ఆంధ్రప్రదేశ్‌

బౌద్ధ శిల్పాలను తీసుకురండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: బ్రిటీష్ హై కమిషనర్ ఆహ్వానంపై పెట్టుబడులు తెచ్చేందుకు లండన్ వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడున్న మ్యూజియంను సందర్శించాలని అమరావతి అభివృద్ధి అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు విజ్ఞప్తి చేశారు. మ్యూజియంలో ఉన్న అద్భుతమైన బౌద్ధ శిల్పకళా సంపదను అమరావతికి తీసుకువచ్చేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ఈ మేరకు ఆయన ఒక లేఖను సిఎం చంద్రబాబుకు రాసినట్లు తెలిపారు. బ్రిటీష్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ 33ఎ పేరుతో భద్రపరిచారని వివరించారు. ఇప్పటివరకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మరో మంత్రి రాకేష్ తివారిని కలిసి లండన్ మ్యూజియం నుంచి బౌద్ధ శిల్ప సందను అమరావతికి తీసుకురావాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. మ్యూజియంలో ఉన్న శిల్ప సంపద ఛాయా చిత్రాలను తీసుకువచ్చి తమ మంత్రివర్గ సమావేశంలో సమర్పించిన విషయాన్ని జాస్తి సిఎంకు రాసిన లేఖలో తెలిపారు. ఈ అపురూప, పురాతన బౌద్ధ శిల్ప సంపదను వెనక్కి తీసుకు వచ్చి అమరావతిలో భారీ మ్యూజియం ఏర్పాటు చేసి దానిలో ఉంచాలని కోరారు.

భూములు కొంటే తప్పేంటి?
ఐటి మంత్రి పల్లె రఘునాథరెడ్డి
కళ్యాణదుర్గం, మార్చి 6: రాజధానిలో భూములు కొనుగోలు చేస్తే తప్పేముందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాట్లాడుతూ భూములు అడ్డుగోలుగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు చేస్తున్న జగన్ మీ తండ్రి అధికారంలో వున్న రోజుల్లో అధికారం అడ్డుపెట్టుకుని లేపాక్షి హబ్‌లో వేల ఎకరాల భూములు తీసుకోలేదా, లక్ష కోట్లు దోచుకోలేదా అని ప్రశ్నించారు. వాటికితోడు ఎక్కడ ఎన్ని వేల ఎకరాలు తీసుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే అన్నారు. విభజన జరగక ముందే కొందరు భూములు కొనుగోలు చేశారని, వారూ మీలాగే అనుకుంటే ఎలా అన్నారు. చంద్రబాబు వల్లే అభివృద్ధి జరుగుతుందని నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని తెలిపారు.

భూములపై మీరే క్లీన్‌చిట్ ఇవ్వడమేంటి?

దమ్ముంటే సిబిఐ చేత విచారణ జరిపించండి వైకాపా ఎమ్మెల్యేల డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 6: అమరావతి భూములను దళితులు, ఇతర పేదల నుంచి టిడిపి నేతలు అక్రమంగా కొనుగోళ్లు చేశారని తాము చేసిన అభియోగాలకు జవాబు చెప్పకుండా బెదిరించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం అప్రజాస్వామ్యమని వైకాపా ఎమ్మెల్యేలు జి శ్రీకాంతరెడ్డి, ఆళ్లరామకృష్ణారెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఈ అంశాలపై చర్చకు పట్టుబడుతామన్నారు. తాము చేసిన అభియోగాలపై సిబిఐ విచారణకు ఆదేశించి తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు.
విచారణలో అభియోగాలు ఎదుర్కొంటున్న నేతలకు క్లీన్ చిట్ రావాలన్నారు. అలాకాకుండా చంద్రబాబు తనకు తానుగా మురళీమోహన్, లింగమనేని, పత్తిపాటి పుల్లారావు, నరేంద్రకు క్లీన్ చిట్ ఇవ్వడమేంటన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చివరకు ప్రచారమాద్యమాలను ఆడిపోసుకునే స్ధాయికి దిగజారారన్నారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అభివృద్ధికి ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందన్నారు. రాజధాని విషయంలో ముందుగా లీకులు ఇచ్చి అమరావతి పేరును తన సన్నిహితులకు చెప్పి వారి ద్వారా భూములను కొనుగోలు చేయించారన్నారు. రైతులను మోసం చేసి ల్యాండ్ పూలింగ్ చేశారన్నారు.

