రాష్ట్రీయం

గోదావరిలో పడవ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం/ ఐ.పోలవరం, జూలై 14: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరి నదీపాయలో శనివారం సాయంత్రం ఘోర పడవ ప్రమాదం జరిగింది. హైస్కూలు విద్యార్థులు, గ్రామస్థులతో వెళుతున్న నాటు పడవ బోల్తాపడటంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. 19మంది సురక్షితంగా బయటపడగా, ఏడుగురు గల్లంతైనట్టు సమాచారం. అయితే పడవలో ప్రయాణిస్తున్న వారిలో వివిధ మండలాలకు చెందిన లంక గ్రామాలకు చెందిన వారు ఉండటంతో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎంతమంది గల్లంతయ్యారనే విషయమై పూర్తి స్పష్టత రావడంలేదు. వివరాలిలావున్నాయి... ఐ.పోలవరం మండలం పశువుల్లంక గోదావరి (వృద్ధగౌతమి నదీపాయ) రేవు నుండి శనివారం సాయంత్రం ఒక నాటుపడవ ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెం రేవుకు బయలుదేరింది. వివిధ పనుల నిమిత్తం వచ్చిన కొంతమంది పెద్దలతోపాటు పశువుల్లంక, మురమళ్లలోని ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు సుమారు 26మంది పడవ ఎక్కారు. వీరంతా సలాదివారిపాలెంతో పాటు తాళ్లరేవు మండలం కొత్తలంక, పిల్లంక, కె.గంగవరం మండలం శేరిలంక గ్రామాలకు చెందినవారు. నదిలో వరద ఉద్ధృతి ఉండటంతో కొంతదూరం వెళ్లిన పడవ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పిల్లరును ఢీకొట్టింది. పడవ ఒకపక్కకు ఒరిగిపోతుండటంతో ప్రమాదాన్ని ఊహించిన ఏడుగురు విద్యార్థులు కంగారుగా వంతెన పిల్లరుపైకి దూకేశారు. దీనితో పడవ ఊగిసలాడి మునిగిపోవడంతో మిగిలిన వారు నదిలో పడిపోయారు. ప్రమాదాన్ని గమనించిన బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఉన్న వారు వేరే పడవపై హుటాహుటిన అక్కడకు చేరుకుని పలువురిని రక్షించారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ఏడుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఆరుగురు విద్యార్థినులు, ఒక వివాహిత ఉన్నారు. గల్లంతైన వారిలో గెల్లా నాగమణి (25), కొండేపూడి రమ్య (13), పోలిశెట్టి అనూష (13), పోలిశెట్టి సుచిత్ర (11), పోలిశెట్టి మనీష (14), సుంకర శ్రీజ (12), తిరుకోటి ప్రియ (13) ఉన్నారు. కాగా ప్రమాద సమాచారం అందుకున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్
కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్నీ హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సంఘటనాస్థలంలో మకాంచేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పడవలో వివిధ గ్రామాలకు చెందిన వారు ఉండటంతో రెవెన్యూ, పోలీసు అధికార్లను ఆయా గ్రామాలకు పంపించి, వివరాలు సేకరించడంలో నిమగ్నమయ్యారు. రాత్రి సమయానికి సంఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. రాత్రి సమయం కావడం, వరద కారణంగా నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటం, సన్నగా వర్షం పడుతుండటం తదితర కారణాలవల్ల సహాయక, గాలింపుచర్యలకు ఆటంకం కలుగుతోంది. వంతెన పిల్లరుకు పడవ తగలడంతో మునిగిపోయిందని, అయితే తాను ఎలా ఒడ్డుకు చేరానో తెలియడంలేదని, ప్రమాదం నుండి బయటపడిన ఒక విద్యార్థిని తెలిపింది. ప్రమాదం జరిగినపుడు 20మందికి పైగా పడవలో ఉన్నారని మరో విద్యార్థి తెలిపాడు.
ఇదిలా ఉండగా, పడవ బోల్తా ఘటనపై అప్రమత్తమైన విపత్తుల నిర్వహణ శాఖ సహాయక చర్యల కోసం హుటాహుటిన రాజమండ్రి, విశాఖపట్నం నుండి రెండు బృందాలను పంపింది. ఒక్కో బృందంలో 35 మంది సభ్యులతో కూడిన రెండు బృందాలు ఘటన జరిగిన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.

చిత్రం..ప్రమాదం జరిగిన ప్రదేశం వద్ద గుమిగూడిన స్థానికులు