రాష్ట్రీయం

తూత్తుకుడి రణరంగం.. పోలీసు కాల్పుల్లో 9మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసేయాలంటూ ఆందోళన.. విధ్వంసం
*న్యాయమడిగితే చంపేస్తారా?: ఏఐసీసీ చీఫ్ రాహుల్ ఆగ్రహం
తూత్తుకుడి, మే 22: తమిళనాడులోని తూత్తుకుడి పట్టణం రక్తసిక్తంగా మారింది. కాలుష్యాన్ని వ్యాపింపచేస్తున్న స్టెరిలైట్ రాగి పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలో హింస చోటుచేసుకుంది. అల్లర్లకు దిగిన గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 9 మంది మరణించారు. ఈ మొత్తం ఘటనలపై న్యాయ విచారణకు తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. తూత్తుకుడి స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని కోరుతూ నెల రోజులుగా నిరసన కారులు ఆందోళన చేస్తున్నారు. మంగళవారం ఆందోళన కారులు జిల్లా కలెక్టరేట్, ప్లాంట్ వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళన కారులు పెద్దఎత్తున రాళ్లవర్షాన్ని కురిపించారు. ప్రభుత్వ, పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఫ్యాక్టరీ వైపు దూసుకుపోవడానికి ఆందోళన కారులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు హింసకు దిగడంతో పోలీసులు కాల్పులకు దిగారు. పోలీసుల కథనం ప్రకారం మద్రాసు హైకోర్టు ఆదేశాలతో ఫ్యాక్టరీ పరిసరాల్లో 144వ సెక్షన్ విధించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని పోలీసులు అంటున్నారు. గుంపులను నియంత్రించడానికి ముందుగా బాష్పవాయుగోళాలను ప్రయోగించామన్నారు. మంగళవారం ఉదయం నుంచి తూత్తుకుడిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 20 వేల మంది ఆందోళన కారులు కలెక్టరేట్, ప్లాంట్ వైపు దూసుకుపోవడానికి దశలవారీగా ప్రయత్నాలు చేశారు. దీంతో పట్టణంలో పెద్దఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. ఆందోళనకారులు వెనక్కు వెళ్లాలని చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా పోలీసు వాహనాలను లక్ష్యంగా చేసుకుని హింసకు దిగడంతో హింస ప్రజ్వరిల్లింది. తూత్తుకుడి ఘటనపై తమిళనాడు ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ప్రజలు సంయమనంతో ఉండాలని, శాంతి భద్రతలు నెలకొనేందుకు సహకరించాలని, ఈ ప్లాంట్ మూసివేతపై ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని సరైన దిశగా చర్యలు తీసుకుంటామని ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. కాగా ఈ విషయమై రాష్ట్ర మంత్రి డి జయకుమార్ మాట్లాడుతూ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. డిఎంకె నేత ఎంకె స్టాలిన్ మాట్లాడుతూ ప్రజల డిమాండ్ మేరకు ప్లాంట్‌ను మూసివేయించాలని, పోలీసుల దుశ్చర్యలకు ప్రజలు బలయ్యారన్నారు.
తూత్తుకుడిలో స్టెరిలైట్ రాగి కర్మాగారం 20 సంవత్సరాలుగా వివాద కేంద్రంగా నిలిచింది. వేదాంత గ్రూప్ యూనిట్ ఈ పరిశ్రమను ఏర్పాటు చేసింది. తూత్తుకుడికి సమీపంలోని మీలవితన్ వద్ద ఈ ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఈ ఫ్యాక్టరీ నుంచి 2013లో గ్యాస్ లీకైంది. ఈ ఫ్యాక్టరీ మూసివేతకు అప్పటి ముఖ్యమంత్రి జె జయలలిత ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కంపెనీ ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఈ ట్రిబ్యునల్ ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. పర్యావరణ పరిరక్షణకు నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించారన్న కారణంపై ఈ ఫ్యాక్టరీ లైసెన్సు పునరుద్ధరణకు తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు నిరాకరించింది. రాగి వ్యర్థ పదార్థాలు, వృథా జలాల వల్ల ఈ ప్రాంతంలో కాలుష్యం తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ ఫ్యాక్టరీ నుంచి సాలీనా 4లక్షల టన్నుల రాగి లోహ ఉత్పత్తి అవుతోంది.
రాహుల్ దిగ్భ్రాంతి
తూత్తుకుడి ఘటనపై ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. పోలీసు కాల్పుల్లో 9 మంది మరణించడం , రాష్ట్రప్రభుత్వం స్పాన్సర్ చేసిన ఉగ్రవాద చర్యగా ఆయన అభివర్ణించారు. కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. న్యాయంకోసం నిజాయితీగా పోరాడుతున్న ప్రజలను తమిళనాడు ప్రభుత్వం హత్య చేసిందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.