రాష్ట్రీయం

పరకాల రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 19: ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రకటించారు. గత కొద్దిరోజులుగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న విమర్శలకుతోడు బీజేపీ నేతలు సైతం పరకాలను టార్గెట్‌గా చేసుకున్నారు. పరకాల భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన చట్టం హక్కులు, హామీల అమలులో కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిన నేపథ్యంలో పరకాల కుటుంబ సభ్యులపై ఇటీవల కాలంలో విమర్శలు తీవ్రమయ్యాయి. పరకాల వల్లే బీజేపీ, టీడీపీల మధ్య పరోక్ష సంబంధాలు కొనసాగుతున్నాయని ఆరోపించిన విపక్షాలు ఇందుకు సంబంధించి అనేక అనుమానాలూ వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో తీవ్రంగా మనస్తాపానికి గురైన పరకాల ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. అలాగే తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఆ లేఖలో ఆయన అనేక అంశాల్ని ప్రస్తావించారు. ‘నేను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతలలో ఉండటాన్ని పదేపదే ఎత్తి చూపుతున్నారు. కేంద్రం, బీజేపీపై మీరు చేస్తున్న ధర్మ పోరాటం మీద ప్రజల్లో అనుమానాలు లేవనెత్తే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంలో నా ఉనికిని..మీ చిత్తశుద్ధిని శంకించేందుకు నా పదవిని అడ్డుపెడుతున్నారు. నా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు రాజకీయ ప్రయోజనాలను, ప్రాతిపదికనూ ఆపాదించాలని చూడటం వాటిని తెరవెనుక మంతనాలకు బేరసారాలకు మీరు వినియోగిస్తున్నారని ఆరోపించటం ప్రతిపక్ష నాయకుల నీచస్థాయికి నిదర్శనం. నా కుటుంబ సభ్యులు (నిర్మలా సీతారామన్) మరో పార్టీలో ఉన్నందున, నాకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందువల్ల మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీపడతానంటూ కొందరు చేస్తున్న ప్రచారం బాధ కలిగిస్తోంది. పరిణతి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయాభిప్రాయాలకు వారు నిబద్ధులై ఉండగలరనీ, వారికున్న అంకితభావానికి బాంధవ్యాలు అడ్డురాలేవనే ఇంగితం కూడా ప్రతిపక్షనేతలకు భగవంతుడు ప్రసాదించక పోవటం దురదృష్టకరం. నా వల్ల మీకూ, ప్రభుత్వ ప్రతిష్టకు, నలుసంతైనా నష్టం జరగరాదనేది దృఢాభిప్రాయం. మీతో పాటు ప్రభుత్వంపై బురదజల్లటానికి, లేనిపోని ఆరోపణలు చేయటానికి నన్ను, నా కుటుంబ సభ్యుల పేర్లు ఎవరూ ప్రయోగించరాదనేది నా మనోగతం. ఈ కారణంగానే ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నా..అని పరకాల ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు.