రాష్ట్రీయం

95 శాతం లోకల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: కొత్త జోనల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు రిజర్వేషన్లు, స్థానికతకు ప్రామాణికతను ఖరారు చేసింది. ఇక నుంచి ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు 95 శాతం, ఇతరులకు 5 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఆదివారం జరిగిన మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుని ఆమోదించింది. ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశంలో ఇటీవల ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ప్రతిపాదించిన ముఖ్యమంత్రి, వీటిని కూడా యధాతథంగా మంత్రిమండలిలో ఆమోదించారు. అలాగే ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రైతు జీవిత బీమా పథకానికి కూడా మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రగతి భవన్‌లో ఆదివారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో కొత్త జోన్ల వ్యవస్థకు, రైతు జీవిత బీమా పథకం వంటి ప్రధాన అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉద్యోగ నియామకాలు, పదోన్నతులలో కీలకమైన జోన్ల పునర్ వ్యవస్థీకరణ మంత్రిమండలిలో ప్రధానంశంగా ఉండటంతో టిఎన్‌జివోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవిప్రసాద్, గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డిని ఈ భేటీకి ప్రత్యేకంగా ఆహ్వానించింది. రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. ఇకపై ఉద్యోగ నియామకాల్లో జిల్లా, జోన్, మల్టీ జోన్, స్టేట్ కేడర్ నాలగు అంచల వ్యవస్థను ఖరారు చేసి స్టేట్ కేడర్ పోస్టులను కచ్చితంగా పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. స్థానికతకు ఇక నుంచి ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు నాలుగు సంవత్సరాలు ఎక్కడ విద్యాబ్యాసం చేస్తే దానినే స్థానికతగా గుర్తించాలని మంత్రిమండలి నిర్ణయించింది. అలాగే అన్ని పోస్టులకు 95 శాతం స్థానికులకు, 5 శాతం ఇతరులకు కేటాయించాలని నిర్ణయించింది. రైతు జీవిత బీమా రాష్ట్రంలో 18-60 ఏళ్ల వయసున్న ప్రతీ రైతుకు రూ.5 లక్షల జీవిత పథకానికి కూడా మంత్రిమండలి ఆమోదించింది. జీవిత బీమా సంస్థ ద్వారా అమలు చేసే ఈ పథకానికి ప్రతీ రైతుకు రూ.2,271 చొప్పున ప్రతీ ఏడాది ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. దీనికి అయ్యే వ్యయానికి బడ్జెట్‌లోనే నిధులు కేటాయించాలని నిర్ణయించింది. జూన్ 2 నుంచి రైతుల నుంచి నామినీ ప్రతిపాదనలను స్వీకరించి ఆగస్టు 15న బీమా పత్రాలను అందిస్తుంది. వైద్య విద్యాశాఖలో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 65 ఏళ్లకు పొడిగించడానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర రైతు సమన్వయ సమితికి మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు ఇతర సిబ్బందిని నియామకానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మంత్రిమండలి ఆమోదించిన కొత్త జోనల్ వ్యవస్థకు రాష్టప్రతి ఆమోదంతో పాటు ఈ అంశంపై ప్రధానితో చర్చించడానికి సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.