రాష్ట్రీయం

శాసన, న్యాయవ్యవస్థల మధ్య సంఘర్షణ తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్‌ల సభ్యత్వాల రద్దు కేసు చిలికి-చిలికి గాలి వానగా మారి చివరకు శాసన, న్యాయ వ్యవస్థల మధ్య సంఘర్షణకు దారి తీస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1964 సంవత్సరంలో కేశవ్ సింగ్ కేసులో ఉత్తర్ ప్రదేశ్ స్పీకర్‌కు, లక్నో హైకోర్టుకు మధ్య వివాదం తలెత్తి పరస్పరం అరెస్టుల వారెంట్లదాకా వెళ్లడంతో, రాష్టప్రతి జోక్యం చేసుకుని ఎవరికి వారే లక్ష్మణ రేఖలు రూపొందించుకోవాలని హితవు చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా మణిపూర్ వంటి అనేకానేక కేసుల్లో శాసన, న్యాయ వ్యవస్థల మధ్య వివాదం తలెత్తుతూనే ఉన్నది. చట్టాల అమలును పరిశీలించే న్యాయ వ్యవస్థకన్నా, చట్టాలు రూపొందించే తమదే పై చేయి అని చట్టసభలు భావిస్తున్నాయి. అయితే చట్ట సభల్లో చట్టాలు చేసినంత మాత్రాన సరిపోదని, వాటి అమలు, రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న తమదే పై చేయిగా ఉండాలన్నది న్యాయవ్యవస్థ అభిప్రాయం. ఈ ఏడాది ఫిబ్రవరిలో గవర్నర్ నరసింహన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ ఉభయ సభల సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు గొడవ చేసిన సంగతి తెలిసిందే. ఒక దశలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ విసిరిన హెడ్ ఫోను కౌన్సిల్ చైర్మన్ కె. స్వామిగౌడ్ కంటికి తగిలి గాయం అయ్యిందని, మర్నాడు అసెంబ్లీ నుంచి ఆ ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయడం, మిగతా ఎమ్మెల్యేలను సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేస్తూ సభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా, కోమటిరెడ్డి, సంపత్ తమ సభ్యత్వాలను రద్దు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. వారిరువురి తరఫున న్యాయవాది జంధ్యాల శంకర్ కేసు వాదించారు. ఇరుపక్షాల వాదన విన్న
న్యాయమూర్తి వారి సభ్యత్వాలను పునరుద్ధరించాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించారు. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిందని కోరుతూ 12 మంది ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. ఇటువంటి అభ్యర్థనను ప్రతివాది దాఖలు చేస్తే అర్థం ఉంది కానీ, ఈ కేసుతో సంబంధం లేని 12 మంది ఎమ్మెల్యేలు పిటీషన్ ఎలా దాఖలు చేస్తారని కోమటిరెడ్డి, సంపత్ తరఫు న్యాయవాది జంధ్యాల వాదించారు. చివరకు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో ఏకీభవించి, 12 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన కేసును కొట్టి వేసింది.
తాజాగా సీఎల్‌పీ నేత కె. జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి తమ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్ధరించాల్సిందిగా కోరారు. వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోకపోతే రాష్టప్రతి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. మరోవైపు కోమటిరెడ్డి, సంపత్ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. దీంతో ఏమి జరగబోతుందనేదానిపై ఉత్కంఠత నెలకొంది. కోర్టు తీర్పును అమలు చేస్తే, అసెంబ్లీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయానికి విలువ లేకుండా పోతుందని, చట్ట సభకు గౌరవం లేకుండా పోతుందన్న భావన ఎమ్మెల్యేలలో ఉంది. కోర్టు తీర్పును అమలు చేయకుండా జాప్యం చేస్తే కోర్టు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేస్తుందోనన్న ఆందోళనను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. సంక్లిష్టమైన పరిస్థితికి సమాధానం ఎలా లభిస్తుందో, లేక రాష్టప్రతి జోక్యం చేసుకునేంత వరకూ వెళుతుందో వేచి చూద్దాం.