రాష్ట్రీయం

‘పోలవరం’ పూర్తికి కట్టుబడి ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 11: పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తిచేయడానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడివుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. రాజకీయంగా ఎటువంటి విభేదాలున్నా, దాని ప్రభావం అభివృద్ధి ప్రాజెక్టులపై ఉండబోదని ఆయన భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు ముందస్తుగా నిధులు మంజూరు చేయాలంటే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సివుందని ఆయన చెప్పారు. ప్రాజెక్టు వ్యయం ఇతలింతలుగా పెరిగినందున ఈ అనుమతి తప్పనిసరన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే అంటే 2019 ఫిబ్రవరి నాటికే ప్రాజెక్టు సివిల్ పనులు మొత్తం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంట్రాక్టు సంస్థలకు గడ్కరీ సూచించారు. మేలో ఎన్నికలు వచ్చే అవకాశమున్నందున ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని అంతకు మూడు నెలలు ముందుగానే పనులు పూర్తిచేసుకోవాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ముఖ్యమంత్రితో కలిసి గడ్కరీ విలేఖరులతో మాట్లాడారు. పోలవరం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రాజెక్టు కాదని, దేశానికి సంబంధించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అని గడ్కరీ వ్యాఖ్యానించారు. పది నెలల క్రితం తాను ఇక్కడకు వచ్చినప్పటికంటే ప్రస్తుతం ప్రాజెక్టు పనుల పురోగతి బాగుందని ఆయన ప్రశంసించారు. గోదావరి నది నుండి ఏటా నాలుగు వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందని, ఒక రైతుగా తనకు నీటి విలువ తెలుసని ఆయన అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తచేయాలనే లక్ష్యంతో ఉన్నామని గడ్కరీ వెల్లడించారు. పునరావాస, సహయ కార్యక్రమాల విషయంలో గిరిజనులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులయ్యే వారికి అన్ని వౌలిక సౌకర్యాలతో కూడిన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్-2ను సమర్పించిన ఎనిమిది రోజుల్లోగా తమ శాఖకు సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తిచేసి, ఆర్థిక శాఖకు నివేదిస్తామని గడ్కరీ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తన కార్యాలయ అధికార్లకు ఆదేశాలిచ్చామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎటువంటి నిధుల సమస్య ఉండబోదని స్పష్టంచేశారు. రాజకీయాలు ఎన్నిఉన్నా అభివృద్ధి విషయంలో మాత్రం వాటి ప్రస్తావన ఉండబోదని గడ్కరీ పునరుద్ఘాటించారు.
అంతకుముందు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం చేరుకున్న ఆయన హెలికాప్టర్‌లో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్న సీఎం చంద్రబాబు గడ్కరీకి పుష్పగుచ్ఛం అందించి, స్వాగతం పలికారు. వారిద్దరూ కలిసి తొలుత స్పిల్‌వే ప్రాజెక్టు పనులను చూశారు. అధికారులు ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించారు. అక్కడ ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు.