రాష్ట్రీయం

ఏసీబీ వలలో ఏపీ ఇంజనీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 18: అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖాధికారులు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరు ఇళ్లపై బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో లక్షల రూపాయలు విలువైన అక్రమాస్తులు, బంగారం, నగదు గుర్తించినట్లు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ఎవని సత్యనారాయణ(56) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో పర్యావరణ ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్నారు. అవినీతికి పాల్పడుతూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ఏసీబీ సెంట్రల్ ఇన్విస్టిగేషన్ యూనిట్ (సీఐయు) బృందం బుధవారం విజయవాడతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఎనిమిదిచోట్ల దాడులు నిర్వహించారు. విజయవాడ మారుతీ కోఆపరేటివ్ హౌసింగ్ కాలనీలోని సత్యనారాయణ నివాసగృహం, నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్ తదితరచోట్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నిందితుడు సత్యనారాయణ 1989 జనవరి 2న జూనియర్ ఇంజనీరుగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ప్రభుత్వ సర్వీసులో చేరారు. తర్వాత 2000లో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరుగా పదోన్నతి పొంది ప్రస్తుతం విజయవాడలోని రీజనల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో రాజమండ్రి, విశాఖపట్నం, నెల్లూరు, విజయనగరం, కొత్తగూడెం, విశాఖపట్నం, బీహెచ్‌ఎల్, రామచంద్రాపురం తదితరచోట్ల పనిచేశారు.
ఏసీబీ సోదాల్లో సదరు అధికారికి చెందిన 1999 జూలై 1వ తేదీ నుంచి ఇప్పటివరకు కూడబెట్టిన ఆస్తులకు సంబంధించి అక్రమాలను అధికారులు నిగ్గుతేల్చారు. దీంతో అనేక స్థిర, చరాస్తులను గుర్తించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి, మియాపూర్ గ్రామంలోని మాతృశ్రీ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌లో 2014లో కొనుగోలు చేసిన 1660 చదరపు అడుగుల ఫ్లాటును గుర్తించారు. భార్య మాలతి పేరుతో రాజమండ్రిలో 432 గజాల ప్లాటు, విశాఖ జిల్లా యలమంచిలిలో 200 గజాల స్థలం ఉన్నట్లు గుర్తించారు. కుమారుడు ఇ పవన్‌కుమార్ పేరుతో నెల్లూరు దళితవాడలో 266.66 గజాల స్థలం, నెల్లూరులోనే లెక్చరర్ కాలనీలో 260 గజాల మరో స్థలం, యాదాద్రి జిల్లాలో 400 గజాల స్థలం, రంగారెడ్డి జిల్లా మియాపూర్ గ్రామంలో 1555 చదరపు అడుగుల ఫ్లాటు, నెల్లూరు జిల్లాలో 4.44 ఎకరాల భూమి, నెల్లూరు జిల్లాలోనే 1.68 ఎకరాల మరో భూమి ఇతనికి ఉన్నట్లు గుర్తించారు. కుమార్తె ఇ గాయత్రి పేరుతో కాకినాడలో 1480 చదరపు అడుగుల నివాస గృహం, ఇక్కడే మరోచోట 52గజాల స్థలం కనుగొన్నారు. అదేవిధంగా సత్యనారాయణ బినామీ రాధాకృష్ణరాజు పేరుతో రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో శిల్పా అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో ఒక ఫ్లాటు గుర్తించారు. ఇదిలావుండగా చరాస్తుల విషయానికొస్తే సత్యనారాయణ ఇంట్లో రూ. 8.5 లక్షలు నగదు, లాకర్‌లో రూ. 22.15 లక్షలు, రూ. 52 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రూ. 53లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ. 8.3 లక్షలు విలువైన గృహోపకరణాలు, ఒక కేజీ బంగారం, ఆరు కేజీల వెండి, మారుతీ వ్యాగనర్ కారు, ఒక ద్విచక్ర వాహనం సీజ్ చేశారు. అక్రమాస్తుల విలువ మార్కెట్ రేటు ప్రకారం సుమారు 35కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిందితుడు సత్యనారాయణను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీజీ ఠాకూర్ తెలిపారు.