రాష్ట్రీయం

అమ్మభాషకు వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇక తెలుగుదనం మరింత తేజాన్ని సంతరించుకోనుంది. కమ్మనైన అమ్మ భాష ప్రాధాన్యం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగు వెలుగుల ప్రాభవం చాటి చెబుతూ ప్రజల భాషను పాలనలోనూ చూపేలా స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థకు జీవం పోసింది. స్వయంగా ముఖ్యమంత్రి నేతృత్వం లో నడిచే ఆంధ్రప్రదేశ్ పర్యటక, సాంస్కృతిక, వారసత్వ బోర్డు ద్వారా తెలుగు భాషాభివృద్ధి సంస్థ జీవం పోసుకోగా, రాష్ట్ర పర్యటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఇందుకు సంబంధించిన జీవోను సిద్ధం చేశారు. ఇక తెలుగు భాష బోధనలో నిర్లక్ష్యం చేసే వారికి, తెలుగులో బోర్డులు పెట్టకపోయినా రూ. 50వేలు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష పడబోతున్నది. అలాగే నిధుల సమస్య లేకుండా తెలుగు భాషాభివృద్ధి పేరిట రూ. 25 కోట్లు కేటాయించబోతున్నారు. ప్రభుత్వం నియమించే చైర్మన్‌తోపాటు సాధారణ పరిపాలన, లా, కార్మిక, పర్యటక సాంస్కృతిక, విద్యాశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉండే ఈ సంస్థలో తెలుగు సాహిత్యం, పరిపాలన, చట్టం వంటి అంశాల్లో నిపుణత కలిగిన నలుగురు సభ్యులుగా ఉంటారు. సంస్థ సీఈఓ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించనుండగా, ప్రాధికార సంస్థ ద్వారా ప్రత్యేకంగా ఐదు కమిటీలను సైతం ఏర్పాటు చేసి భాషకు పునరుత్తేజం కలిగించేందుకు కృషి చేస్తారు. అధికార భాషగా తెలుగు అమలు, విద్యా విధానంలో అంతర్భాగంగా తెలుగు భాషాభివృద్ధి,
ఈ- తెలుగు అభివృద్ధి, ప్రచురణలు, అనువాదం, అంతర్జాతీయంగా తెలుగు అభివృద్ధి వంటి అంశాల్లో ఈ కమిటీలు తమ సేవలను అందించేలా చట్టం రూపకల్పన జరిగింది. ప్రధానంగా అధికార భాష అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు ప్రాధికార సంస్థ ప్రయత్నిస్తుంది. ప్రభుత్వపరంగా ప్రజలు వినియోగించే ప్రతి దరఖాస్తు, ప్రభుత్వ రికార్డులను తెలుగులో అందుబాటులో ఉంచటంపై దృష్టి సారిస్తారు. ప్రత్యేకించి ఆయా న్యాయస్థానాలు వెలువరించే తీర్పు సైతం తెలుగులో ఉండేలా సమన్వయం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు భాషపై మరింత పట్టు సాధించేలా తగిన చర్యలు చేపడుతుంది. అధికారులకు తెలుగుపై పట్టు ఎంత అన్నదానిపై ఎప్పటికప్పు పరీక్షలు నిర్వహిస్తారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వపరంగానే కాకుండా ఇక్కడి కేంద్ర సంస్థల్లో కూడా తెలుగు అమలు చేసే క్రమంలో ప్రత్యేక చర్యలు ఉంటాయి. మన భాషా విధానాన్ని తెలియపరుస్తూ విమానాశ్రయాలు, బ్యాంకులు, తపాలా కార్యాలయాలు ఇలా అన్నింటా తెలుగు కనిపించేలా చూస్తారు. శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన అన్ని అంశాలు తెలుగులోనే ఉండేలా ప్రత్యేక కార్యాచరణ అమలు కానుంది. ప్రభుత్వపరమైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలా ఫలకాలతోపాటు అన్ని రకాల నామ ఫలకాలు, గోడపత్రికలు, జెండాలు ఇలా ప్రతి విషయంలోనూ తెలుగుదనం కనిపించేలా చర్యలు తీసుకోవటం ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ విధుల్లో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో పర్యటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ జీవం పోసుకుందన్నారు. పరిపాలనలో తెలుగు అమలు, వినియోగంపై కాలపరిమితితో కూడిన నిబంధనావళి ఉంటుందని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శిలాఫలకాలు, గోడపత్రికల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తెలుగు వినియోగించాలని, లేకుంటే రూ. 10వేలు జరిమానా తప్పదన్నారు. నిబంధనల మేరకు తెలుగుతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపని ప్రభుత్వ శాఖలకు రూ. 5 వేలు అపరాధరుసుం తప్పదన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసే నిబంధనలకు అనుగుణంగా విద్యా సంస్థల నిర్వాహకులు తెలుగును బోధనాంశంగా అమలు చేయకపోతే జరిమానా,జైలు తప్పదని ముఖేష్‌కుమార్ మీనా స్పష్టం చేశారు.