రాష్ట్రీయం

కుట్రదారులారా.. ఖబడ్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 27: ‘మాతో పెట్టుకున్న కుట్రదారులూ.. జాగ్రత్త..’ అంటూ బీజేపీ నేతలను తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. బెదిరింపులకు భయపడమని స్పష్టం చేసిన ఆయన ‘రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి కష్టం మాది.. సోకు మీదా.. ’అంటూ నిప్పులు చెరిగారు. విజయవాడలో ఆదివారం ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, పార్లమెంట్‌లో ప్రధాని హామీలు, ప్రత్యేక హోదా అమలు, కేంద్రం నిర్లక్ష్యం అనే అంశాలపై తీర్మానాన్ని ఎంపీ గల్లా జయదేవ్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చంద్రబాబు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దీంట్లో అనుమానం ఉందా తమ్ముళ్లూ.. అంటూ పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. నాటి ప్రధాని విభజన బిల్లు ఆమోదించే సమయంలో హామీలిచ్చారని గుర్తుచేశారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మించి ఇస్తామని తిరుపతిలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతిలో జరిగిన సభలో కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారన్నారు. ప్రధాని ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. తాము చేసిన తప్పేంటో చెప్పాలని ప్రశ్నించారు. కర్రపెత్తనం చేయాలని చూస్తే, బెదిరిస్తే భయపడిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే లేదని, కేంద్రం ఆటలు సాగవంటూ ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చిన నిధులకు యుటిలైజేషన్ సర్ట్ఫికెట్ పంపిస్తే అవన్నీ నకిలీవంటూ తోసిపుచ్చటం సరికాదన్నారు. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సహా నిధులు కేటాయించాలన్నారు. కడప ఉక్కు కర్మాగారం, రైల్వేజోన్, కాకినాడలో కెమికల్ కాంప్లెక్స్ వంటి అంశాలను అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. రాజధాని అమరావతిలో ఏర్పాటయ్యే వివిధ సంస్థల ద్వారా కేంద్రానికే అధిక ఆదాయం వస్తుందని తెలిపారు. మన కష్టంతో నిర్మించుకున్న రాజధాని నుంచి పన్నులు ఎందుకు చెల్లించాలన్నారు. బాధ్యతలు లేకుండా పెత్తనం చెలాయించాలంటే కుదరదని, రెండూ ఉండాలంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఎన్డీఏలో చేరితే నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. వైకాపా, బీజేపీ రెండూ ఒకటేనని, రాష్ట్భ్రావృద్ధికి ఇబ్బందులు
కలిగిస్తున్నారన్నారు. ఏపీని దెబ్బతీయాలన్న బీజేపీ ప్రయత్నాలకు వైకాపా కొమ్ము కాస్తోందన్నారు. తెలుగుజాతికి అన్యాయం చేసినవారిని వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రధానిపై ఇటీవల జరిగిన ఒక సర్వేలో తమిళనాడులో 75శాతం, ఏపీలో 68శాతం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామని చెప్పిన బీజేపీ నేతలు జగన్‌పై అవినీతి కేసులను నీరుకారుస్తున్నారన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఎందుకు తిడుతున్నారో అర్థంకావటం లేదని, విద్యుత్ సరఫరా మనమెందుకు ఆపుతామంటూ ప్రశ్నించారు. కేంద్రానికి సహకరించేవారు రాష్ట్ర ద్రోహులంటూ వ్యాఖ్యానించారు. కేంద్రం తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఇకపై బీజేపీ ఆటలు సాగవంటూ హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాటం ఆగదని, కేంద్రం గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలంటూ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
అంతకుముందు ఎంపీ గల్లా జయదేవ్ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర విభజన సమయంలో 19 అంశాలతో పాటు 6 హామీలిచ్చారని గుర్తుచేశారు. హామీలు అమలు చేయకపోవటంతో ఏంచేస్తారో అనే విషయాన్ని కర్ణాటకలో తెలుగు ప్రజలు చెప్పారన్నారు. వివిధ రకాల ఒత్తిళ్లు తెచ్చినప్పటికీ ఫలితం లేకపోవటంతోనే ఎన్డీఏ నుంచి బయటకొచ్చామన్నారు. ఏఐడీఎంకె, బీజేపీ, స్పీకర్ కలిసి మ్యాచ్‌ఫిక్స్ చేసి అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేశారన్నారు. కర్ణాటకలో బలవంతంగా అధికారంలోకి వచ్చే ప్రయత్నం కుదరలేదన్నారు. కేంద్రం ఎక్కువగా చెబుతూ తక్కువ చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఈ తీర్మానాన్ని బలపరిచిన ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపితే బీజేపీ తీరు బయటపడేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంపై ప్రధాని ద్వేషం పెంచుకున్నారని, తనకు ప్రధాన ప్రత్యర్థిగా చంద్రబాబు మారతారని మోదీ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

చిత్రాలు..టీడీపీ మహానాడు వేదికపై శంఖం పూరిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు
*భారీగా హాజరైన పార్టీ కార్యకర్తలు