ఆంధ్రప్రదేశ్‌

ఇలాగైతే పోలవరం కలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు అరకొరగా కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ కేటాయింపులను చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యక్తంచేస్తున్నారు. బిజెపియేతర రాజకీయ పార్టీల నాయకులు పోలవరం కేటాయింపులను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తుంటే, నోరెత్తలేని పరిస్థితుల్లో ఉన్న బిజెపి నాయకులు తలపట్టుకున్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఈసారయినా పోలవరం ప్రాజెక్టుకు భారీగా కేటాయింపులు ఉంటాయని అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆశపడ్డారు. కానీ అందర్నీ తీవ్ర నిరాశకు గురిచేస్తూ కేవలం రూ.100కోట్ల కేటాయింపులతోనే నరేంద్రమోది ప్రభుత్వం సరిపెట్టింది. నామమాత్రపు నిధులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విభజన హమీలను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్రంగా అవమానించిందన్న ఆగ్రహాన్ని రాష్ట్రప్రజలు వ్యక్తంచేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి చేసిన ఖర్చు రూ.8500 కోట్లు.
2004లో తొలిసారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆమోదించిన అంచనా విలువ సుమారు రూ.10వేల కోట్లయితే, తరువాత సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.16వేల 100కోట్లకు చేరుకుంది. మళ్లీ సవరించిన స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు ప్రకారం చూస్తే ఇప్పుడీ అంచనా విలువ రూ.22వేల కోట్లకు చేరుకుంది. అంటే ఇప్పటి వరకు చేసిన ఖర్చు రూ.8500 కోట్లు తీసివేయగా, ఇంకా సుమారు రూ.14వేల కోట్లు ఉంటే తప్ప ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాదు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పదే పదే చేస్తున్న ప్రకటనలు నిజం కావాలంటే ఏడాదికి కనీసం రూ.5వేల కోట్లను కేంద్రప్రభుత్వం విడుదలచేయాలి. పోనీ నాలుగేళ్లలో పూర్తిచేయాలనుకుంటే కనీసం రూ.4వేల కోట్లు చొప్పున నాలుగేళ్లలో విడుదలచేస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే, కేంద్రం కేవలం రూ.100కోట్లు మాత్రమే కేటాయించింది.
పోలవరం ప్రాజెక్టుకు అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేనినేని ఉమ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కోరినా ఫలితం లేకపోయింది. గత బడ్జెట్‌లో కూడా ఇలాగే రూ.100కోట్లు కేటాయించిన కేంద్రప్రభుత్వం, తరువాత వెయ్యి కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించి రూ.645కోట్లు మాత్రమే మంజూరుచేసింది. ఇందులో కూడా ఇప్పటి వరకు విడుదలయింది కేవలం రూ.300కోట్లు మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టుకు చేసిన ఖర్చులో ఇంకా విడుదల కావాల్సింది రూ.1200కోట్లు. అంటే కేంద్రప్రభుత్వం కేటాయించిన నిధులు పాత బిల్లులు చెల్లించేందుకే సరిపోవన్న మాట. బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉన్నా, ప్రాజెక్టుకు ఎంత కావాలంటే అంత విడుదల చేస్తామని గతంలో కూడా చెప్పిన కేంద్రం కేవలం రూ.645కోట్లు మాత్రమే విడుదలచేసింది. ఇదే పద్ధతిలో ఈ ఏడాది కూడా ఇలాగే నిధులు విడుదలచేస్తే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలగా ఉన్న పోలవరం ప్రాజెక్టు కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

బ్యాంకులు పదిలం

బడ్జెట్‌పై
ఆర్థిక నిపుణుల వ్యాఖ్య

హైదరాబాద్, ఫిబ్రవరి 29: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ బ్యాంకులకు చేయూత ఇచ్చే విధంగా ఉందని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకుల మూలధన సమీకరణకు 25 వేల కోట్లు కేటాయించడంతో వెసులుబాటుగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. అవసరం అయితే మూలధన సమీకరణకు మరిన్ని నిధులు ఇస్తామని జైట్లీ ప్రకటించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థకు ఊతమిచ్చినట్టవుతోంది. దేశంలో ప్రస్తుతం దాదాపు అన్ని వాణిజ్య బ్యాంకులు ఆర్థికంగా బలంగానే ఉన్నాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు స్పాన్సర్ చేస్తుండటంతో వీటి కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి. ముద్ర బ్యాంక్‌ద్వారా లక్షా 80 వేల కోట్ల రూపాయలను రుణాలుగా ఇస్తామంటూ జైట్లీ చేసిన కేటాయింపులు గ్రామీణ ప్రాంత పేదల ఆర్థికాభ్యున్నతికి దోహదపడుతుందనడంలో సందేహం లేదు. చేతివృత్తులు, చిన్న వ్యాపారులు, స్వయం సహాయ సంఘాలకు ముద్ర బ్యాంకు ఆర్థికంగా చేయూత ఇస్తోంది. ఈ నిర్ణయం వాణిజ్య బ్యాంకులకు చేదోడుగా నిలిచి ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు. నిరర్థక ఆస్తులకు సంబంధించిన గడువు (ఎన్‌పిఎ) బ్యాంకులకు ప్రధాన ఆటంకంగా ఉంది. ఆర్‌బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్‌పిఎ గడువు ప్రస్తుతం 90 రోజులుగా (మూడునెలలు) ఉంది. గతంలో ఇది 180 రోజులుగా (ఆరునెలలు) ఉండేది. గడువు తగ్గడంతో రుణాల వసూళ్లు కాస్త ఆలస్యమైనా బ్యాంకుల ఎన్‌పిఎ అమాంతంగా పెరిగిపోతోంది. దీని వల్ల బ్యాంకులకు ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. వాస్తవంగా చిన్న, మధ్యతరహా, పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారులతో పాటు చిన్న చిన్న రుణాలు తీసుకున్నవారికి ఇబ్బందిగానే ఉంటోందని నిపుణులు పేర్కొంటున్నారు.