రాష్ట్రీయం

రావెల సుశీల్‌పై నిర్భయ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖా మంత్రి రావెల కిషోర్ కొడుకు సుశీల్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు ఎట్టకేలకు నిర్భయ కేసు నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు శనివారం మంత్రి రావెల క్వార్టర్స్‌కు వెళ్లి నోటీసులు అందించారు. సిఆర్‌పిసి సెక్షన్ 41ఏ కింద ఈ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో శుక్రవారం ఓ ఉపాధ్యాయురాలి పట్ల మంత్రి కొడుకు సుశీల్‌కుమార్ అసభ్యంగా ప్రవర్తించిన విషయం విదితమే. ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న ఆమె విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా మంత్రి కొడుకు తనను వెంబడించి కిడ్నాప్ చేయడానికి యత్నించాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్రి కొడుకని తెలియడంతో పోలీసులు అతనిని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని వచ్చిన అభియోగంతో పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. మంత్రి కొడుకు రావెల సుశీల్‌కుమార్‌తోపాటు డ్రైవర్ రమేశ్‌పైనా నిర్భయ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
కుక్కపిల్ల కారుకు అడ్డుపడిందని..
తాను కావాలని మహిళను వెంబడించలేదని, ఓ కుక్కపిల్ల కారుకు అడ్డురావడంతో కారు ఆపానని మంత్రి రావెల తనయుడు సుశీల్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టినట్టు పోలీసులు చెప్పారు. తనను వెంబడిస్తున్నాడంటూ ఆ మహిళ అకారణంగా తనపై దూషణకు దిగిందని, దీంతో చుట్టుపక్కల వారు గుమిగూడారని ఆ పోస్టులో పేర్కోన్నాడు. అక్కడ జరిగిన విషయం వివరించేలోగానే వారు తనపై చేయి చేసుకున్నారని ఫేస్‌బుక్‌లో సుశీల్ పోస్టు చేశాడు. కాగా ఈ వివాదం శుక్రవారం సాయంత్రమే ముగిసిపోయినా, కావాలని దాన్ని రాద్దాంతం చేస్తున్నారని పేర్కొన్నాడు. ఇదిలావుండగా కుక్క పిల్ల కోసం కారు ఆపానంటూ రావెల సుశీల్ చేస్తున్న వాదనలో ఎంతమాత్రం వాస్తవం లేదని సిసి కెమెరాలో రికార్డు అయిన వీడియో సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి. కెమెరా విజువల్స్‌లో సుశీల్ వాహనం మహిళను కావాలనే వెంబడించింది తేలింది. దీంతో తమ తప్పేమీ లేదని ఫేస్‌బుక్‌లో సుశీల్ చేస్తున్న వాదన అంతా సత్యదూరమని తేలిపోయింది. కేసునుంచి తప్పించుకునేందుకు చివరి దాకా యత్నించిన సుశీల్ తాను మినిస్టర్ కొడుకునంటూ పోలీసు స్టేషన్‌లో కాస్సేపు సిబ్బందిని బెదిరించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
సుశీల్‌ను అప్పగిస్తా: మంత్రి రావెల
మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తన కొడుకు సుశీల్‌ను పోలీసులకు అప్పగిస్తానని, కేసులో తాను జోక్యం చేసుకోనని మంత్రి రావెల కిషోర్ తెలిపారని బంజారాహిల్స్ ఏసిపి ఉదయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం నుంచి మంత్రిని ఈ విషయమై సంప్రదిస్తున్నామని, అయితే మంత్రి సాయంత్రం వరకు అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు వచ్చి తన చేయి పట్టుకొని కారులోకి లాగారని ఓ మహిళ తమకు ఫిర్యాదు చేసిందని, నిందితులను తాము గుర్తించామని, త్వరలోనే అరెస్టు చేస్తామని ఏసిపి వెల్లడించారు. నిందితుల్లో ఒకరిని ఏపి మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు సుశీల్ కుమార్‌గా గుర్తించామని ఆయన చెప్పారు.
కేసు నుంచి తప్పించడం లేదు: డిసిపి
ఉపాధ్యాయురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మంత్రి కొడుకు సుశీల్‌ను పోలీసులు కేసునుంచి తప్పించే యత్నం చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఈ కేసులో ఎవరినీ వదలేది లేదని డిసిపి వెంకటేశ్వర రావు వెల్లడించారు. సుశీల్, అతని డ్రైవర్ రమేశ్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో నిర్భయ చట్టం కింద కేసు నమోదైనట్టు డిసిపి వివరించారు. పోలీసుల దృష్టిలో అందరూ సమానులేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు.