రాష్ట్రీయం

వణికిస్తున్న నిఫా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: నిఫా వైరస్ ఇప్పుడు తెలంగాణను వణికిస్తోంది. హాట్ టాపిక్‌గా మారిన నిఫా వైరస్ అంశమే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు, సోషియల్ మీడియాలో నిఫాకు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఎవరికైనా జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, ఊపిరితిత్తుల సమస్య వస్తే నిఫా సోకిందేమోనని అనుమాన పడుతున్నారు. ఈ తరహా సమస్యలతో దవాఖానాలకు వస్తున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిఫాను గుర్తించే పరీక్షా కేంద్రం హైదరాబాద్‌లో లేకపోవడంతో పూనేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి శాంపిళ్లు పంపిస్తున్నారు. నిఫా వైరస్ సోకితే 4 రోజుల నుంచి 14 రోజుల మధ్య వైరస్ ఉనికి తేలుతుంది. అయితే నిజంగా ఈ వైరస్ సోకిన వారికి ముందుగానే చికిత్స అందకపోతే వారి చుట్టుపక్కల ఉన్నవారికీ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలకు ప్రభుత్వం మీడియా ప్రకటనల ద్వారా ధైర్యం చెబుతోంది.
కేరళలో ఇప్పటికే 14 మంది నిఫా వైరస్ వల్ల చనిపోయారని అధికారికంగా ప్రకటించారు. నిఫా జంతువుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుంచి
మనుషులకు సోకుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ పరిస్థితి పరిశీలిస్తే తెలంగాణకు కేరళ నుంచి నిఫా దిగుమతయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేరళ నుండి తెలంగాణకు శబరి ఎక్స్‌ప్రెస్, త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్, కాచిగూడా- మధురై, కాచిగూడా- ఈరోడ్, త్రివేండ్రం మెయిల్, కన్యాకుమారి, ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లు రోజూ వస్తున్నాయి. అలాగే కేరళలోని తిరువనంతపురం, ఎర్నాకులం, కొచ్చి తదితర నగరాల నుంచి హైదరాబాద్‌కు రోజూ 36కు పైగా విమానాలు నడుస్తున్నాయి. అలాగే ప్రైవేట్ బస్సులు కూడా కేరళ- తెలంగాణ మధ్య నడుస్తున్నాయి. ఏతావాతా రోజూ కేరళ నుంచి తెలంగాణకు ఐదారువేల మంది ప్రయాణికులు వస్తుంటారు. కేరళలో ప్రస్తుతం నిఫా వైరస్ విజృంభించటంతో కేరళ నుంచి వచ్చే ప్రయాణికుల్లో కొంతమందైనా నిఫాకు గురైవుంటే తెలంగాణలో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. గతంలో ‘స్వైన్‌ఫ్లూ’ విజృంభించిన సమయంలో అమెరికా తదితర దేశాల నుంచి విమానాల ద్వారా హైదరాబాద్ వచ్చే ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోనే పరీక్షించేవారు. ఈ పరీక్షల్లో చాలామంది స్వైన్‌కు గురైనట్టు తేలడంతో వారికి ప్రత్యేక చికిత్స అప్పట్లో అందించారు. ఇప్పుడు కేరళ నుంచి వస్తున్న వారిలో ఎవరైనా నిఫా వైరస్ లక్షణాలుంటే పరీక్షించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. కానీ ఎయిర్‌పోర్టుల్లో కానీ, రైల్వేస్టేషన్లలో కాని ఇలాంటి సౌకర్యమేమీ కల్పించలేదు.
భయం వద్దు: వైద్య మంత్రి
తెలంగాణలో ఇప్పటి వరకు నిఫా జాడ లేదని, అందువల్ల ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ఇప్పటి వరకు అనుమానంతో ఇద్దరికి వైద్యపరీక్షలు నిర్వహించగా, నిఫా లేదని తేలిందన్నారు. ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నదని, అత్యవసరం అయితే చికిత్స అందించేందుకు వైద్య శాఖ సిద్ధంగా ఉందని వివరించారు. నిఫా సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) డాక్టర్ కే. రమేష్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రభూమి ప్రతినిధితో ఆదివారం మాట్లాడుతూ, తెలంగాణలోని అన్ని బోధనాసుపత్రుల్లో అవసరమైతే నిఫా సోకిన వారికి చికిత్స అందిస్తామన్నారు. ఇందుకోసం ఐసోలేషన్ వార్డులను సిద్ధంగా ఉంచామన్నారు. ఇలా ఉండగా ఆయుష్‌లో (హోమియో, ఆయుర్వేద, యునాని తదితర విధానాలు) నిఫా సోకకుండా ముందస్తుగా ఎలాంటి మందులు ఇవ్వడం లేదని ఆయుష్ కమిషనర్ డాక్టర్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, నిఫాకు సంబంధించి పూర్తి వివరాలు అందితే, ఈ వ్యాధి సోకకుండా ఏవైనా మందులు (ప్రివెంటివ్ మెడిసిన్) ఇచ్చేందుకు వీలుంటుందేమో ఆలోచిస్తామన్నారు.