్యత మేనేజ్‌మెంట్, ప్రభుత్వానిదని, కార్మికులకు అప్పగించిన పనిని చేయడమే తప్ప నష్టాలకు ఎలా బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో సమ్మె బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్న గుర్తింపు కార్మిక సంఘం, మిగిలిన సంఘాలు రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచిచూడాలి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీని ఆదుకుని నిధులిచ్చిన వివరాలు, ప్రోత్సహాకాలు వంటి వాటిపై పూర్తి సమాచారాన్ని దగ్గర ఉంచుకుంది. సమ్మె సందర్భంగా చర్చలు జరిగితే ఆ వివరాలను గుర్తింపు కార్మిక సంఘం ముందు ఉంచి ఏంచేయాలో మీరే చెప్పండంటూ ప్రశ్నించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.