రాష్ట్రీయం

అభివృద్ధిలో రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 14: అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ‘రాజధాని లేకుండా విడకొట్టి ప్రజల్లో అభద్రతాభావం పెంచారు. ఇప్పుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలనేదే మా డిమాండ్. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి ఆగదు’ అని అన్నారు. ఉండవల్లి గ్రీవెన్స్‌సెల్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విభజన చట్టం అంశాల అమలులో కేంద్ర వైఖరి, ప్రతిపక్ష పార్టీల వౌనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మొండి వైఖరిని అవలంబించిన కేంద్ర ప్రభుత్వం ప్రజాగ్రహానికి తలొగ్గక తప్పదన్నారు. న్యాయమైన కోర్కెల సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. విభజన సమయంలో కాంగ్రెస్‌ను పట్టుకు వేలాడిన వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీకి దాసోహం అంటోందని మండిపడ్డారు. తమిళనాడులో కావేరి జలాల విషయంలో అన్ని పార్టీలు కలసి ఉద్యమిస్తే ఇక్కడ మాత్రం ప్రతిపక్ష
పార్టీలు ప్రభుత్వాన్ని తప్పుపట్టడంలోని ఆంతర్యం కుటిల రాజకీయమే అని వ్యాఖ్యానించారు. ఇటీవల కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ పోలవరం సందర్శన సమయంలో అధికారిక కార్యక్రమం అయినప్పటికీ బీజేపీ నేతలు అవహేళనగా మాట్లాడారన్నారు. రెండవ డీపీఆర్ సమర్పిస్తే నిధులు మంజూరు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఢిల్లీకి అధికారుల బృందాన్ని పంపుతున్నట్లు తెలిపారు. అవసరమైతే తానుకూడా ఢిల్లీలో మకాం వేసి పోలవరానికి రావాల్సిన నిధులు సాధిస్తామని స్పష్టంచేశారు.
ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు కర్మాగారం తదితర డిమాండ్ల సాధనకు కేంద్రంతో తలపడుతుంటే వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి పరారయ్యారని, రాష్ట్రంలో శాసనసభకు రాకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీడీపీని వచ్చే ఎన్నికల్లో బలహీనపరచాలనేదే ఆ మూడు పార్టీల ఉమ్మడి అజెండాగా అభివర్ణించారు. అయితే తెలుగుదేశం పార్టీకి గెలుపు అనేది చారిత్రక అవసరమన్నారు. దీనిపై చర్చ జరిగేలా ప్రజాక్షేత్రంలో విపక్షాలను దోషులుగా నిలుపుతామని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చారిత్రాత్మకం కాగలదన్నారు. రాష్ట్ర విభజనపై అప్పట్లో బీజేపీ లోక్‌సభలో మమ అనిపించి రాజ్యసభలో మాత్రం ప్రత్యేకహోదా అంశాన్ని లేవనెత్తిందని గుర్తుచేశారు. విభజన చట్టంలో ఉన్న వాటి గురించి ప్రస్తావించరు. హామీలు నెరవేర్చరు. ట్రైబల్ యూనివర్శిటీ ఊసెత్తరని వ్యాఖ్యానించారు. కడప ఉక్కు కర్మాగారం విషయంలో రాష్ట్రం అన్నిరకాల వసతుల కల్పనకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం అంగీకరించట్లేదని ధ్వజమెత్తారు. రాష్టమ్రే నిర్మిస్తుంది పన్నుల్లో రాయితీ ఇవ్వమంటే దానికీ ఒప్పుకోవటంలేదు. కడప ఉక్కును వదిలిపెట్టే సమస్యలేదు. అన్నీ సాధిస్తాం. వీళ్ల సొంత డబ్బు ఇవ్వటంలేదు. మనం కూడా పన్నులు కడుతున్నాం. ఇంట్లో నుంచి నిధులు తీసుకువచ్చి ఇవ్వమనటంలేదు. ఇకపై ఉపేక్షించేదిలేదని తేల్చిచెప్పారు. వచ్చే జన్మభూమి వరకు ఆరునెలల పాటు గ్రామదర్శిని, గ్రామ వికాసం నిర్వహిస్తామని ఇంకా 9 వరకు వివిధ జిల్లాల్లో ధర్మ పోరాట సభలు.. 75 బహిరంగసభలకు హాజరై వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వంపై నిందలు మోపుతున్న పవన్‌కల్యాణ్ హక్కుల గురించి ఎందుకు ప్రస్తావించరని ప్రశ్నించారు. ఆయన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనంచేసి విభజన సమయంలో తటస్థంగా వ్యవహరించారని ఇప్పుడు పవన్‌కల్యాణ్ కేంద్రంతో చేతులుకలిపి రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని విమర్శించారు.