రాష్ట్రీయం

2నుంచి కొత్త రిజిస్ట్రేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: కొత్త రిజిస్ట్రేషన్ విధానం జూన్ 2 నుంచి అమలులోకి రానుండటంతో ఆలోగా రైతులు అందరికీ ఎట్టిపరిస్థితుల్లో పట్టాదారు పాసు పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ పూర్తి కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెవిన్యూ, వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఒక్క రైతు కూడా మిగిలిపోకుండా ప్రతీ ఒక్కరికీ కొత్త పాసు పుస్తకం, రైతుబంధు చెక్కులు అందాలన్నారు. కొన్ని చోట్ల పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కులు అందలేదని ప్రభుత్వానికి సమాచారం అందిందని సిఎం గుర్తు చేసారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించి పాసు పుస్తకాలు, చెక్కులు అందరికీ అందజేయాలన్నారు. ప్రగతి భవన్‌లో మంగళవారం పట్టాదారు పాసు పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంపై స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టి హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మతో కలిసి సిఎం సమీక్షించారు. నయా పైసా ఖర్చు లేకుండా, ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా భూ రికార్డులను సరిచేసి కొత్త పాసు పుస్తకాలను ఇవ్వడం, పంట పెట్టుబడికి సాయం అందించడం పట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరస్తుందన్నారు. దేశంలో మారే ప్రభుత్వ కార్యక్రమానికి రానంత గొప్ప స్పందన రైతుబంధుకు వస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో మిగతా రైతులకు కూడా పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ చేయాలని ఆదేశించారు. అయితే భూ రికార్డులు సరి చేసే కార్యక్రమం కొన్ని చోట్ల సరిగా నిర్వహించలేదని, ప్రభుత్వం రైతుల కోసం చిత్తశుద్దితో పని చేస్తున్నా కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు సమాచారం అందిందన్నారు. ఆధార్‌తో అనుసంధానం కాకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల కొందరికి చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ జరుగలేదన్నారు. అయితే ఇప్పటికైనా సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి, ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కులు పంపిణీకి వెంటనే చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. జూన్ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలులోకి రానుండటంతో అప్పటి వరకు అందరికీ కొత్త పాసు పుస్తకాలు అందించి రికార్డులను అప్‌డెడ్ చేయాలన్నారు. జూన్ 2 నాటికి చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియ ముగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రులు, కలక్టర్లతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సిఎం తెలిపారు. ఈ సమావేశంలో రైతులకు జీవిత బీమా పథకం, కంటి వెలుగు, రాష్ట్ర అవతరణ వేడుకలు, పంచాయతీరాజ్ ఎన్నికలు, కంటి వెలుగు తదితర అంశాలపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు.