రాష్ట్రీయం

నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలపై రాజకీయకోణం ఎలా ఉన్నప్పటికీ, పరిపాలనాపరంగా, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు, న్యాయస్థానానికి నివేదించాల్సిన అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం బుధవారం భేటీ అవుతోంది. పంచాయతీరాజ్ చట్టం రూపొందించేందుకు సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఏడుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరునెలల క్రితం ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘంలో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై చర్చిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. న్యాయనిపుణుల అభిప్రాయాలు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం
గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు మొత్తం 60 శాతాన్ని మించిపోతున్నాయి. ఈ అంశంపైనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం బుధవారం బేటీ అవుతోంది. 2013 పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో 61 శాతం రిజర్వేషన్లను చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై అప్పట్లో సుప్రీం తీర్పు ఇస్తూ, 2013 పంచాయతీ ఎన్నికల్లో 61 శాతం రిజర్వేషన్లకు అనుమతి ఇస్తూ, ఎన్నికల తర్వాత అయినా బీసీల జనాభా లెక్కలపై స్పష్టత తీసుకురావాలని ఆదేశించింది. అయితే గత ఐదేళ్లలో బీసీల జనాభాపై శాస్ర్తియమైన సర్వే చేయలేదు. స్పష్టత రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం బీఎస్ రాములు నేతృత్వంలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ముస్లింలను బీసీల్లోచేర్చే అంశంపై బీసీ కమిషన్ సర్వే చేసిందే తప్ప మొత్తం బీసీలు ఎంత మంది ఉన్నారన్న అంశంపై సర్వే చేయలేదు. ప్రభుత్వం కూడా బీసీ కమిషన్‌ను బీసీల జనాభా గణన చేయాలంటూ ఇప్పటివరకు అడగలేదు. తాజాగా బీసీ కమిషన్-ప్రభుత్వం మధ్య ఈ అంశంపై లిఖితపూర్వకంగా చర్చలు జరిగాయి. బీసీల జనాభాగణన చేసేందుకు 100 కోట్లపైగా రూపాయలు అవసరం అవుతాయని బీసీ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సర్వే చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేస్తే వారంరోజుల్లో పూర్తి చేస్తామని బీసీ కమిషన్ ప్రభుత్వానికి తెలియచేసినట్టు తెలిసింది.
ఎన్నికలకు బ్రేక్
జూలైలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలకు తాజా పరిస్థితితో బ్రేక్ పడ్డది. ఈ నెలలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుకావడం లేదు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో రెండు కేసులు నడుస్తున్నాయి. బీసీల జనాభా సరిగ్గా లేదంటూ ఒక కేసు నమోదు కాగా, పంచాయతీ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ పిటీషన్లు దాఖలయ్యాయి. రెండింటిపై కూడా హైకోర్టు స్పందించింది. బీసీల జనాభా తేలేంత వరకు ఎన్నికలు నిర్వహించవద్దని ఏకసభ్య న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయగా, రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చూడాలంటూ ప్రధాన నాయమూర్తితో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
42 కోట్ల రూ.లు బీసీల జనాభా గణనకేనా?
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలంగాణ బీసీ కమిషన్‌కు 42.75 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందుకు అనుగుణంగా జీఓ (ఆర్‌టీ నెంబర్ 170) జారీ చేశారు. ఈ నిధులు బీసీల జనాభా గణనకే అని తెలుస్తోంది. వాస్తవంగా బీసీ కమిషన్‌కు పరిపాలనా ఖర్చులు, వేతనాలు, ఇతర అలవెన్సులను చెల్లించేందుకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు అవసరం ఉండదు. హఠాత్తుగా పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ జీఓ జారీ అయిన అంశంపై బీసీ కమిషన్ కూడా ఆశ్చర్యపోతోంది. జీఓలో పేర్కొన్న హెడ్ ఆఫ్ అకౌంట్ ప్రకారమైతే ఈ నిధులు జనాభా గణనకు కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇతర అవసరాలకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు అవసరం ఉండదని వాస్తవ పరిస్థితి వెల్లడిస్తోంది. బీసీల జనాభా శాస్ర్తియంగా జరపాలంటూ హైకోర్టు ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా అభిప్రాయపడ్డది. దాంతో మంగళవారం జారీ చేసిన నిధులు బీసీల జనాభా గణనకోసమే కావచ్చని తెలుస్తోంది.