రాష్ట్రీయం

పండుగలు, పబ్బాలకు అనువైనది ఆషాఢం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జూలై 14: జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా నిర్ణయస్తారు. చైత్ర పౌర్ణిమ రోజున చంద్ర సంచారం చిత్తా నక్షత్రమున అవుతుంది కనుక ఆ మాసానికి చైత్ర మాసమని, విశాఖ నక్షత్రంలో సంచరించడం వలన వైశాఖ మాసమని, ఇలా పనె్నండు మాసాల పౌర్ణిమలలో చంద్రుని సంచారం ఆధారంగా పేర్లను నిర్ణయించారు. చంద్రుడు పౌర్ణిమ రోజున ‘‘పూర్వాషాఢ’’ నక్షత్రంలో సంచరించే మాసం ‘‘ఆషాఢ మాసం’’. దీనిని శూన్యమాసమంటారు. ఆషాఢం నుండే దక్షిణాయనం, వర్షరుతువు ప్రారంభమవుతాయి.
సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ప్రారంభమయ్యే దక్షిణాయనం తిరిగి మకర రాశిగతుడు అయ్యే వరకు ఆరు మాసాలు ఉంటుంది. సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృకర్మలకు ప్రీతికరం. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలోనే పండుగలు, పబ్బాలు అధికం. ఆషాఢంలో ప్రధానంగా శుక్ల పక్ష విదియ నాడు జగన్నాధ, బలభద్ర, సుభద్రల రథయాత్రలు నిర్వహిస్తారు. ‘‘ఆషాఢ పంచమ్యాం వచ్చెనె వృద్ధ గౌతమి అథవా తప్పిదారేణ ద్వాదశ్యామది తప్పదు’’ అని లోకోక్తి ఉంది. గోదావరి తీర వాసుల్లో పంచమి తప్పితే ద్వాదశికి గోదారి వరద రాగలదని భావన. స్కంద పంచమి నాడు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించే దినంగా, కుమార షష్టిగా, భాను సప్తమిగా పర్వదినాలను ఆచరిస్తారు. ప్రధానంగా శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. మహా ఏకాదశిగా, శయన ఏకాదశిగా పిలిచే ఈ దినం నాడు చాతుర్మాస దీక్షలు ప్రారంభిస్తారు. త్రైమూర్త్య స్వరూపుడైన గురువులను పూజించి దినం గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ. తెలంగాణలో ఆషాడంలో బోనాల పండుగ జరుపుకోవడం అనాది నుండి వస్తోంది. భోజనానికి వికృతియైన బోనాన్ని అమ్మవారికి నివేదించడం గ్రామీణ ఆచారం.
ప్రకృతి మార్పు వల్ల ఆరోగ్యానికి హాని చేకూర్చే వ్యాధుల నుండి కాపాడే అన్నం, బెల్లం, పెరుగు, పసుపునీళ్ళు, వేపాకులు బోనంలో చేరుస్తారు. రైతులు వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యే కాలమిది. విత్తడానికి అనువైన కాలమైనందున వైవాహిక జీవితం ధ్యాస నుండి మళ్ళించేందుకు అత్తవారింటికి అల్లుడు వెళ్ళకూడదనే నియమం పెట్టారు. అందుకే కొత్తగా వివాహాలైన నవ వధువులు తల్లిగారిళ్ళలో నెల రోజులు ఉండే సాంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. స్నానం, దానం, జప, పారాయణాది సత్కర్మల ఆచరణకు యోగ్యమైన మాసం. గృహ నిర్మాణ ఆరంభాలకు శుభసూచకమైన మాసంగా చెప్పబడింది.