రాష్ట్రీయం

దళారులదే భోజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదపూడి, జూలై 14: రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు ఏర్పాటైన కేంద్రాలు దళారులకే ఉపయోగపడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1550 ఇస్తున్నామని చెబుతున్నా రూ.1130కి మించి రైతుకు అందడం లేదన్నారు. బినామీలు రంగంలోకి దిగి, తక్కువ ధరకు ధాన్యం కొని, అక్రమంగా తరలిస్తున్నారన్నారు.ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామంలో శనివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో ఏ ఒక్క పంటకూ మద్దతు ధర రాలేదన్నారు. దళారులే బాగుపడుతున్నారని, హెరిటేజ్ సంస్థ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబే పెద్ద దళారీగా మారారని ఎద్దేవాచేశారు. అలాగే రుణమాఫీ పేరుతో ప్రభుత్వం చేసిన
జిమ్మిక్కుల కారణంగా రైతులకు వడ్డీ లేకుండా రుణాలు లభించడంలేదన్నారు. గతంలో ఆరు శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించేవని, ప్రస్తుతం ఆ పద్ధతికి మంగళం పాడారన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం బలభద్రపురంలో ల్యాండ్ సీలింగ్ భూములను టీడీపీ ఎంపీ మురళీమోహన్ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉన్న సంస్థకు కారుచౌకగా అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఎకరం రూ.50 లక్షలు పలికే భూమిని కేవలం రూ.8 లక్షలకు కట్టబెడుతున్నారని పేర్కొన్న జగన్ ‘ఇదే నియోజకవర్గంలో కాలుష్య కారకమవుతున్న కేపీఆర్ ఇండస్ట్రీస్‌ను అధికారంలోకి వస్తే మూయించేస్తానని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఆ సంస్థలో నాకు వాటాలున్నాయని ఆరోపించారు. మరి అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లవుతున్నా ఎందుకు మూయించలేద’ని ప్రశ్నించారు. తాను అధికారంలోకి వస్తే తక్షణం ఈ పరిశ్రమను మూయిస్తానని, సుమారు 500 మందిపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తామని జగన్ ప్రకటించారు. తాను పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, అయితే ప్రజలకు ఇబ్బందులు కలగని రీతిలో వాటిని స్థాపించుకోవాలన్నారు. కేపీఆర్ ఇండస్ట్రీస్ విశాఖలోని ఫార్మా సెజ్‌కు వెళితే తాను సహకరిస్తానని ఈసందర్భంగా జగన్ ప్రకటించారు. అలాగే కాకినాడ సెజ్‌లో సైతం తనకు భాగస్వామ్యం ఉందని, అధికారంలోకి వచ్చాక భూములు రైతులకు పంపిణీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. విపక్షాలపై బురదచల్లడం, రాళ్లేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని జగన్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కురసాల కన్నబాబు, డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, కవురు శ్రీనివాస్, పిల్లి సుభాష్‌చంద్రబోసు, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా, సత్తి సుబ్బిరెడ్డి, తేతలి రామారెడ్డి, చెల్లుబోయిన వేణు తదితలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

చిత్రం..తూ.గో.జిల్లాలోని జి మామిడాడలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో అభివాదం చేస్తున్న జగన్