రాష్ట్రీయం

ఎన్డీఏ హయాంలోనే.. బాక్సైట్ తవ్వకాలకు బాబు యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 1: వాజపేయ్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నాలు జరిపారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. రాజమండ్రికి చెందిన సమత స్వచ్ఛంద సంస్థ పర్యావరణాన్ని దెబ్బతీసే బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయగా, స్థానిక గిరిజనుల ప్రయోజనాలు, ప్రమేయం లేకుండా బాక్సైట్ తవ్వకాలు జరపవద్దని స్పష్టం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజ్యాంగ సవరణ చేసి, తవ్వకాలకు అవకాశం కల్పించాలని కోరుతూ రహస్యంగా కేబినెట్ భేటీ నోటును తయారుచేసి కేంద్రానికి పంపారన్నారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం రూపొందించిన కేబినెట్ భేటీ నోటును మంగళవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఉండవల్లి బయటపెట్టారు. అయితే వాజపేయి ప్రభుత్వం అప్పటి అటార్నీ జనరల్‌ను సంప్రదించగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతి వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేశారన్నారు. తాజాగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం వెనుకడుగు వేసి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో శే్వతపత్రం పేరిట అబద్ధాలు చెప్పిస్తోందని ధ్వజమెత్తారు. బాక్సైట్ తవ్వకాలపై సమగ్ర వివరాలతో శే్వతపత్రాన్ని విడుదల చేయడంతో పాటు, బహిరంగ విచారణకు సిద్ధం కావాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే బాక్సైట్ తవ్వకాలకు అనుమతించినట్లు చెబుతున్నారని, ఆ జిఓకు, వైసిపి అధినేత జగన్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
బాక్సైట్ తవ్వకాలకు జగన్, ఆయన బినామీ ప్రతాప్‌రెడ్డి అనుమతులు పొందినట్లు చెబుతున్నారన్నారు. ఈ విషయాన్ని నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటి గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి బాలరాజు, కేంద్ర మంత్రి కిషోర్‌చంద్రదేవ్ బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. ఎన్నికల ముందు బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే తవ్వకాలకు ఎలా అనుమతులు ఇచ్చారని ఉండవల్లి ప్రశ్నించారు. జగన్‌పై కాంగ్రెస్ హయాంలోనే అక్రమార్జన కేసులు నమోదయ్యాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క కొత్త కేసు నమోదు చేయలేకపోయిందన్నారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జగన్ అక్రమార్జనకు పాల్పడినట్లు నిరూపించి, జైల్లో పెట్టవచ్చని సలహా ఇచ్చారు. ఎన్నికలకు ముందు పాలనలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు అధికారంలోకి రావాలని తాను కూడా కోరుకున్నానని, అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, పారదర్శకతకు పాతర వేసిందన్నారు. విమర్శలను, ప్రశ్నించడాన్ని సహించడం లేదన్నారు. చంద్రబాబునాయుడు తప్పుడు విధానాల వల్ల కొత్తగా ఏర్పడిన ఎపి మనుగడకే తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు ఇలాగే కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, ఇది రహస్యంగా సాగినా ఇబ్బంది లేదని ఎద్దేవాచేశారు. గోదావరి పుష్కరాల తొక్కిసలాట దుర్ఘటనపై ప్రభుత్వం నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. పైగా చంద్రబాబు తాను అక్కడ స్నానం చేయలేదని అబద్దాలు చెబుతున్నారన్నారు. తొక్కిసలాట ఘటనపై ఏర్పాటుచేసిన జస్టిస్ సోమయాజులు కమిటీ ముందు తాను హాజరై, తన వద్ద ఉన్న సమాచారాన్ని అందజేస్తానని ఉండవల్లి చెప్పారు.