రాష్ట్రీయం

అవినీతికి ‘రీ-డిజైన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఉద్యోగాలు రాలేదు.. హామీలు నెరవేరలేదు
* మేమొస్తే తెలంగాణ స్వప్నం సాకారం చేస్తాం
* విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభలో రాహుల్
హైదరాబాద్, ఆగస్టు 14: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రీ-డిజైన్’ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మంగళవారం సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన ‘విద్యార్థి- నిరుద్యోగ గర్జన’లో 37 నిమిషాలపాటు రాహుల్ ప్రసంగించారు. కేంద్రంలోని ఎన్‌డీఏ పాలనపై, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ పాలనపైనా రాహుల్ మండిపడ్డారు. రెండు ప్రభుత్వాలూ ప్రజలను మోసం చేశాయని, రైతాంగాన్ని, నిరుద్యోగులను పట్టించుకోలేదని, ఒకప్పుడు ‘అవినీతి’ అని చెప్పే మాటను ఇప్పుడు ‘రీ-డిజైన్’ అని పిలుచుకుంటూ ఈ ప్రభుత్వాలూ ప్రజలను లూటీ చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు జరుగుతాయని ప్రజలు కొట్లాడారని, కానీ ఆ స్వప్నం మాత్రం నెరవేరలేదని అన్నారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ప్రజల ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగాన్ని పారద్రోలి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, రైతాంగానికి బాసటగా నిలుస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ప్రాణాలు ఒదిలిన ఉద్యమకారులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు రాహుల్ చెప్పారు.
తెలంగాణ ఏర్పడితే ఏ స్వప్నం పూర్తవ్వాలనుకున్నామో అది చాలా మహత్తరమైనదని, రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి జరిగితే ఆ ఫలాలు అందుతాయని అంతా కలలు కన్నారని, ఆ కల సాకారం కాలేదని అన్నారు. తెలంగాణ అమరవీరుల జీవితాలు బాగుచేస్తానని చెప్పిన కేసీఆర్ తర్వాత విస్మరించారని అన్నారు. ఎన్నికల సమయంలో ఏటా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని, అసలు వాస్తవం నిరుద్యోగులకు ఇపుడు అర్థమైందని అన్నారు. నోటిఫికేషన్లు లేవు, ఉద్యోగాలు భర్తీ కాలేదు అని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని దూరం చేశారని, రైతులకు మద్దతు ధర ఇస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేశారని, అవి నెరవేరక 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.
ప్రధాని తాను దేశ సేవకుడిని, కాపాలదారుడ్ని అని చెప్పుకుంటూనే తన మిత్రులకు రాఫెల్ కాంట్రాక్టును కట్టబెట్టారని, రూ.525 కోట్లు ఖరీదు చేసే విమానాలను రూ.1600కోట్లు వెచ్చించి కొన్నారని, ఆ కాంట్రాక్టు తీసుకున్న సంస్థను కేవలం 10 రోజుల ముందు మాత్రమే నెలకొల్పారని, దీనిపై వివరాలు అడిగితే అంతా గోప్యం అంటున్నారని, తనకు చెప్పడానికి గోప్యం అయినా, ప్రజలకు వివరించాలి కదా అని రాహుల్ అన్నారు. రీ-డిజైన్ పేరుతో యుపిఏ రాఫెల్ డీల్‌ను అనిల్ అంబానీకి లక్షల కోట్లకు కట్టబెట్టారని అన్నారు. దీంతో స్థానికంగా రావాల్సిన ఉద్యోగాలకు గండికొట్టారని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రీ-డిజైన్ స్పెషలిస్టు అని ఆరోపించారు. పేద రైతుల వద్ద దుర్మార్గంగా భూములు తీసుకుంటున్నారని, అంబేద్కర్ పేరుతో ప్రాణహిత చేపడితే దానిని రీడిజైన్ చేశారని, రూ.2500కోట్ల ప్రాజెక్టును పేరు మార్చి రీడిజైన్ చేసి రూ.38వేల కోట్లకు పెంచారని, అది కాస్తా ఇపుడు కాళేశ్వరం పేరిట లక్ష కోట్లకు పెరిగిందని అన్నారు. ఈ దోపిడీకి లెక్కా జమా లేదని, దీనికి ఎలాంటి టెండర్లు లేవని ఆరోపించారు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను 2500 కోట్లతో ప్రతిపాదించగా, దానిని రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు అని గారడీ మాటలు చెప్పి రూ.2500 కోట్ల ప్రాజెక్టును రూ.2వేల కోట్లకు వ్యయాన్ని పెంచారని ఆరోపించారు. ఢిల్లీలో నరేంద్ర మోదీ రీడిజైన్ అంటుంటే.. రాష్ట్రంలో కేసీఆర్ కూడా