ఆంధ్రప్రదేశ్‌

నేడు బార్ అసోసియేషన్ చైర్మన్ల సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్),: రాష్ట్రంలోని అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ల ఫెడరేషన్ చైర్మన్ల సమావేశం పలు అంశాలపై చర్చించనుందని గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ల ఫెడరేషన్ చైర్మన్, గుంటూరు బార్ అధ్యక్షుడు జి శాంతకుమార్ శుక్రవారం విలేఖర్లకు తెలిపారు. శనివారం ఉదయం 11 గంటల నుండి గుంటూరు బార్ అసోసియేషన్ నూతన సమావేశ మందిరంలో మెరుగైన న్యాయవ్యవస్థ కోసం చైర్మన్లతో చర్చ జరుగుతుందన్నారు. ప్రధానంగా జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలకు హాజరయ్యే న్యాయవాదులు తప్పనిసరిగా మూడేళ్ల వృత్తి నైపుణ్యాన్ని సాధించిన తరువాతే పరీక్షలకు అనుమతివ్వాలని, న్యాయవాదుల సంక్షేమ నిధి నుండి న్యాయవాదులకు ఇచ్చే మొత్తాన్ని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచాలని, స్టేషన్‌లోనే బెయిల్ ఇచ్చే పలు సెక్షన్లకు ఇకపై కోర్టుద్వారానే బెయిల్ పొందేలా న్యాయశాఖ అనుమతులు మంజూరు చేయాలని తీర్మానించనున్నారు. సమావేశంలో బార్ ఉపాధ్యక్షుడు కంతేటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి నీలం శంకరరావు, సీనియర్ కార్యవర్గ సభ్యులు శిద్దా సత్యనారాయణ పాల్గొన్నారు.
ఒకే విద్యార్థికి రెండు ఫెలోషిప్‌లు!
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 4: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి రెండు రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌లకు ఎంపిక కావడం ఇప్పుడు ఎయు వర్గాల్లో చర్చనీయాంశమైంది. దళిత పరిశోధక విద్యార్థులకు యుజిసి అందించే రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్‌కు కె.జగదీష్ విద్యార్థి ఎంపికయ్యాడు. మూడేళ్లపాటు ఈ ఫెలోషిప్‌ను అందుకున్నాడు. అయితే ఇది అమలులో ఉండగానే సైకాలజీలో చేరానంటూ మళ్లీ రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేయగా అది కూడా మంజూరైంది. ఒకే విద్యార్థికి రెండు ఫెలోషిప్‌లు ఎలా మంజూరు చేశారంటూ ఎయు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2012-15 సంవత్సరానికి సంబంధించి రాజనీతిశాస్త్రంలో పరిశోధక విద్యార్థిగా చేరిన జగదీష్ రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేయడంతో అది మంజూరైంది. ఇటీవల రాజనీతి శాస్త్రంలో పిహెచ్‌డిని కూడా పూర్తి చేసి థీసిస్ అందజేశాడు. ఈ వ్యవహారం పూర్తి కాకుండానే సైకాలజీ విభాగంలో పరిశోధక విద్యార్థినంటూ మళ్లీ రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేయగా దళిత విద్యార్థి కోటాలో మరోసారి ఫెలోషిప్ మంజూరైంది. దీంతో ఏక కాలంలో రెండు ఫెలోషిప్‌లు వచ్చాయి. ప్రస్తుతం పొందుతున్న ఫెలోషిప్ రద్దుకాకుండానే రెండో ఫెలోషిప్ ఎలా మంజూరైందన్నది ఎయు వర్గాలను వేధిస్తున్న ప్రశ్న.

చేనేత కార్మికుడి ఆత్మహత్య
మదనపల్లె, మార్చి 4: వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో చోటుచేసుకుంది. నీరుగట్టువారిపల్లె కాట్లాటపల్లె రోడ్డులో నివాసముంటున్న అనిల్‌కుమార్ (44) సొంతంగా చీరలు తయారుచేసి విక్రయించేవాడు. మగ్గాల నిర్వహణకు స్థానికంగా ఉంటున్న ఓ ఏజెంట్ వద్ద లక్ష రూపాయాల చీటీ వేసి పాడుకున్నాడు. మగ్గాలు మూసివేసి కూలి పనులు చేసుకుంటూ వడ్డీలు చెల్లిస్తున్నాడు. ఒకేసారి వడ్డీతో చెల్లించాలని ఏజెంట్లు వారం రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నారు. నెలాఖరు వరకు సమయం కావాలని కుటుంబ సభ్యులు సైతం మొరపెట్టుకున్నారు. వడ్డీ వ్యాపారి, జామీనుదారులిద్దరూ అనిల్‌కుమార్ ఇంటి వద్దకు వచ్చి ఒత్తిడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన అతడు ఇంటిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
టిడిపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నా: గాదె
బాపట్ల, మార్చి 4: తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గాదె వెంకటరెడ్డి వెల్లడించారు. బాపట్లలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ తన అనుయాయులతో మాట్లాడిన తరువాతే తానీ నిర్ణయం తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తనను విశేషంగా ఆకర్షించాయని, ఆయన నుండి ఆహ్వానం అందిన వెంటనే సైకిల్ ఎక్కుతానని చెప్పారు. కాగా రాజధాని నిర్మించనున్న ప్రాంతంలో భూములను కొనుగోలు చేస్తున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్ధంలేదని గాదె వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. భూములు కబ్జా చేస్తే తప్పుగానీ, భూములు కొనుగోలు చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
దొనకొండలో మినీ ఎయిర్‌పోర్టు
దొనకొండ, మార్చి 4: ప్రకాశం జిల్లా దొనకొండలో త్వరలో మినీ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భోగాపురం విమానాశ్రయం ఎండి కె వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన శుక్రవారం దొనకొండ విమానాశ్రయాన్ని పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ భోగాపురంతోపాటు దొనకొండలో మినీ ఎయిర్‌పోర్టును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశీలించినట్లు చెప్పారు. దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చెందాలంటే దొనకొండలో మినీఎయిర్‌పోర్టు నిర్మాణం ముందుగా జరగాలన్నారు.

గోదావరిలోకి దూకి యువజంట ఆత్మహత్య
రాజమహేంద్రవరం, మార్చి 4: రోడ్-కమ్-రైలు వంతెన పైనుండి దూకి ఒక యువజంట ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిరువురు ప్రేమికులై ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం సుమారు 25ఏళ్ల యువకుడు, 20ఏళ్ల యువతి శుక్రవారం మధ్యాహ్నం రోడ్డుకం రైలు వంతెనపైకి చేరుకుని 5వ స్తంభం మీదుగా కుమారీ థియేటర్ వైపు గోదావరిలోకి దూకేశారు. స్థానిక జాల్లర్లు గమనించి, వెంటనే వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితంలేకపోయింది. అప్పటికే వారిరువురు మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న రాజమండ్రి టూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతుల ఆచూకీ గురించి ప్రయత్నించారు. మృతుడి జేబులో ఒక తాళం చెవుల గుత్తి, రూ.100 నోటు మినహా ఏమీ లభ్యం కాలేదు. నీలంరంగు జీన్స్‌ప్యాంటు, చింతపిక్కరంగు టీ షర్టు, యువతి నల్లరంగు జీన్స్‌ప్యాంటు, గులాబీరంగు టీషర్ట్ ధరించి ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువజంట ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఇద్దరూ బంధువులా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.