రాష్ట్రీయం

క్రీ.శ. 1వ శతాబ్ది బౌద్ధ అవశేషాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో క్రీ.శ.1వ శతాబ్దికి చెందిన బౌద్ధ అవశేషాలను ప్రముఖ బౌద్ధ పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈఓ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. అద్దంకికి చెందిన చరిత్ర పరిశోధకుడు జ్యోతి చంద్రవౌళి ఇచ్చిన సమాచారం మేరకు కల్చరల్ సెంటర్ చేపట్టిన ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టరిటీ పథకంలో భాగంగా బుధవారంనాడు గుండ్లకమ్మ నది ఒడ్డు గ్రామమైన మణికేశ్వరం పరిసరాల్లో జరిపిన విస్తృత గాలింపులో శాతవాహన కాలపు బౌద్ధారామ ఆనవాళ్లను గుర్తించారు. గుండ్లకమ్మ నది కుడివైపున, కొండకు ఆనుకొని ఉన్న బౌద్ధ స్థావరంలో శిలా మండపానికి చెందిన పది అడుగుల ఎత్తు, ఒక అడుగు చదరం గల రెండు స్తంభాలు వెలుగు చూశాయని, స్తంభం మధ్యలో బౌద్ధ చిహ్నాలైన రెండు అర్ధ పద్మాలు, వాటికింద సింహాలు, ఆకులు చెక్కి ఉన్నాయని, ఇవి క్రీస్తు శకారంభం నాటి అమరావతి శిల్పకళకు అద్దం పడుతున్నాయని అన్నారు. వీటి చారిత్రక ప్రాశస్త్యాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఒక స్తంభాన్ని స్థానిక మండూకేశ్వర దేవాలయ మహా మండపం ముందు, మరో స్తంభాన్ని గుండ్లకమ్మ నదికెళ్లే మెట్ల మార్గం దగ్గర నిలిపారన్నారు. పురావస్తు ప్రాధాన్యతగల ఈ బౌద్ధ స్తంభాలను కాపాడి మణికేశ్వరంలోని బౌద్ధ స్థావరం వద్ద తవ్వకాలు జరపాలని రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులకు పత్రికా ముఖంగా శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పురాతన శాఖ అధ్యక్షులు జె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.