ఆంధ్రప్రదేశ్‌

15 శాతం వృద్ధి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావాల్సిన లోటు నిధులు 13,766 కోట్లు
విభజన చట్టం హామీలు నెరవేర్చాల్సి ఉంది
2018 నాటికి పోలవరం తొలి దశ పూర్తి
ఏడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
వచ్చే బడ్జెట్‌లో కాపు సంక్షేమానికి వెయ్యి కోట్లు
ప్రపంచస్థాయి ప్రజా రాజధానిగా అమరావతి
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్
ఆంధ్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
నల్ల కండువాలతో హాజరైన వైకాపా సభ్యులు

హైదరాబాద్: వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రం 15 శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని, రాష్ట్ర విభజన వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురైనప్పటికీ అభివృద్ధి సంక్షేమ రంగాల్లో సమ్మిళిత వృద్ధిని నమోదు చేసిందని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. శనివారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు, ఆర్ధిక సమస్యలను ఏకరవుపెట్టారు. శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో 18 పేజీల ఉపన్యాసాన్ని 28 నిమిషాల్లో ముగించారు. తెలుగులో మొదలుపెట్టి ఇంగ్లీషులో ఉపన్యాసాన్ని కొనసాగించారు. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉందన్నారు. గత ఆర్ధిక సంవత్సరం రెవెన్యూ లోటు రూ.16,079 కోట్లు అంచనా వేయగా కేంద్రం గ్రాంటుగా రూ.2303 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఇంకా రూ.13,776 కోట్లను మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఏపి పునర్వ్యవస్ధీకరణ చట్టంలో చేర్చిన విధంగా పార్లమెంటులో హామీ ఇచ్చిన విధంగా పరిశ్రమల అభివృద్ధికి పన్ను, ప్రోత్సాహకాలు, రాజధాని అభివృద్ధికి ఆర్ధిక గ్రాంట్లు, నూతన రైల్వే జోన్ హామీ, జాతీయ ప్రాజెక్టుగా పోలవరానికి ఆర్ధిక సహాయం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనే హామీలను నెరవేర్చాల్సి ఉందన్నారు. అనావృష్టి ఉన్నా వ్యవసాయంలో 8.4 శాతం, తయారీ, సేవా రంగాల్లో వరుసగా 11.13, 11.39 శాతం వృద్ధి నమోదు చేశామన్నారు. ఏడు ప్రాధాన్యత సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 2016 జూన్ నాటికి తోటపల్లి, పోలవరం కుడి ప్రధాన కాలువ, గాలేరు- నగరి, హంద్రీ నీవా, 2017 జూన్ నాటికి వంశధార రెండో దశ, పోలవరం ఏడమ ప్రధాన కాల్వ, వెలిగొండ ప్రాజెక్టులు, 2018 జూన్ నాటికి పోలవరం 1వ దశ పనులను పూర్తి చేయాలన్న నిబద్ధతతో ప్రభుత్వం ఉందన్నారు. రూ.134 కోట్లతో అమలులో లేని 175 ఎత్తిపోతల సాగునీటి వ్యవస్థలను పునరుద్ధరించి 1.5 లక్షల ఆయకట్టును స్ధిరీకరిస్తామన్నారు. కృష్ణా- పెన్నా నదుల అనుసంధానం చేస్తామన్నారు.
రైతుల రుణభారాన్ని తగ్గించేందుకు రూ. 24,500 కోట్లు, ఉద్యానవన రైతులకు రూ. 600 కోట్లను చెల్లించాల్సి ఉందన్నారు. ఇంతవరకు రైతులకు రూ.7433 కోట్లు చెల్లించామన్నారు. మత్స్య పరిశ్రమల విధానం కింద ఆంధ్రను ఆక్వా హబ్ ఆఫ్ వరల్డ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఎన్టీఆర్ భరోసా కింద 43 లక్షల మంది పించనుదారులకు నెలకు రూ.1000, వికలాంగులకు రూ.1500 ఇస్తున్నామన్నారు. హాస్టళ్ల హాజరీని పర్యవేక్షించి తద్వారా జవాబుదారీతనాన్ని పెంచేందుకు బయో మెట్రిక్స్‌ను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పేదల సంక్షేమానికి వచ్చే బడ్జెట్‌లో రూ.1000 కోట్ల నిధులు కేటాయిస్తామన్నారు. బ్రాహ్మణుల్లో పేదలకు సాయం చేసేందుకు సంస్థ ఏర్పాటు చేశామన్నారు. చేనేత రుణమాఫీకి రూ.110.96 కోట్లు ఖర్చు చేశామన్నారు. విద్యార్థుల్లో డిజిటల్ అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు పాఠశాలల్లో దశలవారీగా డిజిటల్ తరగతి గదులు ప్రవేశపెడుతున్నామన్నారు. ఏడు జాతీయ విద్యా సంస్థల్లో ఐదు సంస్థల విద్యా కోర్సులను ప్రారంభించామన్నారు. ఒక్క ఏడాదిలో వాడవాడలా చంద్రన్న బాట కింద 2704 కి.మీ పొడువున సిమెంట్ రోడ్డు వేశామన్నారు. 2022 నాటికి అందరికీ గృహాలు సమకూర్చేందుకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద రెండు లక్షల ఇళ్లు, అందరికీ గృహాల పథకం కింద పట్టణ ప్రాంతాల్లో మరో రెండు లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరునికి ఇసుకను అధీకృత ఇసుక క్వారీల నుండి ఉచితంగా సేకరించేందుకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు.
భూముల విక్రయం, కొనుగోళ్లలో అవకతవకలను అరికట్టేందుకు మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం రూపొందించామన్నారు. అమరావతిని ప్రజా రాజధానిగా ప్రపంచ శ్రేణి ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. అన్ని కుటుంబాలకు అంతర్జాలం అందించేందుకు ఏపి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అమలు చేస్తామని, దీనికి కేవలం నెలకు రూ.150 ఖర్చవుతుందన్నారు.
మిగులు విద్యుత్ సాధించామని, పంపిణీ నష్టాలను 10.29 శాతానికి తగ్గించామన్నారు. భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు, నాగార్జునసాగర్, దొనకొండలో ఐదు కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామన్నారు. నాలుగు లేన్ల లేదా ఆరు లేన్ల రోడ్డు ద్వారా అన్ని జిల్లాలను రాజధానికి అనుసంధానిస్తామన్నారు.
నల్లకండువాలతో వైకాపా హాజరు
అసెంబ్లీ సమావేశాలకు వైకాపా ఎమ్మెల్యేలు నల్లకండువాలతో హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా కొద్దిసేపు వైకాపా ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు.

చిత్రం....ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్