రీడిజైన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. రాఫెల్ అంశంపై తాను లోక్‌సభలో ప్రధాని కళ్లలో కళ్లుపెట్టి మాట్లాడితే ప్రధాని మాత్రం పక్కచూపులు చూశారని వ్యంగ్యంగా చెప్పారు. ఢిల్లీలో నోట్ల రద్దు కాగానే ఇక్కడ సీఎం దానికి మద్దతు ఇచ్చారని.. అక్కడ జీఎస్‌టీ విధించగానే ఇక్కడ సీఎం చప్పట్లు కొట్టి రాక్షసానందం పొందారని, ప్రధాని అందరిపై ఆంక్షలు విధించి అణచివేస్తుంటే తెలంగాణలోనూ అదే జరుగుతోందని అన్నారు. దేశస్థాయిలో పేదల భూములను లాక్కుంటే కేసీఆర్ సైతం ప్రాజెక్టుల పేరుతో పేదల భూములను కొల్లగొడుతున్నారని అన్నారు. కేజీ నుండి పీజీ వరకూ ఉచిత విద్య అని చెప్పిన కేసీఆర్ హైదరాబాద్ స్కూళ్లలో దేశంలోనే అత్యధిక ఫీజులున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. ఇద్దరు నేతలు తమకోసమే కలలు కంటున్నారని, కానీ దేశ ప్రజలకోసం కలలు కనడం లేదని అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ లేపేస్తే.. తెలంగాణలో ధర్నాచౌక్ తొలగించారని, దళితులు, మైనార్టీలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని అన్నారు. ‘్భటీ బచావో-్భటీ బడావో’ అనే పథకాన్ని ప్రధాని ప్రకటించారని, ‘్భటీ బచావో’ అంటే ఎవరి నుండి రక్షించాలో చూస్తుంటే బీజేపీ నేతల నుండే రక్షించాలని బీహార్ సంఘటన చూస్తుంటే అర్థమవుతోందని అన్నారు. తాను ఏదీ అబద్దం చెప్పడం లేదని, తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసేందుకే వచ్చానని అన్నారు. ఇంత పెద్దస్వప్నం సాకారం కావడానికి సమయం పట్టొచ్చని.. నాలుగేళ్ల కాలంలో ఆ స్వప్నానికి పునాదులు కూడా ఇంకా పడలేదని.. నాలుగు కోట్లమంది పోరాట ఫలితం ఒకే కుటుంబం సొంతం చేసుకుందని.. ప్రాజెక్టులను రీ స్ట్రక్చరింగ్ పేరుతో ఒకే కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు. తెలంగాణ యువకుల భవిష్యత్ అంధకారంగా మారిందని, తాము అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామని, రైతులకు బాసటగా ఉంటామని అన్నారు. నాలుగేళ్లలో ఎంఎస్పీ పేరు చెప్పి నరేంద్ర మోదీ 10వేల కోట్ల ఇస్తే తాము అధికారంలోకి రాగానే కర్నాటకలో రూ.31వేల కోట్ల మేర రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చి జీఎస్టీ పేరుతో చిన్న చిన్న వ్యాపారాలు, దుకాణాలు నడుపుకునేవారి నడ్డి విరిచిందని.. తాము జీఎస్టీని క్రమబద్ధీకరించి వారిని ఆదుకుంటామని అన్నారు. ఐదు రకాల స్లాబులు స్థానే ఒకే స్లాబ్ తెస్తామని, కొంతమందిని మినహాయిస్తామని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గి అన్ని దేశాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతుంటే భారత్‌లో మాత్రం ధరలు పెరుగుతున్నాయని అన్నారు. రాఫెల్ విమానాల కొనుగోలు విషయంలో చర్చకు తాను సిద్ధమని, కాని ప్రధాని తన ముందు నిలవలేరని అన్నారు. తాము అధికారంలోకి రాగానే విద్యా సంస్కరణలు చేసి ప్రజలకు తక్కువ ధరకే వైద్యం, విద్య అందిస్తామని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలలని, కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని, తెలంగాణ అభివృద్ధికి దోహదం చేయాలని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో కష్టపడ్డవారికే టిక్కెట్లు దక్కుతాయని, పారాచూట్‌లలో వచ్చేవారికి టిక్కెట్లు ఇచ్చేది లేదని అన్నారు.
నిరుద్యోగ భృతి: ఉత్తమ్
తెలంగాణలో అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ప్రతి నెలా మూడు వేలు చొప్పున భృతి ఇస్తామని టిఎస్‌పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ను ఆదరించాలని, అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
హేమాహేమీలు
ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, శాసనసభాపక్ష నేత జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క, మాజీ ఎంపీ వి. హనుమంత రావు, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, వేలాది మంది అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.