రోడ్డు ప్రమాదంలో
నలుగురు దుర్మరణం
పెళ్లకూరు, మార్చి 6: నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండల పరిధిలోని పెసలగుర్రప్పతోట గ్రామం వద్ద ఆదివారం రాత్రి 71వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. హైదరాబాద్‌కు చెందిన శేషసాయి తన కుటుంబ సభ్యులతోపాటు ఖమ్మం పట్టణంలో నివాసముంటున్న తన మరదలు బుజ్జి కుటుంబ సభ్యులతో కలసి మూడు రోజుల క్రితం రెండు కార్లలో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం తిరుమలకు బయలుదేరారు. ఆదివారం ఉదయం అక్కడ నుండి బయలుదేరి శ్రీకాళహస్తికి వెళ్లి అక్కడ స్వామిని దర్శించుకొని తిరిగి రాత్రి 9 గంటల సమయంలో ఖమ్మం వెళుతున్నారు. ఈ క్రమంలో శేషసాయి ప్రయాణిస్తున్న కారు ముందుగా నాయుడుపేటకు చేరుకుంది. అక్కడ మరదలు, పిల్లలు ప్రయాణిస్తున్న కారు మండల పరిధిలోని పెసలగుర్రప్పతోట వద్దకు వచ్చేసరికి నాయుడుపేట నుండి తిరుపతికి వెళుతున్న గ్రానైట్ లోడు లారీ వేగంగా వెళుతూ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సాయితేజ (23), మనోజ్‌సాయి (20), శ్రీనాథ్ (19), బుజ్జి (45) అక్కడికక్కడే చనిపోగా, సంజన తీవ్రంగా గాయపడింది. ఈమెను 108 సిబ్బంది నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను నెల్లూరుకు తరలించారు. పెళ్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముద్రగడా..
ఇంత దిగజారుడా?
మండిపడ్డ మంత్రి నారాయణ

హైదరబాద్, మార్చి 6: ముద్రగడ పద్మనాభం అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ రాష్ట్ర పురపాలక మంత్రి పి. నారాయణ మండిపడ్డారు. కాపుల రిజర్వేషన్ కోసం తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందన్నారు. కాపు కార్పోరేషన్ ద్వారా పచ్చచొక్కాల వారికే రుణాలు ఇస్తున్నారంటూ ముద్రగడ చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. కాపుల్లో అర్హులైన అందరి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని, ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారికే ఆర్థిక సాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. కాపులను బిసిల జాబితాలో చేర్చేందుకు హడావుడిగా నిర్ణయాలు తీసుకోలేదని, ఒకవేళ హడావుడి నిర్ణయాలు తీసుకుంటే చట్టం ముందు, కోర్టుల ముందు నిలవకపోతే కష్టమన్నారు. ఈ కారణంగా శాస్ర్తియంగా రిజర్వేషన్లు కల్పించేందుకు, చట్టపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో బిసి కమిషన్‌ను నియమించామన్నారు.
‘మంత్రి రావెలను డిస్మిస్ చేయాలి’
హైదరాబాద్, మార్చి 6: తన కుమారుడు సుశీల్ ఒక యువతిని వేధించి జైలుపాలైన ఘటనలో తక్షణమే ఏపి మంత్రి రావెల కిషోర్ బాబు మంత్రి పదవికి రాజీనామా చేయాలని వైకాపా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మహిళలంటే గౌరవం ఉంటే, మంత్రి రావెలను మంత్రివర్గం నుండి డిస్మిస్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఏమి జరిగినా జగన్ హస్తం ఉందన్న చెప్పడం అధికార పార్టీకి చేతకాని తనమన్నారు. వీడియో ఫుటేజిలో స్పష్టంగా మంత్రి కుమారుడు ప్రవర్తన కనపడిందన్నారు. కుక్కపిల్ల థియరీ పనిచేయలేదన్నారు. ఫుటేజిని మార్ఫింగ్ చేశారని మంత్రి చెప్పడం దుర్మార్గమన్నారు. మంత్రి తన కుమారుడికి బుద్ధి చెప్పడం మాని కేసును వక్రీకరించడం తగదన్నారు.
ఇక సినిమా నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడుతూ మహిళల గురించి మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా బాలకృష్ణ మాట్లాడడం క్షమించరాని నేరమన్నారు. ఒక ఎమ్మెల్యే ఇలా మాట్లాడవచ్చా అన్నాలరు. టిడిపి ఎమ్మెల్యేలకు మహిళలంటే గౌరవం లేదన్నారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె చంద్రబాబును డిమాండ్ చేశారు.

వైకాపా ఎమ్మెల్యే
గన్‌మెన్ రివాల్వర్ చోరీ

హైదరాబాద్, మార్చి 6: వైకాపా ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి గన్‌మెన్ గౌస్ పాషా రివాల్వర్ మాయమైంది. ఆదివారం పలమనేరు నుంచి హైదరాబాద్ వస్తుండగా రివాల్వర్ చోరీకి గురైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన బ్యాగు తెరచి చూసుకోగా అందులో రివాల్వర్ లేదు. అఫ్జల్‌గంజ్ స్టేషన్‌లో ఫర్యాదు చేశారు. బస్ స్టేషన్‌కు వచ్చిన పోలీసులు సిసి పుటేజీ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. బస్సులో ఎవరెవరు ప్రయాణించారో ఆరా తీస్తున్నారు.